అక్రమాలను ప్రశ్నిస్తే.. అంతమొందిస్తారా..?!
ABN , First Publish Date - 2020-12-30T06:01:50+05:30 IST
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో అధికార పార్టీ నేతల అక్రమాలను ప్రశ్నిస్తే అంతమొందిస్తారా అంటూ టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి మండిపడ్డారు.

ప్రొద్దుటూరులో టీడీపీ నిరసన
ప్రొద్దుటూరు, డిసెంబరు 29 : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో అధికార పార్టీ నేతల అక్రమాలను ప్రశ్నిస్తే అంతమొందిస్తారా అంటూ టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ప్రొద్దుటూరులో హత్యకు గురైన టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య మృతదేహాన్ని లింగారెడ్డి రాష్ట్ర నాయకులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, కడప నియోజకవర్గ ఇన్‌చార్జి వీఎస్ అమీర్‌బాబులతో కలిసి సందర్శించారు. అనంతరం వారు మృతుడి కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో నందం సుబ్బయ్య హత్యను ఖండిస్తూ, ఇందులో సూత్రధారులు, పాత్రదారులను కఠినంగా శిక్షించాలని డిమాండు చేస్తూ టీడీపీ నాయకులు అందోళన చేపట్టారు. ఎమ్మెల్యే రాచమల్లు, ఆయన బావమర్ది బంగారురెడ్డి అక్రమాలను నందం సుబ్బయ్య బహిర్గతం చేస్తున్నారనే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని అనుచరులతో హత్య చేయించారని ఆరోపించారు. నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి ఇలాంటివి ఎన్నో చూశాం. మేము తలచుకుంటే నీవు ప్రొద్దుటూరులో కూడా ఉండలేవు. మా కార్యకర్తల ప్రాణాలు తీస్తే అంతకంత చెల్లిస్తామంటూ లింగారెడ్డి ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు కోట శ్రీదేవి, పట్టణ నాయకులు ఈవీ సుధాకర్‌రెడ్డి, ముక్తియార్, సిద్దయ్య పాల్గొన్నారు.