సమస్యలు పట్టవా..!

ABN , First Publish Date - 2020-05-30T11:21:00+05:30 IST

జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టాక మూడు పర్యాయాలు జిల్లాలో పర్యటించారు. జిల్లా ప్రగతి పనులపై జిల్లా యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే.. దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలను

సమస్యలు పట్టవా..!

శీతలగిడ్డంగులు లేక నష్టపోతున్న ఉద్యాన, పసుపు రైతులు

అసంపూర్తిగా కడప అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ

కొప్పర్తి పారిశ్రామకవాడలో పరిశ్రమలు ఏవీ..?

అప్పెరల్‌ పార్కు కలేనా..?

జిల్లాలో దశాబ్దాలుగా తిష్టవేసిన అపరిస్కృత సమస్యలు ఎన్నో

ఏడాది పాలనలో వాటిపై దృష్టి పెట్టని సీఎం జగన్‌


కడప, మే 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టాక మూడు పర్యాయాలు జిల్లాలో పర్యటించారు. జిల్లా ప్రగతి పనులపై జిల్లా యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే.. దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలను పట్టించుకోవడం లేదు. కడప నగరంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ అసంపూర్తిగా ఆగిపోయింది. శీతల గిడ్డంగులు నిర్మించాలన్న టమోటా, ఉద్యాన, పసుపు రైతుల కోరిక ఎండమావిగానే మారింది. చేనేతల ఉపాధి ఆశయంగా ప్రొద్దుటూరులో నిర్మించ దలచిన అప్పెరల్‌ పార్కు ఫైల్‌ బూజు దులపడం లేదు. ఇలా ఎన్నో సమస్యలు. వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలనలో వాటి పరిష్కారం దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.


ప్రొద్దుటూరులో ఊసేలేని భూగర్భ డ్రైనేజీ..

వాణిజ్య పరంగా రెండో ముంబాయి ప్రసిద్ధిచెందిన ప్రొద్దుటూరు పట్టణంలో డ్రైనేజీ సమస్యతో జనం తల్లడిల్లుతున్నారు. పట్టణ జనాభా 2.18 లక్షలు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీని 2006లో నాటి సీఎం వైఎస్‌ మంజూరు చేశారు. ఇప్పటికీ ఒక్క పునాది రాయి కూడా పడలేదు. గత ప్రభుత్వంలో బొల్లావరం దగ్గర పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టినా అక్కడితోనే ఆగిపోయింది. పాదయాత్రలో భాగంగా ప్రొద్దుటూరులో జరిగిన సభలో జగన్‌ మాట్లాడుతూ ‘ఆనాడు నాన్న వైఎస్‌ చేపట్టిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు మనం అధికారంలోకి రాగానే చేపడుతాను..’ అని హామీ ఇచ్చారు. ఏడాది గడిచినా భూగర్భ డ్రైనేజీకి సంబంఽఽధించి ఎలాంటి పనులూ చేపట్టలేదు.


కడపలో అసంపూర్తిగా...

కడప కార్పోరేషన్‌లో 2006లో నాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణానికి రూ.70 కోట్లు మంజూరు చేశారు. నాలుగు జోన్లుగా విభజించి పనులు చేపట్టారు. 3, 4 జోన్ల పరిధిలో మాత్రమే పనులు పూర్తి అయ్యారు. 1, 2 జోన్ల పరిధిలో పనులు మొదలే కాలేదు. పనులు ఆగిపోయి 14 ఏళ్లు గడిచాయి. జిల్లాకు చెందిన జగన్‌ సీఎం కావడం.. నాడు తండ్రి వైఎస్‌ ప్రారంభించిన పథకం కావడంతో తనయుడు చేపడతారని జనం ఆశించారు. ఏడాది గడిచినా ఆ దిశగా చర్యలు శూన్యం.


శీతల గిడ్డంగులు కలేనా..?

జిల్లా ఉద్యాన పంటలు, పసుపు సాగుకు ప్రసిద్ధి. 1.35 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. పులివెందుల, రైల్వే కోడూరు, మైదుకూరులో, రాయచోటి, రాజంపేట ప్రాంతాల్లో  ఉద్యానపంటలు ఎక్కువ. అలాగే.. సంబేపల్లి, చిన్నమండెం మండలాల్లో 3 వేల హెక్టార్లకు పైగా టమోటా సాగు చేస్తున్నారు. ధరలు పతనమై ఏటా రోడ్డున పారబోస్తున్న సంఘటనలు ఎన్నో. గిట్టుబాటు ధరలేని సమయంలో గిడ్డంగుల్లో దాచుకొని.. ధర వచ్చాక అమ్ముకోవడానికి వీలుగా శీతల గిడ్డంగులు నిర్మించాలని జిల్లా రైతులు దశాబ్దాలుగా కోరుతున్నారు. గత ఎన్నికల్లో టమోటా, మామిడి రైతుల సంక్షేమం కోసం శీతల గిడ్డంగులు, జ్యూస్‌ ప్యాక్టరీ నిర్మిస్తానని రాయచోటి ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌ విఫ్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీ అమలుకు ఒక్క అడుగు కూడా పడలేదు. అలాగే.. మైదుకూరు, రాజంపేట, బద్వేలు, ప్రొద్దుటూరు, కడప తదితర ప్రాంతాల్లో పసుపు దాదాపుగా 3,500 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఏటా ధరలు పతనమైనప్పుడు రైతులు నిల్వ చేసుకోవడానికి కర్నూలు, నెల్లూరు జిల్లాలో ప్రైవేటు శీతల గిడ్డంగులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వమే ఆయా మార్కెట్‌ యార్డుల్లో పసుపు నిల్వలకు శీతల గిడ్డంగులు నిర్మించాలనే రైతుల వినతిని పట్టించుకునే వారు లేరు.


ఇతర సమస్యలు ఇవీ

  • బుగ్గవంక ఆధునికీకరణకు 2006లో చేపట్టారు. ప్రొటెక్షన్‌ వాల్‌ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. ఇరువైపులా రహదారుల నిర్మాణానికి భూసేకరణ చేయాల్సి ఉంది.
  • కొప్పర్తి పారిశ్రామికవాడలో 6700 ఎకరాలు సేకరించారు. పెద్ద పరిశ్రమలు ఇప్పటికీ రాలేదు.
  • ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చేనేతలకు చేయూతగా అపెరల్‌ పార్కు నిర్మాణం చేపట్టాలి. స్థలం సేకరించినా నిరుపయోగంగా ఉంది. ఏసీసీ సిమెంటు పరిశ్రమను నిర్మించాలి. మూతబడ్డ పాల కర్మాగారాన్ని పునరుద్ధరించాలి.
  • బద్వేలు నియోజకవర్గంలో తెలుగుగంగ ఆయకట్టు రైతులకు సాగునీరందేలా బ్రహ్మంసాగర్‌ జలాశయంలో ఏటా 17.5 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలి.

Updated Date - 2020-05-30T11:21:00+05:30 IST