కొవిడ్‌పై విస్తృత ప్రచారం చేయాలి

ABN , First Publish Date - 2020-12-02T04:39:52+05:30 IST

కొవిడ్‌ -19 నియంత్రణలో భాగంగా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ వైద్య, ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు.

కొవిడ్‌పై విస్తృత ప్రచారం చేయాలి
పోస్టర్‌ను విడుదల చేస్తున్న కలెక్టర్‌ హరికిరణ్‌

పోస్టర్‌ ఆవిష్కరణలో కలెక్టర్‌ హరికిరణ్‌


కడప (కలెక్టరేట్‌), డిసెంబరు 1 : జిల్లాలో జనవరి 19వ తేదీ వరకు 50 రోజుల పాటు కొవిడ్‌ -19 నియంత్రణలో భాగంగా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌  వైద్య, ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో వైద్య, ఆరోగ్య శాఖాధికారులు ముద్రించిన మాస్క్‌ సరిగ్గా పెట్టుకో.. కరోనా ఆటకట్టు పోస్టర్లను మంగళవారం కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస్కు, భౌతికదూరం, వ్యక్తిగత పరిశుభ్రత ఈ మూడు పాటించడం వల్ల కరోనాను నివారించవచ్చన్నారు. మాస్కును కవచంలా ఉపయోగించుకోవాలని ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని నిర్లక్ష్యం వహించరాదన్నారు. మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలని అప్పుడే కరోనాను నివారించవచ్చని ప్రతిఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో పండుగలు, ఉత్సవాల సందర్భంగా కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని అలాంటి పరిస్థితి మనకు రాకుండా నేటి నుంచి 50 రోజులపాటు ఒక కార్యాచరణ ప్రణాళికతో వివిధ ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌  సాయికాంత్‌వర్మ, డీఎంహెచ్‌వో డాక్టర్‌ అనిల్‌కుమార్‌, ఐసీడీఎస్‌ పీడీ పద్మజ, లీడ్‌ బ్యాంకు మేనేజరు చంద్రశేఖర్‌, నాబార్డు ఏజీఎం శ్రీనివాసులు, సమాచార శాఖ ఏడీ పి.వేణుగోపాల్‌రెడ్డి, డీపీఎం లక్ష్మీకర్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T04:39:52+05:30 IST