రోడ్డు ప్రమాదంతో పిచ్చివాడైన భర్త.. ఇద్దరు పిల్లలతో కష్టాలు పడుతున్న గర్భిణి..!

ABN , First Publish Date - 2020-06-22T20:34:14+05:30 IST

అతని రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం ఇప్పుడు నరకయాతన అనుభవిస్తోంది. రోడ్డు ప్రమాదంతో ఇంటిపెద్దకు మతిస్థిమితం తప్పి..

రోడ్డు ప్రమాదంతో పిచ్చివాడైన భర్త.. ఇద్దరు పిల్లలతో కష్టాలు పడుతున్న గర్భిణి..!

ఖాజీపేట (కడప): అతని రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం ఇప్పుడు నరకయాతన అనుభవిస్తోంది. రోడ్డు ప్రమాదంతో ఇంటిపెద్దకు మతిస్థిమితం తప్పి.. పిచ్చిపట్టినట్టు ప్రవర్తిస్తుండడంతో అతడిని  మంచానికి కట్టేయాల్సి వచ్చింది. గర్భంతో ఉన్న అతని అవిటి భార్య, ఇద్దరు పిల్లలు తిండికి కూడా లేక అవస్థ పడుతున్నారు. వివరాలు ఇలా..


అనంతపురం జిల్లాకు చెందిన పసుపులేటి రాము(25) ఖాజీపేట టీచర్స్‌ కాలనీ చివరన డేరాలు వేసుకుని భార్యాబిడ్డలతో జీవిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా ప్రస్తుతం భార్య గర్భవతి. దీనికి తోడు ఆమెకు ఒక కాలు లేకపోవడంతో కొయ్యకాలు అమర్చారు. రాము రోజూ పల్లెలకు తిరిగి స్టవ్‌లు, కుక్కర్లు లాంటివి మరమ్మతులు చేస్తూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించేవాడు. ఈ నేపథ్యంలో రెండువారాల క్రితం జాతీయ రహదారిలోని భూమాయపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇతను తీవ్రంగా గాయపడ్డాడు. వైద్యం కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లగా మెరుగైన వైద్యం అవసరమని అక్కడి నుంచి తిరుపతికి తరలించారు. 


అక్కడ కొద్ది రోజుల తరువాత బాగయిందని పంపించేశారు. అయితే ఇంటికి వచ్చినప్పటి నుంచి రాము పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. పిచ్చిపట్టినట్లుగా పరుగులు తీస్తూ ఒళ్లంతా నొప్పులంటూ అల్లాడిపోతున్నాడు. ఎవరైనా అడ్డుకుంటే కొట్టేదానికి వస్తున్నాడు. దీంతో అతని భార్య, స్థానికులు కలసి రామును మంచానికి కట్టివేశారు. సంపాదించే భర్త మంచానికి పరిమితం కాగా.. అతనికి సరైన వైద్యం అందక, ఇంట్లో ఇద్దరు పిల్లలకు తిండిలేక గర్భవతి అయిన భార్య తీవ్ర వేదనకు గురి అవుతోంది. తన భర్తకు మెరుగైన వైద్యంతో పాటు తమకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ఆమె దాతలను కోరుతోంది.

Updated Date - 2020-06-22T20:34:14+05:30 IST