ఇల్లు కల..!

ABN , First Publish Date - 2020-07-14T11:48:23+05:30 IST

Concerned beneficiaries

ఇల్లు కల..!

గత ప్రభుత్వం మంజూరు చేసిన.. 21,713 పేదల ఇళ్లు రద్దు

మరో పక్క రూ.90 కోట్ల బిల్లులు బకాయి

అప్పుల్లో నిరుపేదలు

ఆందోళన చెందుతున్న లబ్ధిదారులు


గ్రామీణ పేదలకు గత ప్రభుత్వం ‘ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం’ కింద పక్కా గృహాలను మంజూరు చేసింది. ఆర్థిక స్థోమత లేకనో.. అప్పులు పుట్టకనో సకాలంలో నిర్మాణాలు చేపట్టలేదు. కొందరు పునాదులు తవ్వారు. ఇంతలో ప్రభుత్వం మారింది. ఏడాది కాలంగా వాటిని పట్టించుకోకపోగా మంజూరు చేసిన ఇళ్ల రద్దుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జిల్లాలో పట్టణ పేదలకు మంజూరు చేసిన 7,904 టిడ్కో ఇళ్లు రద్దు చేస్తే.. తాజాగా గ్రామీణ పేదలకు చెందిన 21,713 పక్కాగృహాలు రద్దు చేసినట్లు సమాచారం. అంతేకాదు.. ఇళ్లు కట్టుకున్నా వారికి చెల్లించాల్సిన రూ.90 కోట్ల బిల్లులు ఏడాదిన్నరగా అందక.. అప్పులపై వడ్డీలు పెరిగి లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. 


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో గత టీడీపీ ప్రభుత్వం గ్రామీణ పేదలకు సొంతింటి కల స్వప్నం సాకారం లక్ష్యంగా ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద 2016-17 నుంచి పక్కా గృహాల మంజూరుకు శ్రీకారం చుట్టింది. 2019 ఏప్రిల్‌ వరకు 69,728 ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి యూనిట్‌ విలువ రూ.1.50 లక్షలు కాగా.. అందులో రూ.92 వేలు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇచ్చేది. ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల్లో కొందరు నిర్మాణాలు పూర్తి చేసి గృహ ప్రవేశాలు కూడా చేశారు. 


21,713 ఇళ్లు రద్దు

గ్రామీణ పేదలకు పక్కా గృహం మంజూరు చేస్తూ గత ప్రభుత్వం మంజూరు పత్రాలు కూడా ఇచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేరిందని ఆనందించారు. పునాదులు తవ్వి.. బేస్‌మట్టం వరకు నిర్మిస్తే తప్ప గృహ నిర్మాణ శాఖ తొలి బిల్లు ఇవ్వదు. ఆర్థిక స్థోమత లేక.. అప్పులు పుట్టక అబ్ధిదారులు కొందరు పునాదులు తవ్వుకోలేని పరిస్థితి. మట్టి పనులు చేసినా రాళ్లు, ఇసుక, సిమెంట్‌ కొనలేక బేస్‌మట్టం కూడా కట్టుకోలేదు. అలాంటి వారు జిల్లాలో 21,713 ఉన్నట్లు గృహ నిర్మాణ శాఖ గుర్తించింది. ఇంతలో ప్రభుత్వం మారింది.


గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను నిర్మించాలా..? వద్దా..? స్పష్టత ఇవ్వకపోవడంతో అధికారులు వాటి జోలికి వెళ్లలేదు. ఏడాది గడిచింది. జిల్లాలో 1.11 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వ లక్ష్యం. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొత్తవాళ్లకు ఇళ్లు ఇవ్వాలని గత ప్రభుత్వం మంజూరు చేసి నిర్మాణాలు మొదలు పెట్టని 21,713 ఇళ్లు రద్దు చేశారు. అయితే.. వీరిలో ఇళ్లు కట్టుకున్నా సాంకేతిక కారణాల వల్ల ఆన్‌లైన్లో బిల్లు నమోదు (జనరేట్‌) కాని పేదలు కూడా ఉన్నారు. అప్పు చేసి ఇల్లు కట్టుకుంటే బిల్లు ఇవ్వకుండానే రద్దు చేస్తారా..? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


బకాయి రూ.90 కోట్లు

ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. రూ.92 వేలు రాయితీ ఇస్తుంది. కాస్త అప్పు చేస్తే సొంతింటి కల సాకారం అవుతుందనే ఆశతో నూటికి రూ.2-3 వడ్డీలకు అప్పులు చేసి ఇల్లు నిర్మించుకున్నారు. ఒకటి రెండు బిల్లులు వచ్చాయి. ఇంతలో ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం బిల్లులు ఇస్తుందని ఆశిస్తే.. ఏడాది దాటినా ఒక్క పైసా ఇవ్వలేదు. జిల్లాలో దాదాపుగా 4 వేల మందికిపైగా లబ్ధిదారులకు సుమారుగా రూ.90 కోట్లు బకాయి ఉంది. బిల్లు వస్తే అప్పులు తీరుతాయని లబ్ధిదారులు నిధుల కోసం నిరీక్షిస్తున్నారు. 


1,11,116 ఇళ్ల మంజూరుకు కసరత్తు

జిల్లాలో గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేసిన ప్రభుత్వం కొత్తగా 1,11,116 ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టంది. రెవిన్యూ అధికారులు లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. కాగా ఇళ్లు రద్దు చేసిన వారికి కొత్తగా నిర్మించే జాబితాలో స్థానం కల్పించాలని కోరుతున్నారు. 


ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తాం :  ఎన్‌.విజయకుమార్‌, పీడీ, ఏపీ గృహ నిర్మాణ శాఖ, కడప

ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ప్రభుత్వం మంజూరు చేసి నిర్మాణాలు మొదలు పెట్టని  21,728 మంది లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపాము. వాటిని డీలిటెడ్‌ జాబితాలో చేర్చే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తాం. ఇళ్లు రద్దు చేసినా కొత్తగా నిర్మించే 1,11,116 ఇళ్లలో వారికి అవకాశం కల్పిస్తారు. జిల్లాలో దాదాపుగా రూ.90 కోట్ల బిల్లులు బకాయి ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో బిల్లులు వస్తాయి. 


అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం: 

ఆమె పేరు తొర్రివేముల రమాదేవి. రాజుపాలెం మండలం టంగుటూరు ఎస్సీ కాలనీ. సొంతిల్లు లేదు. గత ప్రభుత్వం పక్కా ఇల్లు మంజూరు చేస్తే ఆనందించారు. సొంతింటి కల నేరవేందని ఆశించారు. రూ.5 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నారు. సగం బిల్లు మాత్రమే వచ్చింది. మిగిలిన బిల్లు కోసం ఏడాది కాలంగా గృహ నిర్మాణ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం మాత్రం నిధులు ఇవ్వలేదు. ఈమెకు బిల్లు రాలేదు. వడ్డీలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం మాపై దయ చూపి బకాయి బిల్లులు ఇవ్వాలని వేడుకుంటోంది. 


పైసా బిల్లు ఇవ్వలేదు :

ఆమె పేరు కుంటుమల్ల శివకుమారి. జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామం. చేనేత మగ్గమే జీవనాధారం. పోగు వడికితేనే పేగు నిండేది. పూరి గుడిసెలోనే మగ్గం వేసుకుని జీవనం సాగించారు. గత సర్కారు చేనేతలకు మగ్గం షెడ్డుతో సహా పక్కా ఇల్లు మంజూరు చేసింది. రూ.2.50 లక్షలు వస్తాయి. సొంతింటి కల నెరవేరుతుందనే ఆశతో ఉన్న గుడిసె పీకేసి రూ.5 లక్షల వరకు అప్పు చేసి ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం మారింది. ఒక్క పైసా బిల్లు రాలేదు. ఇంటి నిర్మాణం అసంపూర్తిగా ఆగింది. అప్పే మిగిలింది. మాకెవరు దిక్కంటూ కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి బిల్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-07-14T11:48:23+05:30 IST