విద్యార్థినులు చిత్తు కాగితాలు ఏరలేదని.. ఉపాధ్యాయురాలు చేసిన నిర్వాకమేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2020-03-02T17:47:19+05:30 IST

పాఠశాల ఆవరణలో..

విద్యార్థినులు చిత్తు కాగితాలు ఏరలేదని.. ఉపాధ్యాయురాలు చేసిన నిర్వాకమేంటో తెలిస్తే..

మైదుకూరు(కడప): పాఠశాల ఆవరణలో చిత్తు కాగితాలు ఏరలేదని ఓ వ్యాయామ ఉపాధ్యాయురాలు విద్యార్థినులను మోకాళ్లపై నడిపించడంతో బొబ్బలెక్కి విలవిల్లాడిపోయారు. నడవలేని స్థితికి చేరుకున్నారు. ఈ నిర్వాకం ఓ గురుకుల పాఠశాలలో శనివారం  చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని వనిపెంట గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుకుంటున్న 30మందికి పైగా విద్యార్థినులను శనివారం క్లాస్‌ ముందు భాగంలో చిత్తు కాగితాలు ఏరివేయాలని వ్యాయామ ఉపాధ్యాయురాలు చెప్పారు.


అయితే విద్యార్థినులు ఆ పని చేయకపోవడంతో వారిని మోకాళ్లపై 11 రౌండ్లు నడిపించినట్లు తెలిసింది. దీంతో చాలా మంది విద్యార్థినుల మోకాళ్లకు బొబ్బలు ఎక్కి అల్లాడిపోయారని.. నడవడానికే కష్టంగా ఉన్నట్లు సమాచారం. ఈవిషయం తెలుసుకున్న విలేకరులు ఆదివారం పాఠశాలకు వెళ్లగా.. ఆ ఉపాధ్యాయురాలు పిల్లలను భయపెట్టినట్లు సమాచారం. విషయం ఎవ్వరైనా బయటపెడితే మీకు మామూలుగా ఉండదని హెచ్చరించినట్లు తెలిసింది.. పిల్లలను మాట్లాడనీయకుండా రెండవ అంతస్తులోకి పంపి వేసినట్లు అక్కడే ఉన్న కొందరు తెలిపారు.


అంతేకాకుండా ఇద్దరు, ముగ్గరు విద్యార్థినులతో ఎవ్వరికి ఏమి జరుగలేదని విలేకరులకు చెప్పించారు. కాగా జరిగిన విషయంపై ప్రధాన ఉపాధ్యాయిని క్రిష్ణవేణికి ఫోన్‌ చేసి వివరణ అడుగగా.. నేను శనివారం మీటింగ్‌కు మైదుకూరు వెళ్లానని... నాకు ఏమి తెలియదని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు జరిగిన సంఘటనపై విచారణ జరపించాలని పలువురు కోరుతున్నారు. 

Updated Date - 2020-03-02T17:47:19+05:30 IST