పన్నుల ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి

ABN , First Publish Date - 2020-12-08T04:56:12+05:30 IST

దేశంలో ఏరాష్ట్రంలో లేని పన్నుల విధానాన్ని వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తోందని ప్రజలు అందుకు తగిన బుద్ధి చెప్పాలని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పిలుపు ఇచ్చారు.

పన్నుల ప్రభుత్వానికి   తగిన బుద్ధి చెప్పాలి

 టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు  లింగారెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, డిసెంబరు 7 : దేశంలో ఏరాష్ట్రంలో లేని పన్నుల విధానాన్ని వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తోందని ప్రజలు అందుకు తగిన  బుద్ధి చెప్పాలని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పిలుపు ఇచ్చారు. సోమవారం ఆయన తన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ సీఎం జగన్‌ సంక్షేమం పేరిట ప్రజలకు పది రూపాయలిచ్చి, పన్నుల రూపంలో దానికి మూడింతలు వసూలు చేస్తున్నారని దీనిని ప్రజలు తెలుసుకోవాలన్నారు. పెట్రోలు డీజిల్‌పై ఉన్న వ్యాట్‌ను తాను అధికారంలోకి వస్తే రద్దు చేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక వ్యాట్‌ను పెంచడమే కాకుండా దానిపై సర్‌చార్జీని వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కార్పొరేషన్‌, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో ఇంటి పన్నును అద్దె అధారంగా నిర్ణయిస్తే, ఇపుడు ఆ విధానం రద్దుచేసి, కొత్తగా ఇంటి రిజిస్ట్రేషన్‌ విలువపై పన్ను విధించేందుకు ప్రభుత్వం సిద్దమైందని, దీని వల్ల ప్రజలపై మోయలేని భారం పడుతుందన్నారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన  ప్రభుత్వంపై టీడీపీ ఉద్యమిస్తుందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు సీతారామిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శేషయ్య, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-08T04:56:12+05:30 IST