లీజుకు ఆలయాల భూములు?

ABN , First Publish Date - 2020-08-18T11:37:13+05:30 IST

కడప (సిటి), ఆగస్టు 17 : వైసీపీ అధికారంలోకి వచ్చాక నిలిచిపోయిన అన్యాక్రాంత ఆలయ భూములను బహిరంగ వేలం

లీజుకు ఆలయాల భూములు?

లీజుకు ఆలయాల భూములు?

 త్వరలోనే మార్గదర్శకాలు

 ఇప్పటికే రెండు విడతల్లో 800 ఎకరాలు అప్పగింత


కడప (సిటి), ఆగస్టు 17 : వైసీపీ అధికారంలోకి వచ్చాక నిలిచిపోయిన అన్యాక్రాంత ఆలయ భూములను బహిరంగ వేలం ద్వారా లీజుకిచ్చే విధానం పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. కాగా కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో అన్ని విభాగాలకు సంబంధించి 2950 ఆలయాలు ఉన్నాయి. వీటిలో పెద్ద ఆలయాలకు, దేవదాయ శాఖకు సంబంధించి 11,500 ఎకరాల భూములు ఉన్నట్లుగా రికార్డుల పరంగా చెప్పేవారు.

గత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని రకాల స్థలాల గుర్తింపు కోసం మీ ఇంటికి.. మీభూమి అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో ఆలయ భూముల వివరాలు కూడా నమోదయ్యాయి. రికార్డుల పరంగా ఉన్న భూముల కంటే అదనంగా దాదాపు 8 వేల ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. కడప నగరం సహా మరికొన్ని ప్రాంతాల్లో దేవదాయశాఖ భూములను స్వాధీనం చేసుకుని అధికారులు బోర్డులు కూడా పెట్టారు. కొన్ని చోట్ల పరుల ఆధీనంలో ఉన్న భూములకు సంబంధించి సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి రిజిస్ట్రేషన్లు కాకుండా బ్లాక్‌ చేయించారు. 


రెండు విడతల్లో లీజుకు 800 ఎకరాలు

అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేర దేవదాయశాఖ అధికారులు జిల్లాలో అదనంగా గుర్తించిన భూముల్లో దాదాపు 800 ఎకరాలను బహిరంగ వేలం ద్వారా లీజు కింద అప్పగించారు. మరో విడత వేలం నిర్వహించే సమయానికి వైసీపీ ప్రభుత్వం వచ్చింది. దీనిపై ఈ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో లీజు ప్రక్రియ స్తంభించింది. కాగా లీజు విధానం పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. కొత్త మార్గదర్శకాలు కూడా రానున్నాయని, వాటి ఆధారంగా మళ్లీ లీజు విధానం అమలు కానున్నదని చెప్పుకొస్తున్నారు.


అటువంటి ఉత్తర్వులేవీ రాలేదు 

- దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ 

బహిరంగ వేలం ద్వారా లీజు కింద భూములు ఇవ్వడంపై ప్రభుత్వం, ఉన్నతాధికారుల నుంచి ఇంతవరకు ఎలాంటి ఉత్తర్వులు తమకు అందలేదని దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనరు శంకరబాలాజీ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేర ముందుకెళతామన్నారు. ఆలయ భూములు అక్రమంగా ఎవరు కలిగి ఉన్నా చట్టరీత్యా నేరమవుతుందన్నారు. ఆలయ భూముల పరిరక్షణకు తమ శాఖ ఉన్నతాధికారుల సూచనలతో ముందుకు వెళుతున్నదన్నారు. 

Updated Date - 2020-08-18T11:37:13+05:30 IST