దాహం తీరేనా..?

ABN , First Publish Date - 2020-05-29T11:22:43+05:30 IST

కడప నగరం, బద్వేలు పట్టణ ప్రజలు చాలా ఏళ్లుగా తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారు.

దాహం తీరేనా..?

సర్వేలోనే యూసీఐఎల్‌ గ్రామాల తాగునీటి పథకం

ఫైలుకెక్కని సోమశిల-బద్వేలు ఎత్తిపోతలు

కలగా మారిన కడపకు సోమశిల నీళ్లు


కడప, మే 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కడప నగరం, బద్వేలు పట్టణ ప్రజలు చాలా ఏళ్లుగా తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారు. తాము అధికారంలోకి రాగానే ‘సోమశిల-బద్వేలు ఎత్తిపోతల పథకం’ ద్వారా బద్వేలు దాహార్తి తీరుస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఆయన అధికారం చేపట్టాక ఆ ఊసేలేదు. అలాగే కడప నగరానికి తాగునీరు అందించాలనే సోమశిల నుంచి లిఫ్ట్‌ పథకం ప్రతిపాదనలోనే ఆగిపోయింది. పులివెందుల నియోజకవర్గంలోని యురేనియం బాధిత గ్రామాల ప్రజలకు శుద్ధి చేసిన నీరు ఇప్పటికీ అందడం లేదు. వైసీపీ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయా సమస్యలు, హామీల అమలు తీరు పరిశీలిస్తే ముందుకు మూడడుగులు.. వెనక్కి ఆరడుగులు..! అన్నట్లు మారింది. ఆ వివరాలపై ప్రత్యేక కథనం.


యురేనియం బాధిత గ్రామాలకు శుద్ధి జలాలు ఏవీ..?

సీఎం జగన్‌ ప్రాతినిఽథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం పరిధిలో వేముల మండలం కేకే కొట్టాల, మబ్బుచింతలపల్లె, తుమ్మలపల్లి, రాచకుంటవారిపల్లి, భూమయ్యగారిపల్లె, పులివెందుల మండలం కనంపల్లె గ్రామాల పరిధిలో యురేనియం కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థను ఏర్పాటు చేశారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ పరిశ్రమ స్థాపించారు. రైతులు విలువైన భూములు ఇచ్చారు. నిత్యం కాలుష్య కోరల మధ్య జీవనం సాగించే యురేనియం బాధిత గ్రామాలు ఎన్నో ఏళ్లుగా శుద్ధమైన తాగునీరు అందక తల్లడిల్లుతున్నాయి. ఈ గ్రామాలకు చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి శుద్ధి చేసిన స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని సీఎం అయ్యాక జగన్‌ హామీ ఇచ్చారు. రూ.35 కోట్లతో శంకుస్థాపన చేశారు. నెలలు గడుస్తున్నా ఈ ప్రాజెక్టు సర్వేలోనే అడుగులో అడుగేస్తోంది. ఈ పరిశ్రమ పైపులైను వేసిన భూములను సేకరిస్తామని, పచ్చదనం పెంచుతామని, అన్ని గ్రామాలకు శుద్ధి జలాలు ఇస్తామని ఆ కంపెనీ ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదు. భూములు కోల్పోయిన కొందరు రైతు కుటుంబాలకు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని రైతులు ఆరోపిస్తున్నారు.


ఫైళ్లకు ఎక్కని బద్వేలు-సోమశిల లిఫ్ట్‌

బద్వేలు జనాభా లక్ష పైమాటే. వీరు తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్నారు. బద్వేలు పట్టణానికి తాగునీరు, బద్వేలు, గోపవరం, బి.కోడూరు, అట్లూరు మండలాల్లో 10 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు 5 టీఎంసీల సామర్థ్యంతో బద్వేలు-సోమశిల ఎత్తిపోతల పథకం నిర్మిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. పాదయాత్ర తరువాత ఎన్నికల ప్రచారంలో భాగంగా బద్వేలు నాలుగు రోడ్ల కూడలిలో జరిగిన సభలో ప్రాజెక్టుపై హామీ ఇచ్చారు. ఏడాది కావస్తున్నా బద్వేలు పట్టణ ప్రజలకు తాగునీరు, ఆయా గ్రామాలకు సాగు, తాగునీరు ఇచ్చే కీలకమైన ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలకు కూడా నోచుకోలేదు. పట్టణ ప్రజలు మాత్రం తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్నారు. ఇదే నియోజకవర్గం పరిధిలో ఎన్టీఆర్‌ తెలుగుగంగ కాలువ ప్రవహిస్తుంది. సమీపంలో బ్రహ్మంసాగర్‌ జలాశయం నుంచి నీటి సరఫరా చేస్తున్నా బద్వేలు వాసులకు నీటి కష్టాలు తప్పడం లేదు. బద్వేలు-సోమశిల ఎత్తిపోతల పథకం చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 


కడపకు సోమశిల లిఫ్ట్‌ అంతేనా..?

కడప నగర జనాభా 3.35 లక్షలు. వ్యాపారం కేంద్రంగా అభివృద్ధి చెందుతుండడం, ఉపాధి కోసం ఆయా పల్లెల ప్రజలు, ఇతర జిల్లాల కూలీలు వలస వస్తుండడం వల్ల నగర జనాభా పెరుగుతోంది. తాగునీటి కష్టాలు రోజు రోజుకు తీవ్రం అవుతున్నాయి. ఈ సమస్య అధిగమించేందుకు సోమశిల నుంచి నీటిని తీసుకొచ్చేందుకు కడప-సోమశిల తాగునీరు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. మూడు చోట్ల లిఫ్ట్‌ చేయాల్సి రావడంతో ప్రతిపాదనలకే పరిమితం అయింది. ఆ తరువాత ఎస్‌ఆర్‌-2 జలాశయం నుంచి కృష్ణాజలాలు లిఫ్ట్‌ చేసి తాగునీరు అందించాలనే ప్రతిపాదన అచరణకు నోచుకోలేదు. తాజాగా గండికోట, మైలవరం నుంచి గ్రావిటీ ద్వారా నగరానికి తాగునీరు తీసుకురావాలనే ప్రతిపాదనకు మోక్షం లభించలేదు. జగన్‌ సీఎం అయ్యాక కూడా దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు.

Updated Date - 2020-05-29T11:22:43+05:30 IST