బొప్పాయి ‘పాల’ తోటలు
ABN , First Publish Date - 2020-10-14T19:32:05+05:30 IST
బొప్పాయి కాయలకి పాలు కారతాయని తెలుసు. కానీ పండ్ల కోసమే కాకుండా పాల కోసం..

పరిశ్రమలకు బొప్పాయి పాలు ఎగుమతి
మందులు, సౌందర్య క్రీముల్లో వాడకం
రైల్వేకోడూరు నుంచి భారీగా బొప్పాయి పాల క్యాన్లు తరలింపు
రైల్వేకోడూరు: బొప్పాయి కాయలకి పాలు కారతాయని తెలుసు. కానీ పండ్ల కోసమే కాకుండా పాల కోసం కూడా బొప్పాయి తోటలు పెంచుతారని, ఆ పాలను ఔషధాలు, సౌందర్య క్రీములు ఇలా 14 రకాల తయారీలో వాడుతున్నారు. దీంతో రైల్వేకోడూరు నుంచి పెద్ద ఎత్తున బొప్పాయి పాల ఎగుమతి జరుగుతోంది.
రైల్వేకోడూరుతో పాటు ఓబులవారిపల్లె, చిట్వేలి, పెనగలూరు, పుల్లంపేట మండలాల నుంచి బొప్పాయి సాగు విస్తీర్ణం పెరిగి పది వేల హెక్టార్లు దాటింది. రోజూ 50 నుంచి 100 లారీల్లో బొప్పాయి కాయలు సీజన్‌లో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఢిల్లీ ప్రాంతాలకు చెందిన ప్రముఖ వ్యాపారులు రైల్వేకోడూరులోనే మకాం వేసి కొనుగోలు చేస్తుంటారు. అయితే బొప్పాయి పండ్లతో పాటు బొప్పాయి పాలు కూడా అమ్ముతున్నారు రైల్వేకోడూరు రైతులు.
బొప్పాయి పాలకు భలే గిరాకీ
బొప్పాయి చెట్టు నాటిన 4 నెలలకు పూత కొస్తుంది. 8 నెలలకు కాయలు కోతకొస్తాయి. కాయలు మరో ఇరవై రోజుల్లో కోతకు వస్తాయనగా వాటి నుంచి పాలను తీస్తారు. కాయ పై కాస్త లోతుగా గీతలు గీసి చెట్టు కింద చుట్టూ ప్లాస్టిక్ మ్యాట్ వేస్తారు. అందులో పాలు పడతాయి. కాయల నుంచి కారిన పాలు కాసేపటికి గడ్డ కడతాయి. గడ్డకట్టిన పాలను డబ్బాల్లో నింపుతారు. వాటిని ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలో ఉన్న పరిశ్రమలకు ఇక్కడి రైతులు తరలిస్తున్నారు. ఆ పాల నుంచి పెక్టిన్ అనే పదార్థాన్ని తయారు చేస్తారు. దానిని అల్లోపతి మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. అదే విధంగా 14 రకాల మందులు, సౌందర్య క్రీములు, సోప్‌లలో ఉపయోగిస్తున్నారని వ్యాపారులు అంటున్నారు.
మొదట పెన్సిలిన్ అనే ఇంజక్షన్‌కు ఉపయోగించేవారని అయితే ఆ ఇంజక్షన్‌ను బ్యాన్ చేయడంతో వాడడం లేదని తెలుస్తోంది. మిగిలిన వాటిల్లో ఉపయోగిస్తున్నారు. అందువల్ల పాలకు డిమాండు ఎక్కువగా పెరిగింది. పాలు తీసిన కాయల్ని రైతులు ఊరికే వదిలెయ్యరు. వాటిని ముక్కలుగా కోసి ఉప్పులో రెండు వారాల పాటు ఊరబెడతారు. అక్కడున్న టూటీ ఫ్రూటీ పరిశ్రమల్లో ఈ ముక్కలను చెక్కర పాకంలో నానబెడతారు. ఈ తర్వాత వాటిని చిన్న, చిన్న ముక్కలుగా కోసి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులు వేసి బ్రెడ్ తయారీలోను రకరకాల స్వీట్లలో కూడా ఉపయోగిస్తున్నారు. పాలు తీయకుండా అమ్మే బొప్పాయి పండ్ల ధర టన్ను రూ.5 వేలు పలుకుతుంది. బాగా కాస్తే ఎకరాకు 70 టన్నుల నుంచి 100 టన్నుల దిగుబడి వస్తుంది. ఒక్కో చెట్టుకు 100 నుంచి 200 కాయలు కాస్తాయి. సాగు చేయడానికి ఎకరాకు రూ.30 వేలు ఖర్చు అవుతుంది.
ఇక్కడి రైతులు బొప్పాయి తోటలతో లాభాలు ఆర్జించడం చూసి గుంటూరు, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు తదితర ప్రాంతాల రైతులు కూడా బొప్పాయి సాగు చేస్తున్నారని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. రైల్వేకోడూరుకు వచ్చి మొక్కల్ని కొనుక్కెళ్తున్నారు. అందుకే రైల్వేకోడూరులో ఈ ఏడాది కోట్లాది మొక్కల్ని ఉత్పత్తి చేశారు. ఒక్కో బొప్పాయి మొక్కను సుమారు రూ.10కి విక్రయాలు చేశారు. సుమారు రూ.25 కోట్ల విలువ చేసే మొక్కల్ని విక్రయించారు.
బొప్పాయి పాల ధర ఇలా...
బొప్పాయి పాలు కిలో రూ.120 నుంచి 130 ప్రస్తుతం ధరలు పలుకుతున్నాయి. పాలలో సాంధ్రత ఎక్కువగా ఉంటేనే ధరలు బాగా ఉంటాయి. ఇక్కడి నుంచి పంపిన పాలను పరిశ్రమల్లో పిండి చేసి అమెరికాకు ఎక్కువగా పంపుతున్నారని ఇక్కడి రైతులు చెబుతున్నారు. అందు వల్ల పాలకు డిమాండు పెరిగింది. రైల్వేకోడూరులో సుమా రు 7 మంది బొప్పాయి పాల వ్యాపారులు ఉన్నారు. రైతు లు నేరుగా పాల డ్రమ్ములు తరలిస్తారు. రైల్వేకోడూరు నుంచి ముడిసరుకు మాత్రమే పరిశ్రమలకు పంపుతారు. పాలల్లో సాంధ్రత తక్కువగా వస్తే ధరలు తక్కువగా ఉంటాయి.