కేటుగాళ్లు.. ఆన్‌లైన్ యాప్‌లతో బురిడీ

ABN , First Publish Date - 2020-12-28T05:51:58+05:30 IST

కడపలో గత ఐదు రోజులుగా ఎక్కడపట్టినా ఆ యాప్‌పైనే చర్చ సాగుతోంది. కంపెనీ నిలువునా మోసం చేసిందంటూ లబోదిబోమంటున్నారు. మోసపోయేవారు ఉన్నంత వరకూ మోసం చేసేవారు ఉంటూనే ఉంటారు.

కేటుగాళ్లు.. ఆన్‌లైన్ యాప్‌లతో బురిడీ

రూ.5 వేలు కడితే రోజుకు ఐదొందలొస్తుందంటూ జనానికి గాలం

ఉచ్చులో పడ్డ జనం.. అత్యాశకు పోయి యాప్‌లో డబ్బులు కట్టిన వైనం

ఆందోళనలో బాధితులు.. కడప జిల్లాలో రూ.10 కోట్లకు పైగా యాప్‌లో చెల్లింపులు


(కడప - ఆంధ్రజ్యోతి): - అతడి పేరు నాగేంద్ర (పేరు మార్చాం). కడప పాతబస్టాండు ప్రాంతంలో జ్యూస్‌ కార్నర్‌ పెట్టుకున్నాడు. పగలంతా కష్టపడితే ఖర్చులో పోనూ రోజుకు రూ.300 మిగిలేది. ఆ సొమ్ముతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. జ్యూస్‌ తాగేందుకు వచ్చే వారితో పరిచయం ఏర్పడింది. ఎంత మిగులుతుందని వారు అడిగారు. ఖర్చులు పోను రూ.300 మిగులుతుందని నాగేంద్ర వారితో చెప్పాడు. రోజంతా కష్టపడితే అంతేనా వచ్చేది నీకు.. ఓ యాప్‌ ఉంది. అందులో రూ.5 వేలు డిపాజిట్‌ చేస్తే నీకు రోజూ రూ.400 నుంచి రూ.500 డబ్బులు వస్తాయి. నేనూ కట్టాను అంటూ ఓ యువకుడు తెలిపాడు. పొద్దున్న నుంచి కష్టపడితే రూ.300 మిగలడం లేదు. 5 వేలు కడితే రోజూ రూ.500 వరకు వస్తుందంటే ఇదేదో బాగుందనుకుంటూ ఠక్కున తన మొబైల్‌లో ఆ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని సభ్యత్వం రూ.500తో పాటు యాప్‌లో రూ.5 వేలు డిపాజిట్‌ చేసేశాడు. కంపెనీ సూచించిన మేరకు ఒక్కో ప్రొడక్ట్‌పై 30 సార్లు టిక్‌ చేస్తూ వచ్చాడు. యాప్‌లో మాత్రం నాగేంద్ర పేరుతో డబ్బు జమ అయినట్లు చూపిస్తుంది. అది చూసి సంబరపడ్డాడు. నాలుగు రోజులు ఆగి డబ్బులు విత్ డ్రా చేసుకున్నామనుకున్నాడు. అంతే.. ఆ యాప్‌ విత్ డ్రా నిలిపివేసింది.


ఇలాగే..

- మరొకతడి పేరు సుధీర్‌ (పేరు మార్చాం). జిల్లా సరిహద్దు గ్రామం నుంచి వచ్చి కడపలో ఉంటూ ఓ మొబైల్‌ షాపులో పనిచేస్తున్నాడు. ఓ యాప్‌లో డబ్బులు కడితే రోజూ డబ్బులు వేస్తుందన్న విషయం తెలిసింది. తోటి సేల్స్‌ ప్రమోటర్స్‌ కూడా ఆ యాప్‌లో డబ్బులు కట్టారు. వారికి డబ్బులు వస్తోంది. యాప్‌లో డబ్బులు కడితే జీతంతో పాటు అదనంగా వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకోవచ్చని ఆశించాడు. అంతే.. అప్పు తెచ్చి మరీ డిపాజిట్‌ చేశాడు. తన యాప్‌ ఖాతాలో కనిపించిన డబ్బులు డ్రా చేసుకుందామనుకొనేటప్పటికే యాప్‌ విత్ డ్రా నిలిపివేసింది.


- ఇతనో వ్యాపారి. మార్కెట్‌ ట్రెండ్‌పై మంచి పట్టు ఉంది. ఇప్పుడంతా ఓ యాప్‌ ద్వారా డైలీ డబ్బు వస్తుందని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు. అతనూ ఓ యాభై వేలు డిపాజిట్‌ చేశాడు. అతనే కాకుండా అతడి స్నేహితుల ద్వారా అందరూ కలిసి దాదాపు రూ.5 లక్షల వరకు డిపాజిట్‌ చేశారు. డబ్బు వితడ్రా చేసుకుందామనే లోపు కంపెనీ విత్ డ్రా నిలిపేసింది. దీంతో ఇప్పుడు లబోదిబోమంటున్నారు. 


ఇది పై ముగ్గురికే పరిమితం కాలేదు. కడపలో గత ఐదు రోజులుగా ఎక్కడపట్టినా ఆ యాప్‌పైనే చర్చ సాగుతోంది. కంపెనీ నిలువునా మోసం చేసిందంటూ లబోదిబోమంటున్నారు. మోసపోయేవారు ఉన్నంత వరకూ మోసం చేసేవారు ఉంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మానవుడి జీవితంలో భాగమయ్యాక ఆనలైన మోసాలు ఎక్కువవుతున్నాయి. కొందరిలో ఉన్న అత్యాశను కేటుగాళ్లు బాగా క్యాష్‌ చేసుకుంటున్నారు. ఇప్పుడంతా ఆన్‌లైన్ లో మోసాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. కొందరు ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా అత్యధిక వడ్డీలకు రుణాలిచ్చి జనాన్ని మోసం చేస్తున్న విషయం ఇటీవల బట్టబయలైంది. అయితే లేటెస్ట్‌గా రూ.5 వేలు డిపాజిట్‌ చేసి రోజుకు రూ.400 నుంచి రూ.500 వస్తుందంటూ ఓ ఆన్‌లైన్ యాప్‌ వేసిన వలకు కొందరు జనం బాగా కనెక్ట్‌ అయ్యారు. రోజూ డబ్బులు వస్తుండడంతో ఇబ్బడి ముబ్బడిగా శక్తికి మించి డిపాజిట్‌ చేశారు.


ఇప్పుడు ఆ యాప్‌ విత్ డ్రాలను నిలిపివేయడంతో లబోదిబోమనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ ఆన్‌లైన్ యాప్‌లో కనీసం రూ.5 వేలు డిపాజిట్‌ చేస్తే రోజుకు రూ.500 వరకు, రూ.30 వేలు డిపాజిట్‌ చేస్తే రోజుకు రూ.2500 నుంచి రూ.3 వేలు, రూ.50 వేలు డిపాజిట్‌ చేస్తే రూ.4500 నుంచి 5 వేలు వస్తుందంటూ ప్రచారం చేసింది. ఇందుకు గాను రూ.5 వేలు చెల్లించే వారు సభ్యత్వ రుసుం రూ.500, 30 వేలు, 50 వేలు డిపాజిట్‌ చేసే వారు రూ.వెయ్యి సభ్యత్వ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే.. ఆ యాప్‌లో డిస్‌ప్లే అయ్యే ప్రొడక్ట్‌పై 30 సార్లు క్లిక్‌ చేయాలి. పలు రకాల ఉత్పత్తులు డిస్‌ప్లే అవుతుంటాయి. వాటిని రోజుకు 30 సార్లు క్లిక్‌ చేస్తుంటే మనం కట్టిన డిపాజిట్‌ మేరకు డబ్బు ఖాతాలో జమ అవుతుంటుంది. ఆ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసేటప్పుడే మనం చెల్లించిన డిపాజిట్‌ జమ అవుతుంది. అలా రోజుకు ఎంత డబ్బు వచ్చేది ఐడీ నెంబరుతో సహా బోనస్‌ పాయింట్లను చూపించడంతో పాటు డబ్బు చూపిస్తుంటుంది. పాయింట్లను బట్టి లెవల్‌-1, లెవల్‌-2, లెవెల్‌-3గా చూపిస్తారు. రోజువారి వచ్చే జమ అయ్యే డబ్బులను మన బ్యాంకు ఖాతాకు వితడ్రా చేసుకునే సౌకర్యం కల్పించారు. అయితే తొలినాళ్లలో చాలా మంది డిపాజిట్‌ (రీఛార్జ్‌) చేసుకున్న వారికి డబ్బులు జమ అయ్యేది.


అలా వారికి వచ్చిన సొమ్మును వితడ్రా చేసుకునేవారు. ఇది ఆ నోటా ఈనోటా పాకింది. ఎంతోకొంత డిపాజిట్‌ చేసి కష్టపడకుండానే రోజూ డబ్బులు వస్తుండడంతో ఇదేదో బాగుందంటూ చాలామంది ఆ యాప్‌ ఉచ్చులో పడ్డారు. ముఖ్యంగా కడప సిటీలో స్మార్ట్‌ఫోనుపై అవగాహన ఉన్న వారిలో చాలా మంది ఈ యాప్‌ ఉచ్చులో పడిపోయారు. అంతేకాక యాప్‌లో సభ్యత్వం తీసుకున్నవారు యాప్‌ను మరో వ్యక్తితో ఇనస్టాల్‌ చేస్తే అదనంగా రూ.120 జమ అవుతుంది. అతను ఇంకొక వ్యక్తితో ఇన్‌స్టాల్‌ చేస్తే మొదటి వ్యక్తికి ఇంకొ కొంత డబ్బు జమ అవుతుంది. దీంతో సభ్యత్వం తీసుకున్న చాలామంది తెలిసిన వారిని చేర్పించారు. ఇలా చాలా మంది ఈ ఉచ్చులో పడ్డారు. కడపలో కొన్ని మొబైల్‌ షాపుల్లో పనిచేసే 60 శాతం మందికి పైగా ఈ ఉచ్చులో ఇరుక్కునట్లు తెలుస్తోంది. మరికొందరు వ్యాపారస్తులు కూడా చిక్కుకుపోయారు. ఒక్క కడప సిటీలోనే రూ.8 కోట్ల వరకు ఈ యాప్‌లో చెల్లింపులు చేసినట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా చూస్తే రూ.15 కోట్లకు పైగా ఉండొచ్చని ప్రచారం ఉంది. విద్యార్థులు, నిరుద్యోగులతో పాటు వ్యాపారస్తులు ఈ ఉచ్చులో చిక్కుకుపోవడంతో చైన్ లింకులా జిల్లా వ్యాప్తంగా వ్యాపించినట్లు తెలుస్తోంది.


లబోదిబోమంటున్న బాధితులు

గత తొమ్మిది రోజులుగా ఆన్‌లైన్ యాప్‌ వితడ్రాను నిలిపివేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. అప్పు చేసి డిపాజిట్లు చేశామని, ఒక్క రూపాయి తీసుకోకుండానే విత్ డ్రా నిలిపివేయడంతో బాధితుల బాధలు వర్ణణాతీతంగా మారాయి. నేను కట్టిన డబ్బులు పోతే పోనీండి.. నేను తెలిసిన వాళ్లకు యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయించాను. వాళ్లు అప్పు చేసి మరీ డిపాజిట్‌ చేశారు. ఇప్పుడు వారికి ఏమని సమాధానం చెప్పాలంటూ ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆన్‌లైన్ యాప్‌ల మోసాలకు చిక్కద్దొంటూ సైబర్‌ నిపుణులు, పోలీసులు చెబుతున్నప్పటికీ అత్యాశకు పోతే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని చెబుతున్నారు. మొత్తానికైతే ఈ ఆన్‌లైన్ యాప్‌ వ్యవహారం కడపలో చర్చనీయాంశంగా మారింది. డబ్బులు పోగొట్టుకున్న వాళ్లు బయటికి చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతున్నారు. 


ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తాం: - ఎస్పీ అన్బురాజన

ఆన్‌లైన్ యాప్‌ ద్వారా మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. 

Updated Date - 2020-12-28T05:51:58+05:30 IST