ఎదురుచూపు..ఆకాశంలో ఊరిస్తున్న మబ్బులు

ABN , First Publish Date - 2020-06-16T11:37:19+05:30 IST

ఖరీఫ్‌ ఆరంభం అయింది.. పదును వానొస్తే భూమిలో విత్తనాలు వేసేందుకు రైతులు సిద్ధం అయ్యారు. ఆకాశంలో మేఘాలు ఆశలు

ఎదురుచూపు..ఆకాశంలో ఊరిస్తున్న మబ్బులు

అక్కడక్కడా చిరుజల్లులు

నెలలో కురిసిన వర్షం 38 మి.మీలే

జిల్లాలో 1.15 లక్షల హెక్టార్లలో పంటల సాగు

విత్తు వేసేందుకు సిద్ధం అవుతున్న రైతులు


కడప, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఖరీఫ్‌ ఆరంభం అయింది.. పదును వానొస్తే భూమిలో విత్తనాలు వేసేందుకు రైతులు సిద్ధం అయ్యారు. ఆకాశంలో మేఘాలు ఆశలు రేపుతున్నాయి. మబ్బులు కమ్ముకుంటున్నా చిరు జల్లులు తప్ప పదును వాన లేదు. ముఖ్యంగా జమ్ములమడుగు, పులివెందుల, ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాంతాల్లో పత్తి సాగుకు ఇదే అదును. అరకొరవానలకే కొందరు దుక్కులు చేస్తున్నారు. పదును వానకోసం రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. జిల్లాలో 1.15 లక్షల హెక్టార్లలో పంటల సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు.


జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 1,15,836 హెక్టార్లలో పంటల సాగుకు వ్యవసాయ యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. ఆహార ధాన్యాలు 46,660 హెక్టార్లలో పప్పుదినుసులు 12,842, ఆయిల్‌ సీడ్స్‌ 25,939, వాణిజ్య పంటలు 28 వేల హెక్టార్లలో సాగు చేయనున్నారు. ప్రధాన పంటలు పత్తి 20 వేలు, వేరుశనగ 24,500, కంది 8,500 హెక్టార్లలో సాగు చేస్తారని అంచనా. నైరుతి రుతు పవనాల కదిలికలతో ఖరీఫ్‌ ఆశాజనకంగా ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు. ఇప్పటికే బోరుబావుల కింద మిరప, ఉల్లి నాట్లు వేస్తున్నారు. వర్షాధారంగా పత్తి, వేరుశనగ విత్తనాలు వేసేందుకు దుక్కులు దున్ని, ఎరువులు చల్లి పొలాలు సిద్ధం చేస్తున్నారు. సీజన్‌ మొదలై రోజులు గడుస్తున్నా.. చినుకు జాడ లేదు. గాలులు తప్ప మేఘం కరుణించడం లేదు.


చిరుజల్లులే

సరిహద్దు కర్నూలు జిల్లాలో కురిసిన వర్షాలకు పెన్నా నదికి వరద వచ్చింది. నదీతీర గ్రామాల్లో కాస్త ఊరట కలిగించింది. ఎత్తిపోతల పథకాల కింద సాగు చేపట్టారు. తీరగ్రామాలకు తాగునీటికి ఉపశమనం లభించింది. జిల్లాలో మాత్రం ఆశించిన మేర వాన కురవలేదు. మేఘాలు గాలులకు కరిగిపోతున్నాయి. జూన్‌ నెలలో సాధారణ వర్షపాతం 68.20 మి.మీలు. 15వ తేది దాక 42.2 మి.మీలు వర్షపాతం నమోదు కావాలి. కాగా.. ఇప్పటి వరకు కురిసింది కేవలం 38.0 మి.మీలే. వర్షపాత నమోదు లెక్కల ప్రకారం తొలి 15 రోజుల్లో 10 శాతం తక్కువ వర్షపాతం నమోదయింది. మిగిలిన ఈ 15 రోజుల్లో మిగిలిన వర్షపాతం నమోదు అవుతుందని అధికారుల ఆశాభావం. దువ్వూరు మండలంలో 10 మి.మీల వర్షపాతం నమోదయింది. దీంతో అక్కడ పసుపు నాటుకు రైతులు సన్నద్ధమవుతున్నారు.


ఎరువులు.. విత్తనలు రైతు భరోసా కేంద్రాల్లోనే..

ఖరీఫ్‌లో యూరియా 35 వేల మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 8,850, కాంప్లెక్స్‌ 28,092, ఎంవోపీ 5,100, ఎస్‌ఎ్‌సపీ 6 వేలు, మినరల్‌ ఎరువులు 1,700 మెట్రిక్‌ టన్నులు కలిపి 84,745 మెట్రిక్‌ టన్నుల రసాయన ఎరువులు అవసరమని వ్యవసాయ అధికారుల అంచనా. అలాగే.. వేరుశనగ విత్తనాలు 30 శాతం రాయితీపై 30,703 క్వింటాళ్లు పంపిణీ చేశారు. కందులు 1,509 క్వింటాళు,్ల పెసర 200, మినుము 28, కొర్ర 1,92.8, రాగి 7.5 క్వింటాళ్లు రాయితీపై పంపిణీకి సన్నాహాలు చేశారు. కొర్ర, రాగి విత్తనాలు 50 శాతం సబ్సిడీ ఇస్తే.. మిగలిన విత్తనాలు 30 శాతం సబ్సిడీపై ఇవ్వనున్నారు. జిల్లాలో 620 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు ఏవి కావాలన్నా రైతు భరోసా కేంద్రాల నుంచే సరఫరా చేయనున్నట్లు వ్యవసాయ శాఖ జేడీ మురళీకృష్ణ తెలిపారు.


25 మి.మీల వర్షం పడితేనే విత్తనాలు వేయాలి- డాక్టర్‌ పద్మోదయ, ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌, వ్యవసాయ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, కడప

నైరుతి రుతుపవనాలు వెనక్కి వెళ్లినట్లు కనిపిస్తున్నాయి. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నా వర్షాలు కురవడం లేదు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖరీఫ్‌ ప్రారంభం జూన్‌ నుంచి జూలై 15వ తేది వరకు వేరుశనగ, పత్తి, పసుపు, ఆముదం వంటి సాధారణ పంటలు విత్తు వేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఆగస్టు ఆఖరు వరకు కంద పంట సాగు చేయవచ్చు. ఆప్పటికీ వర్షాలు రాకపోతే ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాల్సి ఉంటుంది. అర పదును వానకే విత్తు భూమిలో వేసి రైతులు నష్టపోతున్నారు. 25 మి.మీల వర్షం పడితేనే భూమిలో విత్తనాలు వేయాలి.


పంట రుణాలు రూ.8 వేల కోట్లు

జిల్లాలో 2020-21 ఖరీ్‌ఫలో సాగు లక్ష్యం (హెక్టార్లలో) 


పంటలు సాధారణ లక్ష్యం

వరి 33,084 40,000

వేరుశెనగ 24,593 24,500

పత్తి 20,079 20,000

పసుపు 3,919 3,920

కంది 8,562 8,500

జొన్న 3,827 4,200

సజ్జ 2,744 2,750

మొక్కజోన్న 425 500

పెసలు 1,081 1,081

మినుము 1,861 1,861

ప్రొద్దుతిరుగుడు 589 589

ఆముదం 697 700

మిరప 971 971

చెరుకు 273 280

ఉల్లి 3,227 3,225

ఇతర పంటలు 5,678 2,763

మొత్తం 1,08,614 1,15,836

Updated Date - 2020-06-16T11:37:19+05:30 IST