డబ్బులు చెల్లించాలని వేధించడంతోనే..దారుణ హత్య

ABN , First Publish Date - 2020-06-26T10:12:42+05:30 IST

యర్రగుంట్ల పట్టణం మహాత్మానగర్‌కు చెందిన మలిశెట్టి వెంకటరమణ (60)ను దారుణంగా హత్య చేసిన కేసులో ఎర్రగుంట్ల మాజీ మున్సిపల్‌

డబ్బులు చెల్లించాలని వేధించడంతోనే..దారుణ హత్య

మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అరెస్టు

రోకలిబండ, మచ్చుకత్తి స్వాధీనం

48 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులను అభినందించిన ఎస్పీ


కడప (క్రైం), జూన్‌ 25: యర్రగుంట్ల పట్టణం మహాత్మానగర్‌కు చెందిన మలిశెట్టి వెంకటరమణ (60)ను దారుణంగా హత్య చేసిన కేసులో ఎర్రగుంట్ల మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ హనుమానగుట్టి ముసలయ్యతో పాటు ఆయన సోదరుడి కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ జిల్లా పోలీసు కార్యాలయంలో కడప డీఎస్పీ సూర్యనారాయణతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలు వెల్లడించారు. మలిశెట్టి వెంకటరమణ ఎర్రగుంట్లలోని సిమెంటు ఫ్యాక్టరీలో పనిచేస్తూ రిటైర్‌ అయ్యారు. ఈయన ఎర్రగుంట్లలోని మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ హనుమానగుట్టి ముసలయ్యకు రూ.10 లక్షల మేర అప్పుగా ఇచ్చి ముసలయ్యకు సంబంధించి కడపలోని ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అయితే కడపలోని 18 సెంట్ల స్థలాని కూడా ఆయకం పెట్టినట్లు తెలిపారు.


నిందితుడి అప్పు చెల్లించినప్పటికీ తన బాకీ ఇంకా ఉందని పూర్తి అప్పు చెల్లిస్తే ఇంటికి సంబంధించిన పత్రాలు ఇస్తానంటూ చెప్పడంతో అది తట్టుకోలేక ముసలయ్య వెంకటరమణ అడ్డు తొలగించుకోవాలని పథకం రచించాడు. ఈనెల 20న ముసలయ్య వెంకటరమణకు ఫోను చేసి నా ఇంటిపత్రాలు తీసుకుని వస్తే నీకు డబ్బు ఇచ్చి సెటిల్‌మెంటు చేస్తానని చెప్పి నిందితుడిని పిలిపించుకున్నట్లు తెలిపారు. అదే సమయంలో డబ్బులు ఇస్తానంటూ లోపలికి వెళ్లిన ముసలయ్య ఇంట్లోని రోకలిబండ తీసి వెంకటరమణ తల వెనుకభాగంలో గట్టిగా బాదడంతో అక్కడికక్కడే కింద పడి మరణించినట్లు తెలిపారు. దీంతో ఇంట్లో ఉన్న మచ్చుకత్తితో మృతుడి తలను వేరు చేసి సాయంత్రం 6 గంటల సమయంలో సోదరుడి కొడుకైన శ్రీనాధ్‌ను పిలిపించుకుని ఇద్దరూ కలిసి మృతదేహాన్ని ఇంటి ఆవరణంలోని బాత్‌రూము వద్ద ఉన్న నీళ్ల తొట్టిలో వేసి ఇసుక, రాళ్లతో కట్టారు.


రాత్రి అక్కడే పడుకుని ఉదయాన్నే సమీపంలోని ఓ వ్యక్తికి సంబంఽధించిన స్కూటీ తీసుకుని మృతుడి తలను ఒక క్యారియర్‌లో పెట్టి మృతుడు వేసుకున్న వస్తువులతో పాటు ఇంట్లో ఉన్న రక్తం మరకలు శుభ్రం చేసిన దుస్తులను ఓ సంచిలో పెట్టుకుని ముసలయ్య, శ్రీనాధ్‌ కలిసి గువ్వలచెరువు ఘాట్‌ అడవిలో విసిరేసి కడపకు వచ్చినట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తిని కడప ఆర్టీసీ బస్టాండులో టాయ్‌లెట్‌ పక్కన పడేసి కడపలో ఉన్న కూతురు ఇంటికి నిందితులిద్దరూ వెళ్లారు. ఈనెల 22న మళ్లీ తిరిగి ఎర్రగుంట్ల వెళ్లి ఇంటిని శుభ్రపరిచినట్లు తెలిపారు.


మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఈనెల 22న మిస్సింగ్‌ కేసు పెట్టి సాంకేతిక దర్యాప్తు చేపట్టడంతో మృతుడి కాల్‌డేటా ఆధారంగా ముసలయ్యను అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ముసలయ్యను, అతని సోదరుడి కుమారుడు శ్రీనాధ్‌ను అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన రోకలిబండ, మచ్చుకత్తి, స్కూటీ, స్థల పత్రాలు స్వాధీనం చేసుకుని ఈ మేరకు రిమాండుకు తరలించినట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కడప డీఎస్పీ సూర్యనారాయణ, ఎర్రగుంట్ల సీఐలు సదాశివయ్య, ఉలసయ్య, సిబ్బంది బాగా పనిచేశారని 48 గంటల్లోనే కేసు ఛేదించారని వారిని అభినందించారు.


సిబ్బందికి నగదు రివార్డు

హత్య కేసును చేధించి 48 గంటల్లో ఎర్రగుంట్ల మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ముసలయ్య, అతని సోదరుడి కుమారుడు శ్రీనాధ్‌లను అరెస్టు చేసిన కడప డీఎస్పీ, సీఐలు సూర్యనారాయణ, సదాశివయ్య, ఉలసయ్య, ఎస్‌ఐ సురేష్‌, మల్లికార్జునరెడ్డి, రాజరాజేశ్వర్‌రెడ్డిలతో పాటు సిబ్బందిని ఎస్పీ అన్బురాజన్‌ ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులను అందించారు. 

Updated Date - 2020-06-26T10:12:42+05:30 IST