దిగ్బంధం..!

ABN , First Publish Date - 2020-03-25T09:52:58+05:30 IST

కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధానికి మేము సైతం అంటూ ప్రజలు సహకారం అందిస్తున్నారు.

దిగ్బంధం..!

ఎక్కడి వాహనాలు అక్కడే

లాక్‌డౌన్‌కు ప్రజల సహకారం

కొందరిలో కనిపిస్తున్న నిర్లక్ష్యం

పోలీసుల విధులకు ఆటంకం 

పలు కాలనీల్లో సామాజిక దూరం పాటించని జనం


కడప, మార్చి 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధానికి మేము సైతం అంటూ ప్రజలు సహకారం అందిస్తున్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. బుధవారం నుంచి మరో మూడువారాల పాటు లాక్‌డౌన్‌కు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మంగళవారం ప్రజల సహకారం వల్ల ఆయా రోడ్లు జనాలు లేక నిర్మానుష్యంగా మారాయి. కొందరి బాధ్యతారాహిత్యం పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తోంది. కడప నగరంలో సెవెన్‌రోడ్స్‌, కోటిరెడ్డిసర్కిల్‌, ఆర్టీసీ బస్టాండు, ఐటీఐ సర్కిల్‌, సంధ్యా సర్కిల్‌ ప్రాంతాలు ఉదయం 10 గంటల నుంచి నిర్మానుష్యంగా కనిపించాయి. అయితే అత్యవసర పనుల కోసం కొందరు మోటారు బైక్‌లపై రాకపోకలు సాగించారు. పోలీసులు ఐడీ కార్డు చూసి అనుమతిస్తున్నారు. కడప నగరం ఒక్కటే కాదు.. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేలు, పులివెందుల, రాయచోటి, మైదుకూరు తదిర అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. రోడ్లపై సరే.. కాలనీల్లో... : పోలీసులు కఠిన చర్యల వల్ల ప్రజలు రోడ్లపైకి రావడం లేదు. అయితే.. ఆయా కాలనీల్లో సామాజిక దూరం పాటించడం లేదు. ఇళ్లల్లో ఉండాల్సిన వారు వీధుల్లోకి వచ్చి పక్కింటి వాళ్లతో సరదాగా గడుపుతున్నారు. 55-60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 15 ఏళ్లలోపు పిల్లలు బయటికి రావద్దని.. కరోనా వైరస్‌ ప్రభావం వారి మీదనే ఎక్కువ ప్రభావం చూపుతుందని వైద్యులు, జిల్లా యంత్రాంగం పదే పదే హెచ్చరిస్తున్నా ఈ హెచ్చరికలు మాకు కావు అనే ధోరణిలో కొందరు వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదనే విమర్శలు తలెత్తుతున్నాయి. అన్ని పట్టణాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కాగా.. వీధుల్లో కూడా మైకుల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పిస్తామని కలెక్టర్‌ హరికిరణ్‌ వివరించారు. 


లాఠీకి పని చెప్పిన పోలీసులు : ఉదయం 9 గంటల తరువాత లాక్‌డౌన్‌ పక్కా అమలుకు శ్రీకారం చుట్టారు. కొందరు నిర్లక్ష్యంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా వాగ్వాదానికి దిగారు. దీంతో సహనం కోల్పోయిన పోలీసులు ఐటీఐ సర్కిల్‌, దేవునికడప తదితర ప్రాంతాల్లో యువతను ఇళ్లకు పంపేందుకు లాఠీలకు పని చెప్పారు. చిన్న పిల్లలతో రోడ్లపైకి వస్తే హెచ్చరించి పంపుతున్నారు. మోటారు బైక్‌పై ఇద్దరు వస్తే ఒకరిని దింపి పంపిస్తున్నారు. కలెక్టర్‌ హరికిరణ్‌, జేసీ గౌతమి, డీఎస్పీ సూర్యనారాయణ, మున్సిపల్‌ కమిషనర్‌ లవన్న తదితర అధికారులు రైతు బజారు, నిత్యావసర సరుకుల మార్కెట్‌ ప్రాంతాలలో పర్యటించారు. నిత్యావసర సరుకుల వ్యాపారులతో సమావేశమై చర్చించారు. 


Read more