అదే స్ఫూర్తి..!

ABN , First Publish Date - 2020-03-24T10:33:40+05:30 IST

జిల్లాలో కడప నగరంతో పాటు పల్లె, పట్నం అన్న భేదం లేకుండా అన్ని ప్రాంతాలు కరోనాపై సమరానికి

అదే స్ఫూర్తి..!

రెండో రోజు కూడా ఇల్లు దాటని జనం

తెరుచుకోని  వాణిజ్య దుకాణాలు

బ్యాంకు సేవలు కుదింపు

వైద్య, ఆరోగ్యం, పోలీసు, పారిశుధ్య సిబ్బంది సేవలపై ప్రశంసలు

రైతుకు తప్పని కరోనా ఎఫెక్ట్‌

కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరిగి  సామాన్యులకు తప్పని  ఇబ్బందులు


కడప, మార్చి 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కడప నగరంతో పాటు పల్లె, పట్నం అన్న భేదం లేకుండా అన్ని ప్రాంతాలు కరోనాపై సమరానికి సన్నద్ధమయ్యాయి. ప్రధాని మోదీ పిలుపుతో ఆదివారం జనతా కర్ఫ్యూకు సంపూర్ణ మద్దతు పలికి సక్సెస్‌ చేశారు. రాష్ట్రంలో ఈ వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తుండడంతో సామాజిక బాధ్యతగా ప్రజల సహకారంతోనే కరోనా వ్యాప్తికి  కళ్లెం వేయడం సాఽధ్యమని సీఎం వైఎస్‌ జగన్‌ ఈనెల 31వతేదీ వరకు లాక్‌డౌన్‌ ప్రకటించారు. ప్రజలు జనతా కర్ఫ్యూ స్ఫూర్తితోనే లాక్‌డౌన్‌ కార్యక్రమంలో మమేకమయ్యారు.


సోమవారం ఇళ్లల్లో నుంచి బయటికి రాలేదు. ఉదయం 10 గంటల వరకు వాహనాలు రోడ్లపై తిరిగాయి. ఆ తరువాత పోలీసుల కట్టడితో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కర్నూలు-చిత్తూరు వయా కడప జాతీయ రహదారి బోసిపోయింది. వాణిజ్య దుకాణాలు స్వచ్ఛంద బంద్‌తో మూతబడ్డాయి. కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, రైల్వేకోడూరు, పులివెందుల, రాయచోటి, మైదుకూరు ప్రాంతాల్లో వ్యాపారాలు పూర్తిగా బంద్‌ అయ్యాయి.


కూరగాయల ధరలకు రెక్కలు

కరోనాపై సమరంలో భాగంగా లాక్‌డౌన్‌ పాటిస్తుండడంతో నిత్యావసర సరుకుల్లో ఒకటైన కూరగాయల ధరలు చుక్కలను తాకాయి. కిలో రూ.10 ఉన్న టమోటా రూ.30కి చేరింది. బెండ రూ.70 - 90, వంకాయ రూ.50 - 60, పచ్చిమిరప కిలో రూ.20కి పైగా విక్రయించారు. కరోనా కర్ఫ్యూ ఎఫెక్ట్‌తో ఆయా కూరగాయల ధరలు కిలోపై రూ.10 నుంచి 30కి పైగా పెరగడంతో సామాన్యులు విలవిల్లాడారు. కూరగాయల రవాణా లేకపోవడమే ఇందుకు కారణమని వ్యాపారులు అంటున్నారు. 


నష్టపోతున్న రైతు

కరోనా కర్ఫ్యూ వల్ల రవాణా, ఎగుమతులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఉద్యానపంటలతో పాటు పసుపు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో 1.22 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేశారు. అరటి 20 వేల హెక్టార్లు, మామిడి 31 వేల హెక్టార్లు, చీనీ 19 వేల హెక్టార్లలో సాగైంది. జిల్లా నుంచి ఢిల్లీ, గుజరాత్‌, మహారాష్ట్ర, చెన్నై వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. రవాణా లేకపోవడంతో పొలాల్లోనే పంట నిలిచిపోయింది. 15 రోజుల క్రితం గరిష్టంగా టన్ను రూ.15 వేలు ఉంటే ప్రస్తుతం రూ.3,500లకు పడిపోయింది.


చీనీ టన్ను రూ.40 వేలు ఉంటే రూ.20 వేలకు కొనేవారు లేరు. ఇతర ఉద్యాన పంటల పరిస్థితి ఇదే. విదేశాలకు పసుపు ఎగుమతి నిలిపివేయడంతో ధర పతనమైంది. ఇప్పుడిప్పుడే కొత్త పసుపు మార్కెట్‌కు వస్తోంది. మూడు రోజుల క్రితం క్వింటాల్‌ రూ.5,800- 6 వేలు పలికింది. ప్రస్తుతం గరిష్టంగా రూ.5300 లకు కూడా కొనేవారు లేరు. నేటి నుంచి పసుపు కొనుగోళ్లను ఆపేశారు. 


బ్యాంకు సేవలు కుదింపు

బ్యాంకు సేవలను కుదించారు. కరోనా ప్రభావం వల్ల సగం మంది సిబ్బంది మాత్రమే విధులకు వస్తున్నారు. దీంతో చెక్‌ క్లియరెన్స్‌, డిపాజిట్లు, విత్‌డ్రాలు మాత్రమే చేస్తున్నారు. కొత్త ఖాతాలు ఓపెన్‌ చేయడం లేదు. కరోనా సెలవులతో విద్యార్థులకు ఇళ్లకు  వెళ్లడంతో వైవీయూ, రిమ్స్‌ మెడికల్‌ కాలేజీ ఎస్‌బీఐ బ్రాంచ్‌లను తాత్కాలికంగా మూసివేసినట్లు లీడ్‌బ్యాంకు మేనేజరు ఆంజనేయాచారి తెలిపారు.


వారి సేవలు ప్రశంసనీయం

కరోనా వ్యాప్తి భయంతో జనం ఇళ్లకే పరిమితమైపోయారు. బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. అయితే.. ప్రజాసేవలో మేము సైతం అంటూ కరోనాకు భయపడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ విధి నిర్వహణలో నిమగ్నమైన ఆయా సిబ్బంది సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రధానంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది, వైద్యుల సేవలు కొనియాడుతున్నారు. మండుటెండలో సైతం పోలీసులు విధి నిర్వహణలో రోడ్లపై ఉంటూ కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పారిశుధ్య సిబ్బంది తెల్లవారకముందే విధుల్లో చేరి చె త్త చెదారం తొలగిస్తూ పట్టణ పరిశుభ్రతకు పాటుపడుతున్నారు. వైద్యం, పోలీసు, పారిశుధ్య సిబ్బంది సేవలపై ప్రజలు ప్రశంసిస్తున్నారు.


Read more