పెట్రో మంటలు

ABN , First Publish Date - 2020-03-02T10:37:20+05:30 IST

ఆర్టీసీ, మద్యం ధరలను పెంచేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 1 నుంచి విద్యుత్‌ ఛార్జీలను పెంచే యోచనలో ఉంది. తాజాగా పన్ను విధానం సాకుతో

పెట్రో మంటలు

పన్ను విధానం మార్పుతో ధరల మోత

జిల్లాలో రోజుకు రూ.20 లక్షలు అదనపు భారం


కడప (సిటి), మార్చి 1 : ఆర్టీసీ, మద్యం ధరలను పెంచేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 1 నుంచి విద్యుత్‌ ఛార్జీలను పెంచే యోచనలో ఉంది. తాజాగా పన్ను విధానం సాకుతో పెట్రోలు, డీజలు ధరలను పెంచి శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోలుపై వ్యాట్‌ 31 శాతం ఉంటే అదనపుపన్ను రెండు రూపాయలుండేది. పన్ను విధానం మార్పు చేసి అదనపు పన్నుపై మరో 76 పైసలు పెంచింది. అలాగే డీజలుపై 22.25 శాతం వ్యాట్‌ను అలాగే ఉంచి అదనపు పన్నుపై రూ.1.07 పైసలు పెంచారు. అయితే రోజువారీ పెట్రోలు, డీజలు ధరలు తగ్గినా పన్ను విధానం మార్పుతో పెంచిన అదనపు పన్ను భారం మాత్రం అలాగే కొనసాగుతుంది. అంటే పెట్రో, డీజలుపై పెంచిన ధరలను ప్రజలు భరిస్తూనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.


జిల్లాలో రోజుకు రూ.20 లక్షలు భారం

జిల్లాల అన్ని కంపెనీలకు సంబంధించి 280 పెట్రోలు బంకులున్నాయి. కాగా జిల్లాలో అన్ని రకాల వాహనాలు 7,84,947 నడుస్తున్నాయి. పెట్రోలు రోజుకు దాదాపు 5 లక్షల లీటర్లు, డీజలు దాదాపు 16 లక్షల లీటర్లు వినియోగిస్తున్నారు. పెట్రోలుపై 76 పైసలు పెరగడంతో రోజుకు రూ.3.80 లక్షలు, డీజలుపై రూ.1.07 పైసలు పెరగడంతో రోజుకు రూ.16 లక్షల పైచిలుకు అదనం అవుతుంది. అంటే మొత్తంగా దాదాపు రూ.20 లక్షలు అదనపు భారం మోయాల్సిందే. అంటే పెట్రోలు, డీజలు ధర తగ్గినా ఈ పెరుగుదలలో మార్పు ఉండదు కాబట్టి పెట్రోలుపై అదనపు పన్ను రూ.2.76 పైసలు, డీజలుపై రూ.3.07 పైసలు చెల్లిస్తూనే ఉండాలి. ఇదీ జగన్‌ సర్కారు తిరకాసు మాయాజాలం అని చెప్పక తప్పదు.


ఆర్టీసీపై రోజుకు రూ.45 వేలు

అదనపు పన్ను భారం ఆర్టీసీపై కూడా పడింది. జిల్లాలోని 8 డిపోల్లో అద్దె బస్సులు సహా 816 బస్సులు నడుస్తున్నాయి. వీటికి రోజుకు 45 వేల లీటర్ల డీజలు వినియోగం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అదనపు పన్ను రూ1.07 పైసలు పెంచడంతో రోజుకు రూ.45 వేల పైచిలుకు భారం పడనుంది. పన్ను పెరగక ముందు రోజుకు డీజలుపై రూ.13.50 లక్షలు ఖర్చు వచ్చేది. ప్రస్తుతం పెరిగిన మొత్తంతో ఖర్చు దాదాపు రూ.14 లక్షలకు చేరింది.


పెట్రో ధరలు పెంచడం దుర్మార్గం

ఆర్టీసీ ఛార్జీలు, మద్యం ధరలు ప్రత్యక్షంగా పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పన్ను తిరకాసు విధానంతో పెట్రోలు, డీజలు ధరలు పెంచడం దుర్మార్గం. 9 నెలల జగన్‌ పాలనలో సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవితం నరకంలా మారింది. పెట్రోలు, డీజలు పెంపుతో పరోక్షంగా అన్ని రంగాలపై ప్రభావం పడి అన్ని ధరలు పెరగడం తధ్యం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకుని పన్నులను ఉపసంహరించుకోవాలి. 

- అమీర్‌బాబు, పెట్రోల్‌ బంకుల యజమానుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు  


ఇలాగైతే బతికేదెలా?

ఆటో నడుపుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఇలా డీజలు ధరలు పెంచుకుంటూ పోతే ప్యాసింజర్లకు ఛార్జీలకు పెంచాలి. వారు ఆగ్రహిస్తున్నారు. ఇలాగైతే మేమెలా బతకాలి? పెట్రోలు, డీజలు ధరలు తగ్గినా పన్నులు పెంచి ధరలను ఆకాశానికి చేరుస్తున్నారు. లీటరుపై ఒక్క సారిగా రూ.1.07 పైసలు పెంచి మమ్మలను ఆర్ధిక ఇబ్బందులకు గురి చేయడం తగదు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన రూ.10 వేల సాయం ఆనందం కాస్త ఆవిరైపోయింది.

-  నరసింహులు, ఆటో డ్రైవరు 


Updated Date - 2020-03-02T10:37:20+05:30 IST