దాహం...దాహం..

ABN , First Publish Date - 2020-03-02T10:31:58+05:30 IST

వేసవి కాలం ప్రారంభమైంది. సూర్యుడు రోజురోజుకు మండుతుండడంతో నీటి ఎద్దడి నానాటికీ పెరుగుతోంది. నిన్న..మొన్నటి వరకు

దాహం...దాహం..

157 గ్రామాల్లో నీటిఎద్దడి 

387 ట్యాంకర్లతో సరఫరా

వ్యవసాయ బోరుబావుల ద్వారా నీటి కొనుగోలు

నీళ్ళలా ఖర్చవుతున్న నిధులు 

రోజుకు రూ.2 లక్షలకు పైగా ఖర్చు


కడప రూరల్‌ మార్చి 1 : వేసవి కాలం ప్రారంభమైంది. సూర్యుడు రోజురోజుకు  మండుతుండడంతో నీటి ఎద్దడి నానాటికీ పెరుగుతోంది. నిన్న..మొన్నటి వరకు పదుల సంఖ్యలో ఉన్న దాహార్తి గ్రామాలు ఉన్నఫలంగా 157 గ్రామాలకు చేరడంతో ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖాధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే పోనుపోను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని అందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ చర్యలపై నానాతంటాలు పడుతున్నారు.  జిల్లాలోని 50 మండలాల్లో ఏదో ఒక ప్రాంతం నుంచి ప్రతిరోజూ నీటి ఎద్దడి సమస్యలను ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు మోసుకొస్తున్నారు. ఇప్పటికే ఆర్‌డబ్ల్యుఎ్‌స శాఖ నీటి ఎద్దడి నివారణకు ప్రతిరోజూ రెండు లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేస్తోంది. జిల్లాలోని 157 గ్రామాల్లో ప్రతిరోజూ 387 అద్దెట్యాంకర్ల ద్వారా నీటిని ప్రజలకు సరఫరా చేస్తోంది. ఒక్కొక్క ట్యాంకరు నీటికి రూ.519 చెల్లిస్తోంది.


ఈ లెక్కన ప్రతిరోజూ మొత్తం ట్యాంకర్ల నీటి సరఫరాకు దాదాపు రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇవి కాక నీటి ఎద్దడి గ్రామాల్లోని పలువురు  రైతుల నుంచి పదుల సంఖ్యలో బోరుబావులను అద్దెకు తీసుకుని వీటి ద్వారా ప్రజలకు నీటిని అందిస్తున్నారు. ట్యాంకర్లు, అద్దె బోరు బావులకు మొత్తం కలిపి నీటి సరఫరాకు ప్రతిరోజూ దాదాపు రూ.2.5 లక్షలను చెల్లిస్తున్నారు. ఇలా నెలకు రూ.70 లక్షలకు పైగా చెల్లిస్తున్నారు. ఈ ఖర్చు ఈ వేసవి ముగిసే నాటికి తడిసి మోపెడు కానుండడంతో సకాలంలో ట్యాంకర్ల యజమానులకు బిల్లులు చెల్లిస్తామో లేదోనన్న మీమాంసలో అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు.


మండలాల వారీగా...

మండలాల వారీగా పరిశీలిస్తే...రాయచోటి నియోజకవర్గంలోని 5 మండలాల్లోని 64 గ్రామాల ప్రజలు నీటిఎద్దడితో అల్లాడుతున్నారు. 141 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. రాజంపేట నియోజకవర్గంలోని 2 మండలాల్లోని 9 గ్రామాల్లో 24 ట్యాంకర్లను, బద్వేల్‌ నియోజకవర్గంలోని 2 మండలాల్లోని 4 గ్రామాల్లో 22 ట్యాంకర్లను, కోడూరు నియోజకవర్గంలోని 3 మండలాల్లోని 50 గ్రామాలలో 157 ట్యాంకర్లను, కమలాపురం నియోజకవర్గంలోని 9 గ్రామాల్లో 17 ట్యాంకర్లను, మైదుకూరు నియోజకవర్గంలోని 11 గ్రామాల్లో 22 ట్యాంకర్లను, పులివెందుల నియోజకవర్గంలోని 9 గ్రామాల్లో 20 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. 2019-20 ఏడాదిలో జిల్లాలోని కొన్ని మండలాల్లో ఆశించిన మేరకు వర్షపాతం నమోదు కాకపోవడంతో ఆ మండలాల్లో నీటిముప్పు ముంచుకొస్తోంది. ప్రస్తుతం ఉన్న నీటి ఎద్దడి రెట్టింపు అయి మరింత జటిళం కానుంది. నీటి ఎద్దడి మరింతగా పెరుగుతూ వస్తుండడంతో ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖను ఆర్థికభారం వెంటాడుతోంది. ఈ పరిస్ధితులను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నారు. 


Updated Date - 2020-03-02T10:31:58+05:30 IST