ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: జేసీ గౌతమి

ABN , First Publish Date - 2020-11-07T06:31:31+05:30 IST

ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని జాయింట్‌ కలెక్టర్‌ గౌతమి పేర్కొన్నారు.

ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: జేసీ గౌతమి
సభలో మాట్లాడుతున్న జేసీ గౌతమి

చెన్నకేశవనాయుడు మైనింగ్‌పై ప్రజాభిప్రాయ సేకరణ

ముద్దనూరు, నవంబరు 6: చెన్నకేశవనాయుడు మైనింగ్‌ విషయంలో ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని జాయింట్‌ కలెక్టర్‌ గౌతమి పేర్కొన్నారు. చెన్నకేశవనాయుడు మైనింగ్‌ విషయంలో ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని జాయింట్‌ కలెక్టర్‌ గౌతమి పేర్కొన్నారు. ముద్దనూరు మండల పరిధిలోని చిన్నదుద్యాల సమీపంలో చెన్నకేశవనాయుడు మైనింగ్‌ విషయమై శుక్రవారం జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. సభాప్రాంగణం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 200 మంది పోలీసు బలగాలు ఓఎ్‌సడీ దేవప్రసాద్‌, ముగ్గురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 20 మంది ఎస్‌ఐలు పాల్గొన్నారు. ముందుగా చెన్నకేశవనాయుడు మైనింగ్‌ యాజమాన్యం కొండలో 10.117 హెక్టార్లలో మైనింగ్‌ నిర్వహిస్తున్నట్లు, దానికి సంబంధించి చిన్నదుద్యాల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు సభలో అధికారులు చదివి వినిపించారు. ఆ తర్వాత ప్రజల అభిప్రాయాలను కోరారు.

అందులో చిన్నదుద్యాల, పెద్దదుద్యాల గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామాలకు అతిసమీపంలో మైనింగ్‌ ఉండడంతో కొండలో బ్లాస్టింగ్‌ చేస్తున్నందున ఇళ్లు నెర్రెలు బారుతున్నాయని తెలిపారు. కొండప్రాంతంలోని పేదలకు సంబంధించిన డీకేటీ భూములను భయపెట్టి కొన్నారని, యాజమాన్యం దాదాపు 800 ఎకరాలు భూమి కొని కంచె వేసుకోవడంతో కొండకు జీవాలను, గేదెలను తోలుకొని పోయేందుకు వీలు లేకుండా పోయిందన్నారు. బ్లాస్టింగ్‌, కంకరమిషన్‌ వల్ల వచ్చే దుమ్ము కుంటనీటిలో పడుతోందని, ఆ నీటిని తాగిన జీవాలు అనారోగ్యానికి గురవుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు గ్రామంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదన్నారు. కొంతమంది తమ డీకేటీ భూములు తమకు ఇప్పించాలని సభలో కోరారు. కొందరు పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు తమ అభిప్రాయాలను సభలో వినిపించారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను భయపెట్టి కొనడం ఎంతవరకు సమంజసమని, ఎవరి భూములు వారికి ఇప్పించేలా న్యాయం చేయాలని, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని మైనింగ్‌ పనులు జరుగకుండా చూడాలని జేసీకి తెలిపారు. అనంతరం మైనింగ్‌ యజమాని చెన్నకేశవనాయుడు మాట్లాడుతూ చిన్నదుద్యాలలో ఆర్‌వో ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామన్నారు. జేసీ గౌతమి మాట్లాడుతూ అందరి అభిప్రాయాలతో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మునిరాజారెడ్డి, మాజీఎంపీటీసీ సభ్యుడు వరదారెడ్డి, శశిధర్‌రెడ్డి, గురు ట్రాన్స్‌పోర్టు అధినేత గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-07T06:31:31+05:30 IST