-
-
Home » Andhra Pradesh » Kadapa » Supply for two days booked
-
ఉన్నవే తీసుకో..!
ABN , First Publish Date - 2020-06-23T11:23:40+05:30 IST
జిల్లాలో ఖరీ్‌ఫలో వివిధ రకాల పంటలు 1.15 లక్షల హెక్టార్లలో సాగు చేస్తారని అంచనా. ప్రధానంగా వరి 40 వేల హెక్టార్లు,

రైతు భరోసా కేంద్రాల్లో అరకొర ఎరువులు, విత్తనాలు
అందుబాటులో రెండు కంపెనీల ఎరువులే
ఉద్యాన పంట డ్రిప్ ఎరువులు ‘నో స్టాక్’
బుక్ చేసిన రెండు రోజులకు సరఫరా
ప్రైవేటు ప్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు
రైతుల డిమాండ్ మేరకు తెప్పిస్తాం : జేడీఏ
మైదుకూరు మండలం జీవీ సత్రంకు చెందిన రైతు వెంకటసుబ్బయ్య యూరియా కోసం రైతు భరోసా కేంద్రానికి వెళ్లారు. స్టాక్ లేదని సమాధానం. ఆ కేంద్రం ఇన్‌చార్జి జమ్మలమడుగు స్టాక్ పాయింట్‌కు ఫోన్ చేస్తే అక్కడా నో స్టాక్. చేసేది లేక ఆ రైతు ప్రైవేటు వ్యాపారుల వద్ద కొనుగోలు చేయాల్సి వచ్చింది. సగం మంది రైతులది ఇదే పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాల్లో రెండు కంపెనీల ఎరువులే ఉన్నాయి. అవి కూడా అరకొరే. ఉద్యాన పంటలకు అవసరమైన డ్రిప్ ఎరువులు అసలే లేవు. ఉన్నవే తీసుకో..? అన్న చంద్రంగా మారింది. యాంత్రీకరణ ఊసే లేదు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, విత్తనాల సరఫరా తీరుపై ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయి పరిశీలన కథనం.
కడప, జూన్ 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఖరీ్‌ఫలో వివిధ రకాల పంటలు 1.15 లక్షల హెక్టార్లలో సాగు చేస్తారని అంచనా. ప్రధానంగా వరి 40 వేల హెక్టార్లు, పత్తి 24,500 హెక్టార్ల, పత్తి 20 వేల హెక్టార్లు, పసుపు 3,900, కంది 8 వేలు, ఉల్లి 3,225 హెక్టార్లలో సాగు చేస్తారని వ్యవసాయ శాఖ ప్రణాళిక. ఉద్యాన పంటలకు జిల్లా ప్రసిద్ధి. 1.22 లక్షల హెక్టార్లలో సాగు చేస్తారు. ఈ సీజన్లో 84,745 మెట్రిక్ టన్నులు రసాయన ఎరువులు అవసరమని అంచనా వేశారు. మే 30న జిల్లాలో 620 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులకు అవసరమైన రసాయన ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు ఆర్‌బీకేల్లో ఆర్డర్ బుక్ చేసిన 48 గంటల్లో సరఫరా చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
రుతుపవనాలు ప్రారంభమయ్యాయి. అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ నెలలో 22వ తేదీ వరకు 57.7 మి.మీల సాధారణ వర్షపాతం కాగా.. 43.6 మి.మీల వర్షం కురిసింది. దుక్కులు దున్ని పొలం చదును చేసి.. పదును వర్షం పడితే విత్తనాలు వేసేందుకు రైతులు సన్నద్ధం అయ్యారు. విత్తనాలు, ఎరువుల కోసం రైతు భరోసా కేంద్రాలకు వెళితే.. అవసరమైన ఎరువులు లేవు. ఉన్నవి రెండు కంపెనీలవే. అవి కూడా అరకొరే. దీంతో చేసేది లేక ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
నో స్టాక్ సమాధానం
రైతు భరోసా కేంద్రాలు 620 ఏర్పాటు చేశారు. ఏ ఒక్క కేంద్రంలోనూ ఒక్క బస్తా ఎరువు, విత్తనం ప్యాకెట్లు లేవు. ఆ కేంద్రాలకు ఎరువులు, విత్తనాలు సరఫరా చేసేందుకు కడప, జమ్మలమడుగు, రైల్వేకోడూరు, బద్వేలు, పులివెందుల హబ్ (స్టాక్ పాయింట్స్) ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ కేంద్రాల్లోనూ డీఏపీ, 14:38:14 కాంప్లెక్స్, యూరియా కలిపి 288.24 మెట్రిక్ టన్నుల రసాయన ఎరువులు ఉన్నాయి. కావేరి, తులసి కంపెనీలకు చెందిన బీజీ-2 పత్తి విత్తన ప్యాకెట్లు, బీపీటీ 5240 రకం వరి ధాన్యం విత్తనాలు అందుబాటులో ఉన్నా అవసరమైన మేరకు లేవని తెలుస్తోంది. ఎక్కువ శాతం 28:28:0, 19:19:19 కాంప్లెక్స్, ఎంవోపీ వంటి రసాయన ఎరువులు రైతులు అడుగుతున్నా అవి అందుబాటులో లేవు.
ఉద్యాన పంటల డ్రిప్ ఎరువులు ఏవీ..?:
అరటి, మామిడి, బొప్పాయి, బత్తాయి, దోస, కర్బూజ వంటి ఉద్యాన పంటల సాగుకు జిల్లా ప్రసిద్ధి. 1.22 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారని ఉద్యానవన శాఖ జేడీ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఈ పంటలు డ్రిప్ ఆధారంగా సాగు చేస్తున్నారు. డ్రిప్ ద్వారా పండ్ల చెట్లకు ఎరువులు ఇస్తున్నారు. దీంతో నీటిలో కరిగే పాలిఫడ్ - 19:19:19, మల్టీకే-130-45, మోనోపోటాషియం పాస్పరస్, మోమో అమ్మోనియం పాస్పేట్, కాల్షియం నైట్రేట్, బోరాక్స్, మెగ్నిషియం సల్ఫేట్, పాస్పరిక్ యాసిడ్ వంటి ఎరువులు సాలిబుల్ ఫర్టిలైజర్స్ కావాలని రైతులు కోరుతున్నారు. ముఖ్యంగా రైల్వేకోడూరు, పులివెందుల ప్రాంతాల్లో ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ ఎరువు కోసం రైతు భరోసా కేంద్రాలకు వెళితే నో స్టాక్... వచ్చిన తర్వాత చెబుతాం..! అంటూ సమాధానం ఇస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. రైతు డిమాండ్ మేరకు అన్ని రకాల ఎరువులు, విత్తనాలను ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.
ఆయా స్టాక్ పాయింట్లలో ఇది పరిస్థితి
బద్వేలు హబ్ పరిధిలో 8 మండలాలు 84 రైతు భరోసా కేంద్రాలు వస్తాయి. ఇక్కడ డీఏపీ, 14:35:14 కాంప్లెక్స్, గ్రీన్ కోటెడ్ యూరియా 50 టన్నులే ఉంది. వరి విత్తనాలు 200 ప్యాకెట్లు, పత్తి విత్తనాలు 60 ప్యాకెట్లు ఉన్నాయి. రైతులకు ఏ మేరకు సరిపోతాయి..?
జమ్మలమడుగు హబ్ పరిధిలో 10 మండలాలు, 130 ఆర్‌బీకేలు ఉన్నాయి. యూరియా 334 బస్తాలు వస్తే ప్రొద్దుటూరు మండలం తాళ్లప్రొద్దుటూరు, కామనూరు, జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామాల రైతులకే ఇచ్చేశారు. అక్కడ యూరియా నో స్టాక్, ఎంవోపీది అదే పరిస్థితి.
రైల్వేకోడూరు హబ్ పరిధిలో 23 ఆర్‌బీకేలు ఉన్నాయి. 6 వేల టన్నుల రసాయన ఎరువులు ఉన్నా.. ఈ ప్రాంతంలో ఎక్కువగా డిమాండ్ ఉన్న ఉద్యాన పంటల డ్రిప్ ఎరువులు ఒక్క బస్తా కూడా లేదు.
కడప మార్కెట్‌యార్డులోని స్టాక్ పాయింట్ పరిధిలో 16 మండలాలు, 186 రైతు భరోసా కేంద్రాలు వస్తాయి. ఇక్కడ అరకొర ఎరువులే. డీఏపీ, 14:35:14 కాంప్లెక్స్, యూరియా ఎరువులు కేవలం 94 మెట్రిక్ టన్నులే ఉన్నాయి. కావేరి, తులసి కంపెనీల పత్తి విత్తనాలు, బీపీటీ 5240 రకం వరి ధాన్యం విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.
పులివెందుల హబ్‌లో రసాయన ఎరువులు, పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నా.. ఆ ప్రాంతంలో రైతుల ఎక్కువగా డిమాండ్ ఉన్న నీటిలో కరిగే డ్రిప్ ఎరువులు లేవు.
రైతుల డిమాండ్ మేరకు సరఫరా :మురళీకృష్ణ, జాయింట్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ, కడప
రైతు భరోసా కేంద్రాల్లో రైతులు ఏయే ఎరువులు, విత్తనాలు కావాలో ఆర్డర్ బుక్ చేసుకున్న 48 గంటల్లో సరఫరా చేస్తాం. ప్రస్తుతం ఐదు స్టాక్ పాయింట్లలో 288.24 మెట్రిక్ టన్నులు ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఆర్‌బీకేలో విక్రయించే ఎరువులు, విత్తనాలు శాంపుల్స్ తీసి టెస్ట్ చేశాక నాణ్యత ఉంటేనే రైతులకు సరఫరా చేస్తాం. టెస్ట్ చేయడానికే 4 రోజులు పడుతోంది. రైతు డిమాండ్ మేరకు ఆయా కంపెనీలతో ఎంవోయూ చేసుకుని సరఫరా చేయాల్సి ఉంటుంది. ఉద్యాన పంటలకు అవసరమైన నీటిలో కరిగే సాలిబుల్ ఫర్టిలైజర్స్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం.