ఆయన కన్ను పడితే అంతే..!

ABN , First Publish Date - 2020-08-18T11:35:31+05:30 IST

(కడప - ఆంధ్రజ్యోతి): అది చాపాడు మండలంలోని ఓ గ్రామం. అక్కడ భూములకు మంచి గిరాకీ ఉంది.

ఆయన కన్ను పడితే అంతే..!

ఆయన కన్ను పడితే అంతే..!

 ప్రభుత్వ భూములు వశమవుతాయి..

 రెవెన్యూ ఫుల్‌ సపోర్టు

 50 లక్షల విలువ చేసే సాగుభూమి గుప్పిట్లో


(కడప - ఆంధ్రజ్యోతి): అది చాపాడు మండలంలోని ఓ గ్రామం. అక్కడ భూములకు మంచి గిరాకీ ఉంది. నీటి వనరులు పుష్కలంగా ఉండడంతో అక్కడ ఎకరం రూ.15 లక్షల పైమాటే పలుకుతుంది. కేసీ కెనాల్‌, కుందూనది ఉండడంతో పంటలు పుష్కలంగా పండుతాయి. అక్కడ భూమికి ఉన్న విలువను ఓ మాజీ ప్రజాప్రతినిధి గుర్తించాడు. అంతే.. ఆయన కన్నేస్తే చాలు. భూములన్నీ ఆయన వశమవుతాయని ఆ మండలంలో చెబుతుంటారు. ఈయనకు రెవెన్యూ అధికారులు సహకరిస్తుండడంతో లక్షలాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములన్నీ ఈయన వశమైనట్లు చెబుతున్నారు.


చాపాడు మండలంలోని భద్రిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో నెర్రవాడ గ్రామం ఉంది. అక్కడ భూములకు మంచి డిమాండ్‌ ఉంది. నీరు పుష్కలంగా ఉండడంతో పంటలు బాగా పండుతాయి. దీంతో ఎకరా రూ.15 లక్షల పైమాటే ఉంటుందని చెబుతారు. అక్కడ భూములకున్న డిమాండ్‌ను గుర్తించిన ఒకాయన ప్రభుత్వ భూములను ఆక్రమించేసే పనిలో పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. సర్వే నెం.80లో 3.73 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ రేటు రూ.15 లక్షలకు పైగా పలుకుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ భూమిని గుప్పిట్లో పెట్టేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


కొంత భూమిలో ఏటా పంటలు సాగు చేస్తుంటాడు ఆయన. ప్రస్తుతం ఆ భూమిలో కొంత విక్రయించే పనిలో ఉన్నట్లు సమాచారం. నెర్రవాడ, భద్రిపల్లె గ్రామాల మధ్యలో ఉండడంతో భూమికి మంచి డిమాండ్‌ ఉంది. భూమి లేని నిరుపేదలకు ఆ భూమి ఇస్తే సాగు చేసుకుని లక్షణంగా జీవిస్తారు. అయితే రెవెన్యూ యంత్రాంగం మాత్రం ఆ దిశగా ఆలోచన చేయదని చెబుతుంటారు.


అలాగే చాపాడులో పది ఎకరాలకు పైగా వంక పోరంబోకు భూములను ఆక్రమించి అమ్మేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈయన కన్ను పడితే చాలు.. ఆ భూములు అంతేనంటూ అక్కడి స్థానికులు చెప్పుకొస్తుంటారు. రాజకీయ అండ, అధికారులను మేనేజ్‌ చేయడంలో సిద్ధహస్తుడని అంటారు. నెర్రవాడలో సర్వే నెం.80లో 3.73 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణపై ‘ఆంధ్రజ్యోతి’ చాపాడు తహసీల్దారు శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా భూమి ఆక్రమణకు గురవుతున్నట్లు ఫిర్యాదు రావడంతో నిలుపుదల చేసినట్లు వెల్లడించడం గమనార్హం.

Updated Date - 2020-08-18T11:35:31+05:30 IST