శివాలయాల్లో కార్తీక శోభ

ABN , First Publish Date - 2020-12-01T05:37:11+05:30 IST

కార్తీక పౌర్ణమి, మూడవ కార్తీక సోమవారాలు పురష్కరించుకుని శివాలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి.

శివాలయాల్లో కార్తీక శోభ
పోట్లదుర్తి శివాలయంలో దీపాలు వెలిగిస్తున్న భక్తులు

ప్రొద్దుటూరు టౌన్‌, నవంబరు 30: కార్తీక పౌర్ణమి, మూడవ కార్తీక సోమవారాలు పురష్కరించుకుని శివాలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని స్వామివారి దర్శనానికి బారులు తీరా రు.  మహిళలు తెల్లవారుజామున అయిదు గంటల నుంచి ఆలయం లో స్వామి, అమ్మవార్లను దర్శించి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించారు. అగస్త్యేశ్వరస్వామి ఆలయం, రామేశ్వరంలోని ముక్తిరామలింగేశ్వరస్వామి ఆలయం, పెన్నాతీరంలోని అమృతేశ్వరస్వామి ఆలయా లు భక్తులతో సందడిగా మారాయి. భక్తుల తాకిడితో ఆలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. ఆలయాల్లో భక్తులకు ఇబ్బంది కలుగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం అయిదు గంటల నుంచి మహిళలు ఆలయాలకు చేరుకుని దీపాలు వెలిగించారు.


ఎర్రగుంట్లలో...

ఎర్రగుంట్ల, నవంబరు 30: కార్తీక పౌర్ణమి వేడుకలను సోమవారం భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు క్యూ కట్టారు. ఆలయాల్లో కార్తీక ద్వీపాలను వెలిగించి తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. పోట్లదుర్తిలోని శివాలయంలో భారీ ఎత్తున మహిళలు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎర్రగుంట్ల, చిలమకూరు, ఆర్టీపీపీలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆర్టీపీపీలో శ్రీఅశ్వర్థనారాయణస్వామికి వేదపండితులచే ప్రత్యే క పూజలు నిర్వహించారు.


మైలవరంలో....

మైలవరం, నవంబరు 30 : మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీఅగస్త్యేశ్వరస్వామికోన, దత్తాత్రేయమునికోన, త్రిమూర్తులకోన, కల్లుట్ల రామలింగేశ్వరస్వామికోనతో పాటు మైలవరం, చిన్నకొమెర్ల తదితర గ్రామాల్లోని శివాలయాలు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం శివనామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు ఆలయాల వద్ద కార్తీకదీపాలు వెలుగించి భక్తిశ్రద్దలతో మొక్కు లు తీర్చుకున్నారు. అగస్తేశ్వరస్వామి కోన వద్ద కోనేరులో స్నానాలు ఆచరించి భక్తులు పూజలు నిర్వహించారు. పలు ఆలయాల్లో భక్తులకు అన్నదానం చేశారు. రాత్రికి భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.


కొండాపురంలో...

కొండాపురం, నవంబరు 30: మండలంలో కార్తీక పౌర్ణమిని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. సోమవారం మూడో వారం కావడంతో వేకువజాము నుంచే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ప్రముఖ శైవక్షేత్రాలైన బాలప్పకోన, మల్లేశ్వరకోనలో వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. కార్తీక పౌర్ణమి కావడంతో ఆలయాల వద్ద మహిళలు పెద్దఎత్తున కార్తీక దీపాలను వెలిగించారు. తెల్లవారుజామునే అభిషేకాలు, అర్చనలతో శివన్నామస్మరణతో ఆలయాలన్నీ మార్మోగాయి. బాలప్పకోనలో తిరుమలాయపల్లెకు చెందిన రామయ్య, మల్లేశ్వరకోనలో పలువురు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 


జమ్మలమడుగులో...

జమ్మలమడుగు రూరల్‌, నవంబరు 30: జమ్మలమడుగులో కార్తీక పౌర్ణమి, మూడవ సోమవారం పురష్కరించుకుని శివాలయాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కన్యతీర్థం శ్రీ త్రిపుర సుందరీ సమేత సుందరేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు పూజలు చేసి మొక్కుకున్నారు. జమ్మలమడుగు నగర పంచాయతీ పరిధిలోని శ్రీ సోమేశ్వరస్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆదివారం రాత్రి జ్వాలాతోరణం నిర్వహించారు. అలాగే మోరగుడి గ్రామం దేవగుడి, తదితర ప్రాంతాల్లో శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకున్నారు.

Updated Date - 2020-12-01T05:37:11+05:30 IST