అధికారమిస్తే సీమ ప్రాజెక్టులు పూర్తిచేస్తాం: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2020-12-11T05:05:58+05:30 IST

రాష్ట్రాభివృద్ధికి బీజేపీ ఒక కమిట్‌మెంట్‌తో పనిచేస్తుందని, అధికారమిస్తే సీమలోని పెండింగు ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

అధికారమిస్తే సీమ ప్రాజెక్టులు పూర్తిచేస్తాం: సోము వీర్రాజు
బీజేపీ కడప పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

ఎన్టీఆర్‌ 1984లో ప్రారంభించినవి ఇంతవరకూ పూర్తి కాలేదు

రాష్ట్రాభివృద్ధికోసం బీజేపీ కమిట్‌మెంట్‌తో పనిచేస్తుంది   

ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

జగన్‌ పోవాలి బీజేపీ రావాలి : ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి


కడప, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధికి బీజేపీ ఒక కమిట్‌మెంట్‌తో పనిచేస్తుందని, అధికారమిస్తే సీమలోని పెండింగు ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గురువారం నగర శివారులోని కల్యాణమండపంలో కడప పార్లమెంటు విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ రాజకీయ నేతలపై, ప్రభుత్వాలపై ప్రజల్లో విశ్వాసం కల్పించే విధంగా మోదీ చర్యలు చేపడుతున్నారన్నారు. అవినీతి, కుటుంబ పాలనను మోదీ సహించరన్నారు. రెండు ఎకరాల నుంచి చంద్రబాబు వేల కోట్లకు పడగెత్తితే జగన్‌కు లోట్‌స పాండ్‌, ప్యాలె్‌సలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ 1984లో తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులు ప్రారంభిస్తే ఇప్పటికీ 40 శాతం పూర్తి కాలేదన్నారు.


రూ.40వేల కోట్లతో సీమ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని జగన్‌ అంటున్నారని.. అయితే అందులో సగం సొమ్ము దోచుకునేందుకేనని అన్నారు. కాల్వలు తవ్వకుండానే బిల్లులు చేసుకుంటున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే సీమ అభివృద్ధికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి రూ.15వేల కోట్లతో  పెండింగు ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. అప్పు తెచ్చి చంద్రన్న కానుక, జగనన్న కానుకలంటూ పంచుతున్నారని, అవేమన్నా లోట్‌సపాండ్‌ నుంచి, లేక హెరిటేజ్‌ నుంచి తెస్తున్నవా అంటూ ప్రశ్నించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్‌ అన్నారు. ఆప్కోలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ పత్రిక పుంఖానుపుంఖాలుగా కథనాలు రాసిందని, అధికారంలోకి వచ్చిన తరువాత ఆప్కో చైర్మన్‌ శ్రీనివాసులు జగన్‌ కుటుంబంలోని ముఖ్యులను కలవడంతో అదంతా మాఫీ అయిందని విమర్శించారు.


బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ పార్టీలను.. వ్యక్తులను భూస్థాపితం చేసే బదులు రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని సూచించారు. సొంత ఇలాఖాలోనే రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. నాటుసారాను సీసాలో పోసి స్కాచ్‌ ధరకు అమ్మిన ఘనుడు మన ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల రంగుల కోసం రూ.4వేల కోట్లు ఖర్చు పెట్టారని, ఆ సొమ్ము ప్రాజెక్టులకు వినియోగించి ఉంటే పూర్తయ్యేవన్నారు. వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని, అయితే వైసీపీకి చెందిన రైతులకే పంట నష్టపరిహారం అంచనా వేస్తున్నారన్నారు. జగన్‌ పోవాలి - బీజేపీ రావాలి అన్న నినాదంతో అందరూ ముందుకు రావాలన్నారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి మన వంతు విరాళాలు అందివ్వాలన్నారు.


ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ రైతు తాను పండించిన పంట దేశంలో ఏ రాష్ట్రంలో అయినా అమ్ముకునే విధంగా  మోదీ చట్టం తెచ్చారన్నారు. కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, రైతులపై కాల్పులు జరిపిన చంద్రబాబు, 18 నెలల్లో రైతులకు ఎలాంటి మేలు చేయని జగన్‌లు రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. కార్యకమ్రంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, రాష్ట్ర కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమే్‌షనాయుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు రామమునిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు యల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జయరాములు, బీజేపీ నేతలు శ్రీనాధరెడ్డి, సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి, బండి ప్రభాకర్‌, వెంకటసుబ్బారెడ్డి, సుష్మా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T05:05:58+05:30 IST