నేటి సమ్మెను జయప్రదం చేయాలి

ABN , First Publish Date - 2020-11-26T04:21:52+05:30 IST

గురువారం జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు తెలిపారు.

నేటి సమ్మెను జయప్రదం చేయాలి
మాట్లాడుతున్న ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు

ప్రొద్దుటూరు టౌన్‌, నవంబరు 25: గురువారం జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు తెలిపారు. సంఘం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని, వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికి ఇటీవల రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారని విమర్శించారు. ప్రభుత్వ విధానాలకు నిరసనగా నేడు జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక నాయకులు నరసింహ, శ్రీను, దస్తగిరి, శివ, యేసోబు, నిర్మల, శ్రీనివాసరెడ్డి, భాస్కర్‌, వెంకటేష్‌, పాల్గొన్నారు. 


ఏపీటీఎఫ్‌ సంఘీభావం : కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన సార్వత్రిక సమ్మెకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు ఏపీటీఎ్‌ఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, ఈ సమ్మెలో ఉపాధ్యాయులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 


నేడు ర్యాలీ : దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సీపీఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. ఉదయం 11 గంటలకు పాత బస్టాండులోని శివాలయం సెంటర్‌ వరకు ర్యాలీ ఉంటుందని, కార్మికులు ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 


ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

జమ్మలమడుగు రూరల్‌, నవంబరు 25: దేశవ్యాప్త సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని సీపీఎం నాయకుడు శివనారాయణ తెలిపారు. అందులో భాగంగా ఆయన బుధవారం పట్టణంలోని ఎల్‌ఐసీ కార్యాలయం, పోస్టాఫీసు, బీఎ్‌సఎన్‌ఎల్‌ కార్యాలయం, బ్యాంకుల వద్ద కరపత్రాలు అందించి విజ్ఞప్తి చేశారు. అనంతరం జమ్మలమడుగులోని వీఆర్‌ఏలు తహసీల్దారు మధుసూదన్‌రెడ్డికి వినతిపత్రం అందించి తాము సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-11-26T04:21:52+05:30 IST