మూడేళ్లుగా ఎదురుచూపులు..!

ABN , First Publish Date - 2020-11-22T05:11:58+05:30 IST

కొత్తగా ఇవ్వాల్సిన వ్యవసాయ విద్యుత కనెక్షన్లకు ట్రాన్సఫార్మర్ల కొరత అడ్డంకిగా మారింది. సాగు విస్తీర్ణం పెంచుకోవాలన్న రైతన్నల ఆశలకు గండి కొడుతోంది.

మూడేళ్లుగా ఎదురుచూపులు..!

 పెండింగులో పది వేల వ్యవసాయ విద్యుత కనెక్షన్లు

పీడిస్తున్న ట్రాన్సఫార్మర్ల కొరత

డిసెంబరు నాటికి లక్ష్యం అనుమానమే

కడప (సిటి), నవంబరు 19: కొత్తగా ఇవ్వాల్సిన వ్యవసాయ విద్యుత కనెక్షన్లకు ట్రాన్సఫార్మర్ల కొరత అడ్డంకిగా మారింది. సాగు విస్తీర్ణం పెంచుకోవాలన్న రైతన్నల ఆశలకు గండి కొడుతోంది. మూడేళ్ల క్రితం దరఖాస్తులకు కూడా మోక్షం కలగడం లేదు. ఇప్పటి వరకు జిల్లాలో 9,880 విద్యుత కనెక్షన్లు పెండింగులో ఉన్నాయి. మొత్తం కనెక్షన్లు విడుదల చేయాలంటే కనీసం 5,500 ట్రాన్సఫార్మర్లు అవసరం ఉండగా ప్రస్తుతం పదుల సంఖ్యలో అందుబాటులో ఉండడం కొసమెరుపు. ఈ రీతిన డిసెంబరు చివరికి పూర్తి స్థాయి కనెక్షన్లు ప్రశ్నార్థకమే.

జిల్లాలో కడప సర్కిల్‌ గణాంకాల మేరకు లక్షా 67వేల పైచిలుకు వ్యవసాయ విద్యుత కనెక్షన్లున్నాయి. ఇటీవల ప్రభుత్వం మోటర్లకు మీటర్లు ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా యాజమాన్యం విడుదల చేసిన గణాంకాలను బట్టి లక్షా 60వేల పైచిలుకుగా ఉన్నట్లు చూపించారు. వీటికి తోడు సాగు విస్తీర్ణం పెంచుకునేందుకు రైతన్నలు మరికొన్ని కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. విద్యుత కనెక్షన్లకు ట్రాన్సఫార్మర్లు చాలా ముఖ్యం. అలాంటి ట్రాన్సఫార్మర్లు అందుబాటులో లేకపోవడంతో కనెక్షన్ల విడుదలలో అతి జాప్యం జరుగుతోంది. మూడు సంవత్సరాలుగా ఇదే తంతు కొనసాగడం గమనార్హం.

అధిక వ్యయం కారణంగా..

సాధారణంగా వ్యవసాయానికి 5హెచపీ, 7.5 హెచపీ, 10 హెచపీ మోటర్లు వినియోగిస్తుంటారు. వీటి కోసం 25 కేబీ ట్రాన్సఫార్మర్లను ఏర్పాటు చేస్తారు. ఒక్కో ట్రాన్సఫార్మరు కింద 2 కంటే అధికంగా కనెక్షన్లు ఇచ్చే అవకాశాలు ఉండవు. విద్యుత కనెక్షను కావాలంటే ఒక్కో హార్స్‌ పవర్‌కు రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ట్రాన్సఫార్మరు, స్తంభాలు, విద్యుత తీగలు, ఇతరత్రా కలిపి రూ.1.30 లక్షలు ఖర్చవుతుంది. ఇంత వ్యయం చేసేందుకు సంస్థ ఆర్థికంగా సిద్ధంగా లేనట్లు సమాచారం. అందుకే ట్రాన్సఫార్మర్ల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో ఇప్పటివరకు డబ్బు చెల్లించినా 9,880 విద్యుత కనెక్షన్ల విడుదల పెండింగులో ఉన్నాయని సమాచారం. 2017-18లో 400, 2018-19లో 300 పెండింగులో ఉంటే ఆ సంఖ్య 2019-20లో ఇప్పటికి 9,880కి చేరింది.

లక్ష్యం అనుమానమే

పలుమార్లు యాజమాన్యం లక్ష్యాన్ని నిర్దేశించినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. చివరిగా ఈ సంవత్సరం డిసెంబరు చివరికి అన్ని కనెక్షన్లు విడుదల చేస్తామని అధికారులు చెప్పుకొస్తూ వచ్చారు. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే.. అధికారుల హామీ నెరవేరే పరిస్థితి కనబడ్డంలేదు. వేలల్లో ట్రాన్సఫార్మర్లు కావాల్సి ఉంటే పదుల్లో వస్తుంటే ఏ రీతిగా పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి. ఇదిలా ఉంటే వ్యవసాయానికి పగటి పూట తొమ్మిదిగంటల కరెంటు ఇవ్వాలంటే ఉన్న ట్రాన్సఫార్మర్ల సామర్థ్యం పెంచాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రక్రియ కూడా నత్తనడకన సాగుతోంది. ఇప్పటికీ 70 శాతం మాత్రమే ఇవ్వగలుగుతున్నారు.


గడువులోగా లక్ష్యాన్ని సాధిస్తాం

- ఎన.శ్రీనివాసులు, ఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ

ట్రాన్సఫార్మర్లను అందుబాటులోకి తెచ్చేందుకు యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోంది. అందుబాటులోకి వచ్చిన ట్రాన్సఫార్మర్లను సీనియారిటీ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నాం. డిసెంబరు చివరి వరకు గడువు ఉంది. యాజమాన్యం ఉన్నత స్థాయి అధికారుల చొరవతో గడువులోగా లక్ష్యం సాధిస్తాం. పగటిపూట తొమ్మిదిగంటల కరంటు సరఫరాకు అవసరమయ్యే పనులు వేగవంతం చేస్తున్నాం. అతి త్వరలో వంద శాతం పూర్తిచేస్తాం.


Updated Date - 2020-11-22T05:11:58+05:30 IST