గురువులపై ఒత్తిడి.. ప్రధానోపాధ్యాయులకే నాడు-నాడు పనుల బాధ్యత

ABN , First Publish Date - 2020-12-16T05:28:34+05:30 IST

జిల్లాలో జడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్‌, ఎయిడెడ్‌ పాఠశాలలు 3,255 ఉన్నాయి. 4.50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.

గురువులపై ఒత్తిడి.. ప్రధానోపాధ్యాయులకే నాడు-నాడు పనుల బాధ్యత
కడప నగరం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల దుస్థితి ఇది

అమ్మఒడి ఆన్‌లైన్‌ నమోదు వారికే

మధ్యాహ్న భోజనం నిర్వహణ సరేసరి

నాడు-నేడు పురోగతిపై ఉన్నతాధికారుల చీవాట్లు

40 మంది ఎంఈవోలు, హెచ్‌ఎంలకు నోటీసులు జారీ

సతమతమవుతున్న ప్రధానోపాధ్యాయులు


విద్యార్థులను తీర్చిదిద్దడం గురువుల బాధ్యత. వారికి బోధనేతర పనులు కూడా అప్పగిస్తున్నారు. ఆ పనుల ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఇప్పటికే మధ్యాహ్న భోజనం, అమ్మఒడి ఆన్‌లైన్‌ నమోదు, విద్యాకానుక కిట్ల పంపిణీ వంటి పథకాల పర్యవేక్షణ ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. విద్యార్థుల ప్రవేశాలు సరేసరి. తాజాగా నాడు-నేడు పనులు వారికే అప్పగించారు. ఓవైపు పనులు చేస్తున్నా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు.. మరో వైపున పనుల్లో పురోగతి లేదంటూ ఉన్నతాధికారుల చీవాట్లు.. నోటీసుల జారీలతో తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు మానసిక ఒత్తిడికి లోనై ఆత్యహత్యకు పాల్పడ్డారు. అదే విషయాన్ని ఓ లేఖలో పేర్కొన్నారు. జిల్లాలో కూడా అదనపు పనులతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు కొందరు గురువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలపై ప్రత్యేక కథనం. 


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో జడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్‌, ఎయిడెడ్‌ పాఠశాలలు 3,255 ఉన్నాయి. 4.50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం కోసం వివిధ పథకాల ద్వారా ఏటా రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఒకప్పుడు ప్రగతి పనుల పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాంగం ఉండేది. రానురాను పాఠశాలల్లో జరిగే పనులు, సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణ బాధ్యతలు ప్రధానోపాధ్యాయులకే అప్పగిస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘నాడు-నాడు’ పనుల పర్యవేక్షణ కూడా ప్రధానోపాధ్యాయులకే అప్పగించారు. పేరెంట్స్‌ కమిటీ ఈ పనులు చేయాల్సి ఉంది. పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, ప్రతి తరగతి గదికి ఫ్యాన్‌, ట్యూబ్‌లైట్లు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఫర్నీచర్‌, రంగులు, అవసరమైన మరమ్మతులు, ఆకుపచ్చ బోర్డు, అదనపు తరగతి గదులు, ప్రహరీగోడ.. వంటి సౌకర్యాలు సమకూర్చేందుకు ‘నాడు-నేడు’ కార్యక్రమం కింద జిల్లాలో ఫేజ్‌-1 కింద 1,040 పాఠశాలలు ఎంపిక చేశారు. 835 పాఠశాలల్లో పేరెంట్స్‌ కమిటీలకు అప్పగించారు. రూ.230.44 కోట్లు మంజూరు చేస్తే.. ఇప్పటి వరకు చేసిన ఖర్చు రూ.110 కోట్లు. పేరెంట్స్‌ కమిటీలో జమ చేసింది రూ.94.40 కోట్లే. 


రాజకీయ వేధింపులు

ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు ఇంజనీర్లు చేపట్టేవారు. ప్రధానోపాధ్యాయులు కేవలం పర్యవేక్షణ మాత్రమే చూసేవారు. నాడు-నేడు పనుల్లో పర్యవేక్షణ, పనులు చేయించడం, నాణ్యత, రికార్డుల నిర్వహణపై జవాబుదారిని చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పనులు చేపట్టి జూన్‌ ఆఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. కొవిడ్‌ కారణంగా వాటిని నవంబరు 2 నాటికి పూర్తి చేయాలన్నారు. ఇసుక కొరత వల్ల పలు చోట్ల పనులు ఆగిపోయాయి. అందుకు గురువులను బాధ్యులను చేసి ఉన్నతాధికారులు చీవాట్లు పెట్టారు. అంతేకాదు.. పేరెంట్స్‌ కమిటీ ముసుగులో అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులే ముప్పాతిక శాతం బడుల్లో పనులు చేస్తున్నారు. ఎక్కువ బిల్లులు చేయాలని తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారి మాట వినకపోతే కమిటీ చైర్మన్లు, ఇంజనీర్లు సకహకరించకపోగా.. హెచ్‌ఎం సహకరించడం లేదంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. డబ్బుతో కూడుకున్న వ్యవహారం కావడంతో రాజకీయ నాయకుల వేధింపులతో పలువురు సతమతమవుతున్నారు. 


రాష్ట్ర కాంట్రాక్టర్లు సరఫరా చేయకపోయినా..

నాడు-నేడు సివిల్‌ పనులు మాత్రమే పేరెంట్స్‌ కమిటీ, ప్రధానోపాధ్యాయుడు చేయాలి. ఫ్యాన్లు, ట్యూబ్‌ లైట్లు, డ్యూయల్‌ డెస్కులు, మినరల్‌ వాటర్‌ పరికరాల సరఫరాకు రాష్ట్ర స్థాయిలో కాంట్రాక్ట్‌ ఇచ్చారు. వీటి సరఫరాలో ప్రధానోపాధ్యాయులకు ఏమాత్రం సంబంధం లేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచి ఆ పరికరాలను తెప్పించాల్సిన ఉన్నతాధికారులు ప్రధానోపాధ్యాయులనే బాధ్యులను చేసి చీవాట్లు పెట్టడం, చెప్పడానికి వీలు కాని భాషలో తిడుతున్నారని గురువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రస్థాయి కాంట్రాక్టరు సరఫరా చేయకపోతే మాదేనా బాధ్యత..? అంటూ ప్రశ్నిస్తున్నారు. 


40 మంది ఎంఈవో, హెచ్‌ఎంలకు నోటీసులు

పనుల్లో పురోగతి మందగించడం, రికార్డులు సక్రమంగా లేకపోవడం వంటి కారణాలతో 20 మంది ఎంఈవోలు, 20 మంది ప్రధానోపాధ్యాయులకు నోటీసులు జారీ చేశారు. మాకు సంబంధం లేని, ఇంజనీరింగ్‌ పరిజ్ఞానం, కాంట్రాక్టులో అనుభవం లేని పనులు చేయిస్తున్నారు.. ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని చేస్తున్నాం.. మాకే నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని, దీంతో తీవ్ర ఒత్తిళ్లులోనై అనారోగ్యాలకు గురవుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. 


అమ్మఒడి.. ఔఎంఎస్‌ యాప్‌లో అప్‌లోడ్‌

అమ్మఒడి పథకానికి సంబంధించి విద్యార్థుల వివరాలు నమోదుకు వారం గడువిచ్చారు. గత ఏడాది అమ్మఒడి రాని విద్యార్థులు, రేషన్‌కార్డు లేని వారి వివరాలు నమోదు చేయాలి. తల్లుల ఖాతాలో జమ చేసిన అమ్మఒడి డబ్బు నుంచి రూ.1000 తీసుకుని డీఈవో ఖాతాకు జమ చేయలి.  ఓఎంఎంఎస్‌ యాప్‌లో అమ్మఒడి, విద్యాకానుక, మధ్యాహ్న భోజనం, పరిసరాల పరిశుభ్రత వివరాలు అప్‌లోడ్‌ చేయాలి. బయోమెట్రిక్‌ యాప్‌లో టీచర్లు, విద్యార్థుల హాజరు, గూగుల్‌ ఫామ్‌లో నిత్యం కొవిడ్‌ వివరాలు నమోదు చేయాలి. తాజాగా హేతుబద్ధీకరణకు సంబంధించి చైల్డ్‌ఇన్ఫోలో విద్యార్థుల వివరాలు అప్‌లోడ్‌ చేయాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం లేకపోవడం, నిత్యం సర్వర్‌ మొరాయించడం వంటి సమస్యలతో అర్థరాత్రి వరకు కంప్యూటర్‌ ముందే గడపాల్సి వస్తుంది. కొందరైతే కుటుంబ సభ్యుల సహకారం తీసుకుంటే.. మరికొందరు సొంత డబ్బుతో ప్రైవేటు ఆపరేటర్లతో అప్‌లోడ్‌ చేయిస్తున్నారు. పలు పనులతో తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నామని, దీనికి తోడు నాడు-నేడు పనులతో మరింత వేధిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. 


ప్రధానోపాధ్యాయులకు నోటీసులా..? 

పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడం అభినందనీయమే. కాంట్రాక్టర్లతో చేయించాల్సిన పనులను ఏ అనుభవం లేని హెచ్‌ఎంలతో చేయించడం సరికాదు. రాష్ట్ర స్థాయి కాంట్రాక్టరు సరఫరా చేయాల్సిన పరికరాలకు కూడా వీరినే బాధ్యులను చేస్తున్నారు. విధివిధానాలు, ఖర్చుల వివరాలు ముందుగా చెప్పలేదు. నాణ్యతను పరిశీలించేది ఇంజనీర్లు. దానికి హెచ్‌ఎంలకు నోటీసులు ఇచ్చి సస్పెండ్‌ చేస్తామని మానసిక ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు. 

- జీవీ నారయణరెడ్డి, ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు


ఆ బాధ్యతల నుంచి తప్పించాలి

నాడు-నాడు పనుల వల్ల ప్రధానోపాధ్యాయులు మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు. గురువులకు బోధనేతర పనులు అప్పగించడం ఎంతవరకు సబబు. అనేక ఇబ్బందులకు గురౌతున్నారు. రెండు, మూడో విడతల నాడు-నేడు పనుల నుంచి ప్రధానోపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి. 

- జి.వెంకటసుబ్బారెడ్డి, ఏపీ హెచ్‌ఎంల సంఘం జిల్లా అధ్యక్షుడు


అనార్యోగంతో బాధపడుతున్నారు 

అమ్మఒడి అమలు, ఓఎంఎంఎస్‌ యాప్‌లో ఆయా పథకాల అమలు, విద్యార్థుల వివరాలు నమోదు చేయడంలో ప్రధానోపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇవి చాలవన్నట్లు నాడు-నేడు పనులు అప్పగించారు. ఓపక్క వేధింపులు, మరో పక్క ఇసుక, సిమెంట్‌ కొరత వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. మానసిక ఒత్తిళ్లకు లోనై అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 


- కె.సురే్‌షబాబు, ఎస్టీయూ స్టేట్‌ అసోసియేట్‌ ప్రెసిడెంట్‌


Updated Date - 2020-12-16T05:28:34+05:30 IST