కరోనాలోనూ తగ్గని ఎర్రస్మగ్లింగ్.. ఎర్రమాఫియాలో ఖద్దరు బాబులు
ABN , First Publish Date - 2020-08-12T21:22:22+05:30 IST
అత్యంత విలువైన, అరుదైన ఎర్రచందనం స్మగ్లింగ్ జోరు కరోనా లాక్డౌన్ సమయంలోనూ తగ్గడం లేదు. కోట్ల విలువ చేసే ఎర్రదుంగలను అక్రమంగా తరలించి కోట్లు దండుకుంటున్నారు. వారికి అధికార పార్టీలో

కేసుల మాఫీకి యత్నాలు
రైల్వేకోడూరు(కడప): అత్యంత విలువైన, అరుదైన ఎర్రచందనం స్మగ్లింగ్ జోరు కరోనా లాక్డౌన్ సమయంలోనూ తగ్గడం లేదు. కోట్ల విలువ చేసే ఎర్రదుంగలను అక్రమంగా తరలించి కోట్లు దండుకుంటున్నారు. వారికి అధికార పార్టీలో కొందరి అండదండలు ఉండడం వల్లే ఇలా జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలో వెలుగోడు, శేషాచలం, పెనుశిల అడవుల్లో అపారమైన విలువైన ఎర్రచందనం చెట్లను కాపాడుకోవడానికి గత ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టాలు తీసుకువచ్చి ఎర్రచందనం రవాణా చేసిన వ్యక్తులపై పీడీ యాక్టు నమోదు చేయడంతో పాటు చాలామంది ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లను పట్టుకుని జైలుకు పంపిన సంఘటనలున్నాయి. 5 నెలల కిందట రైల్వేకోడూరు మండలంలోని శెట్టిగుంట అడవిలో రూ.2 కోట్ల విలువ చేసే దుంగలను రైల్వేకోడూరు టాస్క్ఫోర్సు అధికారులు పట్టుకున్నారు. తమిళనాడు స్మగ్లర్లతో స్థానిక స్మగ్లర్ల చేతులు కలిపి అక్రమంగా రవాణా చేస్తున్నారని అధికారులు గుర్తిస్తున్నారు. ముగ్గురు కీలకమైన నేతలు పెట్టుబడులు పెట్టి ఉన్నారని అధికారులు కేసు నమోదు చేసినట్లు పేర్కొంటున్నారు. అయితే ఆ ముగ్గురికి ఒక ప్రజాప్రతినిధి అండదండలు ఉన్నాయని వారిలో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిసింది. కేసు మాఫీకి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కీలకమైన నేతల్లో మూడు సామాజిక వర్గాలకు చెందిన నాయకులు ఉండడం విశేషం. కాగా ఎర్రమాఫియాతో సంబంధాలు ఉన్న నేతలను ఇంతవరకు అరెస్టు చేయకపోవడం కొసమెరుపు.
స్మగ్లింగ్‌లో ఎవరున్నా ఎలాంటి రాజీ లేదు
ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవు. ప్రతి నిత్యం మూడు పార్టీలు చిట్వేలి నుంచి వెంకటగిరి అటవీ ప్రాంతం వరకు, రైల్వేకోడూరు, బాలపల్లె నుంచి సానిపాయి వరకు కూంబింగ్ చేస్తున్నారు. పాత నిందితులు, తమిళ స్మగ్లర్లపైన ప్రత్యేక నిఘా పెట్టాము.
- వెంకటనరసింహరావు, డీఎఫ్‌వో, రాజంపేట
ఎర్రచందనం అక్రమ రవాణాపై నిఘా ఉంది
ఎర్రచందనం అక్రమ రవాణాపై నిఘా ఉంది. కేసుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. నిరంతరాయంగా వాహనాలను తనిఖీలు చేస్తున్నాం. లాక్డౌన్ సమయంలో కూడా ఎర్రచందనంపై దృష్టి సారించాం.
- ఆవుల ఆనందరావు, సీఐ రైల్వేకోడూరు