బాదుడే.. బాదుడు... భారీగా పెరగనున్న రిజిస్ర్టేషన్‌ చార్జీలు

ABN , First Publish Date - 2020-07-28T22:03:40+05:30 IST

ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెంచుకోవడంలో ప్రభుత్వం స్టైలే వేరు. మార్కెట్లో దేనికైతే డిమాండ్‌ ఉందో దానిపైనే రేట్లు, పన్నులు పెంచి ఖజానాకు కాసుల వర్షం కురిపించుకుంటోంది. మద్యం

బాదుడే.. బాదుడు... భారీగా పెరగనున్న రిజిస్ర్టేషన్‌ చార్జీలు

డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో భారీగా పెంపు

ప్రజలపై రూ.40 కోట్ల మేర భారం ?


(కడప- ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెంచుకోవడంలో ప్రభుత్వం స్టైలే వేరు. మార్కెట్లో దేనికైతే డిమాండ్‌ ఉందో దానిపైనే రేట్లు, పన్నులు పెంచి ఖజానాకు కాసుల వర్షం కురిపించుకుంటోంది. మద్యం ధరలు 75 శాతం పెంచిన ప్రభుత్వం ఇటీవల పెట్రో ధరల భారం మోపింది.  ఆ నొప్పిని మరిచిపోకుండానే భూముల రిజిస్టే్ట్రషన్‌ ధరలను ఏకంగా 49 శాతం మేర పెంచనుంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖలు సైలెంట్‌గా ధరలు పెంచే కసరత్తు చేస్తున్నాయి. ఆగస్టు 1 నుంచి పెరిగిన భూముల రిజిస్ట్రేషన్‌ ధరలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే జిల్లావాసులపై రూ.40 కోట్ల మేర అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. కరోనా కారణంగా స్థలాలు, ప్లాట్లు కొనే నాథుడు కరువయ్యారు. రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైంది. ఇప్పుడు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లుగా రిజిస్ట్రేషన్‌ ధరలు పెరగడం మరింత భారం మోపినట్లుందని అంటున్నారు. ఎక్కడైతే భూములకు మంచి డిమాండ్‌ ఉందో అక్కడే భారీగా పెరిగిపోనుండటం విశేషం. ఏటా ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ శాఖకు లక్ష్యాలు నిర్ణయిస్తుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.200 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు అంచనా. 


డిమాండ్‌ ఉన్న చోట

భూములకు డిమాండ్‌ ఎక్కడ ఉందో అక్కడే రిజిస్ర్టేషన్‌ చార్జీలు భారీగా పెంచే ప్రతిపాదనలు తయారయ్యాయి. జాతీయ, రాష్ట్ర రహదారులు, ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఇలా పారిశ్రామికవాడ ప్రాంతాల్లో పెంపు 49 శాతంగా ఉంటుంది. అన్నమయ్య అర్బన్‌ డెవల్‌పమెంట్‌ పరిఽధిలో మార్కెట్‌ వాల్యు భారీగా పెరగనుంది. కడప, చిత్తూరు, కర్నూలు జాతీయ రహదారితో పాటు మరికొన్ని జాతీయ రహదారులు, ముంబై, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, క్రిష్ణపట్నం రహదారి, కడప రహదారులు ఉన్నాయి. కడప రూరల్‌ పరిధిని పరిశీలిస్తే కొప్పర్తి పారిశ్రామికవాడ రూరల్‌ పరిధిలోకి వస్తుంది. రిమ్స్‌, రాయచోటి, పులివెందుల వెళ్లే రింగు రోడ్డు చుట్టూ భూముల రిజిస్ర్టేషన్‌ ధరలు పెరుగుతాయి. తోళ్లగంగనపల్లెలో నిన్నటి వరకు చదరపు గజం రూ.600 ఉండగా ఇప్పుడు రూ.970 వరకు పెరగనుంది. పబ్బాపురంలో రూ.990 నుంచి రూ.1470, పాపాసాహెబ్‌పేట రూ.750 నుంచి 1130కు పెరగనుంది. ఇక్కడ 49 శాతం పెంచనున్నారు. రామరాజుపల్లెలో 3450 నుంచి రూ.4 వేలు, ఊటుకూరు రూ.3100 నుంచి 4 వేలకు చేరనుంది. కొన్ని చోట్ల 10 శాతం, 16 శాతం అలా పెంచుకుంటూపోయారు. డిమాండ్‌ ఉన్న చోటనే భారీగా పెంచేశారు. అర్బన్‌ పరిధిలో కొన్ని చోట్ల 10 శాతం పెంచారు. ప్రతిపాదిత పెంపు చూస్తే కడప రూరల్‌  సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయానికే ఏడాదికి రూ.4 కోట్ల మేర అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే జిల్లా మొత్తం సరాసరి కనీసం రూ.40 కోట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ఆగస్టు 1 నుంచి పెంచిన ధరలతోనే రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇక ఇంటి నిర్మాణానికి సంబంధించి చదరపు అడుగుకు రూ.20 పెరగనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే జనంపై సైలెంట్‌గానే బాదుడుకు రంగం సిద్ధమైంది.

Updated Date - 2020-07-28T22:03:40+05:30 IST