అన్యాయం జరుగుతోందని ప్రశ్నించినందుకు.. 15 నిమిషాల్లోనే..

ABN , First Publish Date - 2020-12-30T06:09:23+05:30 IST

టీడీపీ అధికార ప్రతినిధి, న్యాయవాది నందం సుబ్బయ్య..

అన్యాయం జరుగుతోందని ప్రశ్నించినందుకు.. 15 నిమిషాల్లోనే..
సంఘటనా స్థలంలో నందం సుబ్బయ్య మృతదేహం

టీడీపీ నేత సుబ్బయ్య దారుణ హత్య

ఉలిక్కిపడ్డ ప్రొద్దుటూరు

పదేళ్ల తరువాత పదునెక్కిన కత్తులు

ఇళ్ల పట్టాల్లో అర్హులకు అన్యాయం జరుగుతోంది.. 

ప్రశ్నించిన నిమిషాల్లోనే ప్రత్యర్థుల చేతిలో హతమైన బీసీ నాయకుడు

సోషల్‌ మీడియా వేదికగా ఎమ్మెల్యే రాచమల్లుపై.. ఆరోపణలు గుప్పిస్తూ వచ్చిన సుబ్బయ్య

ఎమ్మెల్యే ప్రేరణతోనే నా భర్తను హత్య చేశారు : మృతుడి భార్య అపరాజిత 

అండగా ఉంటామని ఫోన్లో ఓదార్చిన అధినేత చంద్రబాబు

నేడు అంత్యక్రియలకు యువనేత లోకేష్‌, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు హాజరు


ప్రొద్దుటూరు(కడప): రామేశ్వరం సమీపంలో పట్టణ పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కోసం ఓ పక్క అధికార యంత్రాంగం పూజలు చేస్తోంది. అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వడం లేదని బీసీ నేత, టీడీపీ అధికార ప్రతినిధి, న్యాయవాది నందం సుబ్బయ్య (41) ప్రశ్నించారు. పూజా ప్రదేశానికి పది ఇరవై అడుగుల దూరం వెళ్లి సెల్ఫీ తీసుకుని శుభోదయం అంటూ సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. అప్పుడు సమయం సుమారుగా ఉదయం 9.45 గంటలు. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తులు కళ్లలో కారం చల్లి కత్తులతో తలపై అతి కిరాతంగా దాడి చేశారు. ఆ దాడిలో తలకు బలమైన గాయాలపై సుబ్బయ్య రక్తపుమడుగులో నిర్జీవంగా కూలిపోయాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. బీసీ నాయకుడి హత్యతో వ్యాపార కేంద్రం ప్రొద్దుటూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంగళవారం బీసీ నాయకుడు, న్యాయవాది నందం సుబ్బయ్య ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటపై భార్య అపరాజిత, కుటుంబ సభ్యులు, పోలీసుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.


సుబ్బయ్య భార్య అపరాజిత, ఇద్దరు కొడుకులు దినేష్‌విక్రమార్క్‌ (6వ తరగతి), వీరవిక్రం (4వ తరగతి)తో కలసి ఈశ్వరరెడ్డినగర్‌లో నివాసం ఉంటున్నారు. 2014 వరకు సుబ్బయ్య ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. పదేళ్లుగా ఆయన వెంటే నడిచారని స్థానికులు అంటున్నారు. 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రొద్దుటూరు ఎంపీపీ పదవి ఆశించి.. ఆ పదవి ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే నుంచి వేరుపడి టీడీపీలో చేరారని కుటుంబ సభ్యులు వివరించారు. టీడీపీలో చేరినా.. రాజకీయాలకు అంటీ అంటనట్లుగా ఉంటూ వస్తున్నారు. గత వారం పది రోజులుగా వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని సోషల్‌ మీడియా వేదికగా గళం విప్పారు. అదే క్రమంలో ఎమ్మెల్యే, ఆయన బావమరిదిపై కూడా ఆరోపణలు సంధించారు. సోమవారం శివాలయం సెంటరులో ఇసుక అక్రమాలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇసుక అక్రమాల్లో ఎమ్మెల్యే, ఆయన బావమరిది పాత్ర ఉందని, పేదలకు ఇసుక అందకుండా చేస్తున్నారని, అధికారులు సమగ్ర విచారణ చేస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని ఆరోపించారని అంటున్నారు. మంగళవారం కూడా ఇళ్ల పట్టాల పంపిణీలో అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతోందని అధికారులను ప్రశ్నించిన కొన్ని నిమిషాలకే నా భర్తను హతమార్చారని అపరాజిత కన్నీరుమున్నీరై విలపించింది. 


పిలుచుకెళ్లిన ఆ వ్యక్తి ఎవరు..?:

ఉదయం సుమారుగా 8.30 గంటల సమయంలో ఓ వ్యక్తి ఇంటికొచ్చి నాకు ఇంటి పట్టా రాలేదని, అర్హత ఉన్నా అన్యాయం చేశారని ఆ వ్యక్తి చెప్పడంతో మాట్లాడేందుకు నా భర్త సుబ్బయ్య ఇంటి నుంచి వెళ్లాడని భార్య అపరాజిత తెలిపారు. అధికారులను ప్రశ్నించి.. అక్కడే సెల్ఫీ తీసుకుని సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన 15 నిమిషాలకే దారుణంగా హత్య చేశారని విలపించారు. అయితే.. ఇంటికి వచ్చి సుబ్బయ్యను పిలుచుకువెళ్లిన వ్యక్తి ఎవరు..? అన్నది తెలియాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. సుబ్బయ్య హత్య జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నలుగురిని అనుమానితులుగా గుర్తించామని ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. నిందితులను ఒకటి రెండు రోజుల్లో అరెస్టు చేస్తామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని, ప్రొద్దుటూరులో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. 


పదేళ్లకు పదునెక్కిన కత్తులు

ప్రొద్దుటూరు నియోజకవర్గం పదేళ్లుగా ఎలాంటి ఆధిపత్య హత్యలు లేకుండా ప్రశాంతంగా ఉంది. వాణిజ్య, వ్యాపార రంగంలో రెండో ముంబాయిగా, బంగారు వ్యాపారంలో సిరిపురిగా ప్రసిద్ధి చెందింది. 1987లో ప్రత్యర్థుల చేతిలో నలుగురు హత్యకు గురయ్యారు. ఆ తరువాత 1998లో మాజీ సర్పంచి హత్యకు గురయ్యారు. 2011 నవంబరు 22న మండల పరిధిలో చెన్నంరాజుపల్లెకు చెందిన తండ్రీకొడుకులు ఆధిపత్యపోరుకు బలయ్యారు. ఆ తరువాత నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ, ఆధిపత్య హత్యలు జరగలేదు. ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉన్న సమయంలో నందం సుబ్బయ్య హత్యకు గురి కావడం రాజకీయ చర్చకు తెరలేచింది. పదేళ్ల తర్వాత కత్తులు పదునెక్కడంతో అందరి గుండెలు గుబెల్లుమన్నాయి. 


నా భర్త హత్యకు ఎమ్మెల్యే కారణం: మృతుడి భార్య ఆపరాజిత

స్థానిక ఎమ్మెల్యే రాచుమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగారురెడ్డి ప్రమేయంతోనే తన భర్త నందం సుబ్బయ్య హత్యకు గురయ్యారని అపరాజిత ఆరోపించింది. జిల్లా ఆస్పత్రిలో ఆమె విలేఖరులతో మాట్లాడుతూ కులాంతర వివాహం చేసుకున్న తాము ఎంతో ఆన్యోన్యంగా ఉండేవారమని, తన భర్త ఏ ఒక్కరికీ ఆపాయం తలపెట్టలేదని అన్నారు. మా పెళ్లి కన్నా ముందే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు. మా పెళ్లి తరువాత ముందుగా ఒక రోజంతా రాచమల్లు ఇంట్లోనే, మా బంధువులను రాచుమల్లు ఒప్పించిన తర్వాతే భర్త ఇంటికి వెళ్లామని అన్నారు. ఎన్నో ఏళ్లుగా రాచమల్లు కుటుంబానికి తన భర్త సేవలు చేశారు, అలాంటి వ్యక్తిని హత్య చేయించడానికి వారికి మనసెలా వచ్చిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నబిడ్డలతో ఎలా బతకాలి.. వ్యాపారాల్లో నష్టాలు రావడంతో అప్పుల్లో ఉన్నామని, వాటిని ఎలా తీర్చాలంటూ కన్నీరు పెట్టింది. నా భర్తను హత్య చేయించిన ఎమ్మెల్యే, ఆయన బావమరిదిని శిక్షించాలని, అప్పుడే తనకు న్యాయం జరుగుతుందని డిమాండ్‌ చేశారు. 


అమ్మా..! దైర్యంగా ఉండు పార్టీ అండగా ఉంటుంది: టీడీపీ అధినేత చంద్రబాబు

హత్య విషయం తెలియగానే ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నాయకులకు ఫోన్‌ చేసి హత్య సంఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మృతుడి భార్య అపరాజితకు ఫోన్‌ చేసి ఓదార్చారు. అమ్మా..! దైర్యంగా ఉండు.. పార్టీ మీ కుటుంబానికి, పిల్లలకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది. హత్య చేసిన నిందితులకు శిక్ష పడేవరకు పార్టీ పోరాడుతుందని వివరించారు. ఆమెకు అండగా ఉండాలని పార్టీ నాయకులను సూచించారు. నేడు సుబ్బయ్య అంత్యక్రియల్లో టీడీపీ యువనేత నారా లోకేష్‌, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, జిల్లా టీడీపీ నాయకులు హాజరు కానున్నారు. 


ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసు అధికారులు 

హత్య జరిగిన రామేశ్వరం ఇళ్ల స్థలాల పంపిణీ పదేశాన్ని ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాదరావు, మైదుకూరు డీఎస్పీ విజయకుమార్‌, సీఐలు నరసింహారెడ్డి, సుబ్బారావు, నాగరాజు, క్రిష్ణయ్యయాదవ్‌లు పరిశీలించారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్‌బీ డీఎస్పీ వెంకటశివారెడ్డి జిల్లా ఆస్పత్రికి వచ్చి హత్యకు దారి తీసిన కారణాలపై ఆరా తీశారు.


సుబ్బయ్య హత్యలో మాకెలాంటి సంబంధం లేదు: ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్య కేసులో తనకు గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించే వ్యక్తిని కానని చెప్పారు. సుబ్బయ్య హత్యకు తాను కుట్ర చేశానంటూ వస్తున్న ఆరోపణలో నిజం లేదని ఎమ్మెల్యే రాచమల్లు మంగళవారం రాత్రి విలేఖరులకు వివరించారు. సుబ్బయ్య జీవితమంతా క్రిమినల్‌ కేసులతోనే నడిచిందని, ఎవరికో సరిపోక ఇలా చేసిఉంటారన్నారు. సోషల్‌ మీడియా వేదికగా సుబ్బయ్య విమర్శలు చేసినంతమాత్రాన, తానే హత్యకు టార్గెట్‌ చేశానని చెప్పడం సరికాదన్నారు. టీడీపీ నేతలు తనపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదులో తన పేరు గానీ, తన బావమరిది పేరు కానీ లేదని తెలిపారు. ఏది ఎమైనా సుబ్బయ్య హత్య కావడం తనకు బాధ కల్గిస్తోందన్నారు. 

Updated Date - 2020-12-30T06:09:23+05:30 IST