బాలికల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2020-02-08T10:05:51+05:30 IST
బాలికల అక్రమరవాణా చట్టరీత్యా నేరమని.. సమాజంలో మార్పు తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని

కడప (కలెక్టరేట్), ఫిబ్రవరి 7 : బాలికల అక్రమరవాణా చట్టరీత్యా నేరమని.. సమాజంలో మార్పు తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా అదనపు ఏఎస్సీ బి.లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సభాభవనంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, పిల్లల హక్కుల ఫోరం ఆధ్వరంలో పిల్లల అక్రమ రవాణాపై అనుబంధ విభాగాల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ పిల్లలు, మహిళల అక్రమ రవాణా చట్టరీత్యా నేరమని.. అలాంటి అక్రమాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. అక్రమ రవాణాకు గురైన వారిని ఎక్కువగా సెక్స్‌వర్కర్లు, ఇంటి పనులకు, వెట్టిచాకిరీతో పాటు అవయవ వ్యాపారాలు సాగుతున్నాయన్నారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా జిల్లాలో ఎవరైతే ఇంటి నుంచి దూరంగా ఉన్నా.. బాలకార్మికులుగా వీధుల్లో అడుక్కోవడం వంటివి చేస్తున్న వారిని గుర్తించడం జరుగుతుందన్నారు.
అలాంటి పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగిస్తామన్నారు. తల్లిదండ్రులు లేని బాలలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా ప్రభు త్వం హోంలో చేర్పిస్తామని తెలిపారు. బాలికలు, మహిళలు అక్రమ రవాణాపై టోల్‌ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామన్నారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభు త్వం దిశ చట్టాన్ని, ఒక యాప్‌ను ప్రారంభించిందన్నారు. 100, 181, 1098 టోల్‌ఫ్రీ నెంబర్లు లేదా 9121211100 వాట్సప్ నెంబర్లు గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రేమ పేరుతో అక్రమ రవాణా జరుగుతోందని... బాలికలు మోసపోవద్దని, రక్షణ పొం దేందుకు చట్టాలను తెలుసుకోవాలన్నారు.
ఐసీడీఎస్ పీడీ పద్మజ, డిస్ట్రిక్ట్ ప్రొటెక్షన్ అధికారి రెడ్డిబాబు బాలికల అక్రమ రవాణాపై తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అజయకుమార్, స్వచ్చంధ సంస్థ అధిపతి మూలే సరస్వతి, రైడ్స్ సుభాష్, న్యాయవాది వరమ్మ, శ్రీహరి డిగ్రీ కళాశాల విద్యార్థి సుశ్మితలు బాలికల రక్షణపై చేసిన ప్రసంగాలు సభికులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పోలీసు అధికారులు, ఐసీడీఎస్ సీడీపీవోలు, వివిధ స్వచ్చంధ సంస్థలు, అంగన్వాడీ మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.