భారీ వర్షాల ఎఫెక్ట్: వరి గడ్డికి గడ్డు కాలమే..!

ABN , First Publish Date - 2020-12-16T05:07:53+05:30 IST

భారీ వర్షాల కారణంగా అన్ని చోట్ల పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోవడంతోపాటు పాడి రైతులకు కూడా కష్టాలు తప్పడంలేదు.

భారీ వర్షాల ఎఫెక్ట్: వరి గడ్డికి గడ్డు కాలమే..!
ట్రాక్టర్‌లో తీసుకెళుతున్న వరిచెత్త

భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలు 

పశువులకు గ్రాసం కొరత

పట్టించుకోని పాలకులు ఆందోళనలో అన్నదాతలు


ప్రొద్దుటూరు రూరల్‌, డిసెంబరు 15: భారీ వర్షాల కారణంగా అన్ని చోట్ల పంటలు పూర్తిగా దెబ్బతిని  రైతులు తీవ్రంగా నష్టపోవడంతోపాటు పాడి రైతులకు కూడా కష్టాలు తప్పడంలేదు. ప్రతి ఏడాది పంటలు బాగుండడంతోపాటు పశుగ్రాసం మెండుగా ఉండేది. ప్రస్తుతం పంటలు దెబ్బతిని పశుగ్రాసం పొలాల నుంచి బయటికి రవాణా కాలేకపోవడంతో  వరి పంట  నూర్పిళ్ల సమయంలో కూ డా పొలాల్లో వర్షంనీరు ఉండటం వలన ధాన్యం మాత్రమే రైతు చేతికందింది. మిగతా వరిచెత్త పొలాల నుంచి బయటకు తెచ్చుకునేందుకు వీలులేకుండాపోయింది. దీంతో ఈ ఏడాది వరిగడ్డి కొరత భారీగా ఏర్పడే అవకాశం ఉందని పాడి రైతులు పేర్కొంటున్నారు. 


ఒక ట్రాక్టర్‌ ఎండుగడ్డి ధర రూ.10 వేలు

ప్రతి సంవత్సరం ఒక ట్రాక్టరు వరి గడ్డి ధర కేవలం రూ.4 వేల నుంచి రూ.5 వేలు మాత్రమే ఉండేది. అయితే ఈసారి తుఫాన్ల కారణంగా వరి గడ్డి చేతికందక భారీగా ధరలు పెరిగిపోయాయి. ఒక ట్రాక్టరు వరి గడ్డి ధర ప్రస్తుతం రూ.10 వేలు నడుస్తోందని పాడి రైతులు పేర్కొంటున్నారు. మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో మొత్తం 3,830 ఎకరాల్లో వరి పంటను సాగు చేయకగా అందులో 2,750 ఎకరాలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఎకరాల్లో పశుగ్రాసం కొద్దిగా కూడా రైతు చేతికందలేదు. ముందే పశుపోషణ పాడి రైతుకు భారం కాగా మళ్లీ పశుగ్రాసం కొరతతో పశుపోషణ మరింత భారం కానుంది. వర్షాధార పంటల సాగు ప్రాంతాల నుంచి వేరుశనగ పశుగ్రాసంతోపాటు శనగ పొట్టు, మినుము పొట్టు, పెసరపొట్టు పాడి రైతులకు అందుతుండేది. అయితే ఆ పంటలు కూడా ఈ ఏడాది దెబ్బతినడంతో ఆ రకం పశుగ్రాసం కూడా పాడి రైతుకు కరువైంది. 


సబ్సిడీ గడ్డి విత్తనాలు అందించరూ....

గత ప్రభుత్వాలు ప్రతి ఏడాది పాడి రైతు కోసం సబ్సిడీ కింద గడ్డి విత్తనాలను అందజేస్తుండేది. అతివృష్టి, అనావృష్టి ప్రభావం కలిగిన కాలంలో కొన్ని సందర్భాల్లో పాడి రైతుకు ప్రభుత్వాలు ఉచితంగా కూడా గడ్డి విత్తనాలు మంజూరు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాడి రైతును నిర్లక్ష్యం చేస్తోందని పశుగ్రాస కొరత తీర్చే ప్రక్రియలో ప్రణాళికలు చేపట్టలేదని పాడి రైతులు వాపోతున్నారు. కనీసం సబ్సిడీ కింద గడ్డి విత్తనాలు కూడా ఇవ్వలేదని పలువురు వాపోతున్నారు. ఈ ఏడాది పశుగ్రాస కొరత తీర్చే విధంగా ప్రభుత్వం, అధికారులు పాడి రైతులకు సబ్సిడీ గడ్డి విత్తనాలతోపాటు సబ్సిడీ కింద ఎండుగడ్డిని సరఫరా చేయాలని పలువురు పాడి రైతులు కోరుతున్నారు. Updated Date - 2020-12-16T05:07:53+05:30 IST