పుులివెందులకు ఎంత చేసినా తక్కువే..!

ABN , First Publish Date - 2020-12-25T05:42:11+05:30 IST

పులివెందుల నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువేనని, మీ రుణం తీర్చుకోలేనిదని, దేవుని దయ, మీ చల్లని ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా రుణం తీర్చుకునే అవకాశాన్ని మీరిచ్చారని సీఎం జగన్‌ పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం పులివెందుల పట్టణంలో ఏపీఎస్‌ఆర్టీసీ డిపోతో పాటు రూ.5010 కోట్లతో చేపట్టే 28 అభివృద్ధి పనులకు, సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

పుులివెందులకు ఎంత చేసినా తక్కువే..!
శిలాఫలకాల ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన

రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా

గత ఏడాది చేసిన పనులు పురోగతిలో ఉన్నాయి

ఇపుడు రూ.5010కోట్లతో అభివృద్ధి పనులు

గండికోటలో 26.85 టీఎంసీలు నింపడం గొప్పపని

నిర్వాసితులకు ఇబ్బంది కల్గించి ఉంటే క్షమించండి

పులివెందుల సభలో సీఎం జగన్‌

రూ.5010కోట్లతో చేపట్టే 28 పనులకు శంకుస్థాపన

ఇర్మా, ఆపాచీ సంస్థలతో ఒప్పందం, భూమిపూజ

కడప, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): పులివెందుల నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువేనని, మీ రుణం తీర్చుకోలేనిదని, దేవుని దయ, మీ చల్లని ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా రుణం తీర్చుకునే అవకాశాన్ని మీరిచ్చారని సీఎం జగన్‌ పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం పులివెందుల పట్టణంలో ఏపీఎస్‌ఆర్టీసీ డిపోతో పాటు రూ.5010 కోట్లతో చేపట్టే 28 అభివృద్ధి పనులకు, సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అందులో రూ.3,015 కోట్లతో గండికోట నుంచి సీబీఆర్‌, పైడిపాలెం ఎత్తిపోతల పధకాల సామర్థ్యం పెంపు, రూ.1256 కోట్లతో మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులు ఉన్నాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం జగన్‌ మాట్లాడారు.

2019 డిసెంబరు 25న ఇక్కడి నుంచే పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టానని, ఆ పనులన్నీ వివిధ దశల్లో ఉన్నాయని గుర్తుచేశారు. ఫిబ్రవరిలో వైఎస్‌ఆర్‌ స్మారక ప్రభుత్వ వైద్య కళాశాల సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి పనులు ప్రారంభిస్తామన్నారు. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు, రోడ్ల విస్తరణ, తాగునీటి పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. జేఎన్‌టీయూలో అంతర్గత మౌలిక వసతుల పనుల టెండర్లు పూర్తి చేశామని వేంపల్లె డిగ్రీ కళాశాల తాత్కాలిక భవనాల్లో నడుపుతున్నామని, మార్చిలోపే నూతన పనులు చేపడతామని అన్నారు. నల్లచెరువులో 132 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులు, వివిధ రోడ్ల విస్తరణ పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. వేంపల్లి మండలంలో 51 దేవాలయాల అభివృద్ధి, 18 కొత్త దేవాలయాల పనులు చేపట్టామని, వేంపల్లి ఉర్దూ జూనియర్‌ కళాశాల, పులివెందుల మోడల్‌ పోలీస్‌స్టేషన్‌ పనులు జరుగుతున్నాయని తెలిపారు. చిత్రావతి నుంచి ఎర్రబల్లి చెరువుకు లిఫ్ట్‌, యూరేనియం బాధిత గ్రామాలకు తాగునీరు అందించే పనుల టెండర్లు త్వరలోనే పూర్తి చేసి పనులు చేపడతామని సీఎం జగన్‌ వివరించారు. ప్రస్తుతం మీ రుణం తీచ్చుకోవడానికి రూ.5010 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాననని, గండికోట నుంచి 40 రోజుల్లో చిత్రావతి, పైడిపాలెం రిజర్వాయర్లు నింపేందుకు రూ.4240 కోట్లతో సామర్థ్యం పెంపు పనులు చేపడతున్నామని చెప్పారు. ఈ రెండు రిజర్వాయర్ల దగ్గర టూరిజం అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. పుణ్యక్షేత్రం గండి ఆంజనేయస్వామి క్షేత్రంలో రూ.14.5కోట్లతో గర్భాలయం, మండపం పునర్‌నిర్మాణం చేపడుతున్నామని, రూ.34.20 కోట్లు పాడా నిధులతో పులివెందులలో అధునాతన బస్సు డిపో నిర్మిస్తున్నామని, పులివెందుల పట్టణంలోని రంగనాధస్వామి ఆలయం, మిట్టమల్లేశ్వరస్వామి ఆలయం, ఆంకాలమ్మ గుడి, తూర్పు ఆంజినేయస్వామి దేవాలయాలు రూ.3.36 కోట్లతో అభివృద్ది చేస్తున్నామని వివరించారు. రూ.9.24కోట్లతో 24 నూతన ఆలయాలు, 23 పాత దేవాలయాల పునర్‌నిర్మాణాలకు శ్రీకారం చుట్టామన్నారు. బాలికలకు అత్యున్నత విద్యను అందించేందుకు రూ.36కోట్లతో తొండూరులో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశానని చెప్పారు. రూ.46.44 కోట్లతో నియోజవర్గాల్లో పాఠశాల భవనాలు, తరగతి గదులు నిర్మించబోతున్నామని, పలు గ్రామాలను అనుసంధానం చేస్తూ రూ.184.61 కోట్లతో 292.03 కిలోమీటర్ల రోడ్లు నిర్మించనున్నామని సీఎం జగన్‌ వివరించారు.


మీ బిడ్డగా క్షమించండి

గండికోట రిజర్వాయర్‌లో 26.85 నీటిని నిల్వ చేయడం ఈ 18నెలల కాలంలో ఇదో గొప్ప పని అని, ఈ క్రమంలో ఊర్లు, ఇళ్లు ఖాళీ చేసిన నిర్వాసితులకు ఇబ్బంది కలిగి ఉంటే మీ బిడ్డగా నన్ను క్షమించండని సీఎం జగన్‌ కోరారు. ఊర్లు ఖాళీ చేయించడానికి ఎంత శ్రద్ధ చూపామో, అంతే శ్రద్ధతో నిర్వాసితుల ప్రతి సమస్యను పరిష్కరించాలని సూచించారు. గండికోటలో గత 15 ఏండ్లుగా 12 టీఎంసీలు, చిత్రావతిలో 5 టీఎంసీలకు మించి ఒక్క చుక్క నీరు అదనంగా నింపలేదని మనమొచ్చాక పూర్తి స్థాయిలో నీటిని నింపామని వివరించారు. అలాగే 40 రోజుల్లో గండికోట నుంచి చిత్రావతి, పైడిపాలెంలకు నింపేందుకు వీలుగా రూ.3015 కోట్లతో చిత్రావతి లిఫ్ట్‌ సామర్ధ్యం 2వేల నుంచి 4వేల క్యూసెక్కులకు, పైడిపాలెం లిఫ్ట్‌ పనులు వెయ్యి నుంచి 2వేల క్యూసెక్కులకు పెంచబోతున్నామన్నారు. పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ కుడికాలువ, గుండ్లకమ్మ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పరిధిలో 1.38 లక్షల ఎకరాలకు సూక్ష్మసేద్యం సౌకర్యం కల్పించేందుకు రూ.1,256కోట్లతో పనులు చేపడుతున్నట్లు సీఎం జగన్‌ వివరించారు. 


పారిశ్రామిక కేంద్రంగా పులివెందుల

పులివెందుల పట్టణం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్‌ వివరించారు. ఇందులో భాగంగా గురువారం ఏపీ కార్ల్‌లో ఏర్పాటు చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ ఆనంద్‌ (ఇర్మా) సంస్థ, ఏపీఐఐసీ భూముల్లో ఏర్పాటు చేస్తున్న ఆపాచీ పరిశ్రమ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆ పరిశ్రమల ఏర్పాటుకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేసి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ రూ.70కోట్లతో రెండు దశల్లో ఆపాచీ పరిశ్రమ విస్తరించి 2వేల మందికి ఉపాధి కల్పిస్తారని అందులో సగం మంది మహిళలే ఉంటారని వివరించారు. 2006లో నాటి సీఎం వైఎస్‌ 11వేల మందికి ఉపాధి కల్పిస్తూ 150 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో రూ.1.80 కోట్ల జతల షూస్‌ తయారు చేసే వ్యవస్థను నెలకొల్పినట్లు తెలిపారు. కంపెనీ విస్తరణలో భాగంగా నేడు పులివెందులలో రెండవ యూనిట్‌ను 10 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో స్థాపించడం అభినందనీయమన్నారు. శ్రీకాళహస్తిలో కూడా ఆపాచీ సంస్థ రూ.350 కోట్లతో పరిశ్రమ పెడుతుందన్నారు. అలాగే ఏపీ కార్ల్‌లో ఇర్మా సంస్థ ముందుకు రావడం సంతోషించ దగ్గ విషయమన్నారు. గ్రామీణ అభివృద్ధి కోసం ఇప్పటికే అమూల్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్నామన్నారు. గుజరాత్‌కు చెందిన ఇర్మా సౌజన్యంతో ఏపీ కార్ల్‌లో యువతకు గ్రామీణ అభివృద్ది పట్ల అవగాహన కల్గించే శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 2021-22 విద్యాసంవత్సరం నుంచి సర్టిఫికెట్‌ కోర్సులు, రెండేళ్ల డిప్లోమా కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌, పశుసంవర్థకశాఖ మంత్రి అప్పలరాజు, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, కలెక్టర్‌ హరికిరణ్‌, ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా, ఇండసీ్ట్రయల్‌, కామర్స్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్‌, ఏపీఐఐసీ వీసీ, ఎండీ రవికుమార్‌రెడ్డి, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సుబ్రమణ్యం, జేసీలు గౌతమి, సాయికాంత్‌వర్మ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2020-12-25T05:42:11+05:30 IST