కోవిడ్‌-19 నియంత్రణకు పటిష్ట చర్యలు

ABN , First Publish Date - 2020-04-08T09:10:58+05:30 IST

జిల్లాలో కోవిడ్‌-19 నియంత్రణకు, నివారణకు చర్యలు పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజద్‌బాషా, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని స్పందన

కోవిడ్‌-19 నియంత్రణకు పటిష్ట చర్యలు

భౌతిక దూరంతోనే కరోనాకు కట్టడి

ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని


కడప(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 7: జిల్లాలో కోవిడ్‌-19 నియంత్రణకు, నివారణకు చర్యలు పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజద్‌బాషా, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో కలెక్టర్‌ హరికిరణ్‌ ఆధ్వర్యంలో కోవిడ్‌-19 నియంత్రణ, నివారణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, విప్‌ శ్రీనివాసులు, ఎంపీలు అవినాష్‌ రెడ్డి, సీఎం రమేష్‌నాయుడుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం ద్వారా జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలతో ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. జిల్ల్లాలోని 16 క్వారంటైన్‌ సెంటర్లలో కనీస సౌకర్యాలుండాలని, ప్రతిరోజు పారిశుధ్య పనులు చేయాలన్నారు.


క్వారంటైన్‌లో ఉండే వారిపై నిరంతరం నిఘా పెట్టాలన్నారు. అవసరమైతే కామన్‌ క్వారంటైన్‌లు ఏర్పాటు చేయాలన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు బయటకు రాకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలన్నారు. భౌతిక దూరంతోనే కరోనాను నియంత్రించవచ్చన్నారు. కిరాణా షాపుల్లో నిత్యవసర సరుకులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, షాపుల ముందు ధరల పట్టికలుండేలా చూడాలన్నారు. అంతకు ముందు కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 5 వ తేది నుంచి కరోనా పరీక్షల ల్యాబ్‌ కడపలో ప్రారంభమైందన్నారు. ప్రతి రోజు 72 నుంచి 90 పరీక్షలు చేస్తున్నామని వివరించారు. ఎంపీ అవినాష్‌ రెడ్డి మాట్లాడుతూ అరటి, చీనీ పంటల దిగుబడులు ఎక్కువగా ఉన్నాయని రవాణాకు  సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో  ప్రజాప్రతినిధులు, ప్రత్యేక అధికారి శశిభూషణ్‌ కుమార్‌, ఎస్పీ అన్బురాజన్‌, జాయింట్‌ కలెక్టర్‌ గౌతమి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-08T09:10:58+05:30 IST