వణికిస్తున్న నివర్‌ తుఫాన్‌

ABN , First Publish Date - 2020-11-28T05:18:14+05:30 IST

నివర్‌ తుఫాను రాజంపేట, కోడూరు వాసులను నిలువునా ముంచేసింది.

వణికిస్తున్న నివర్‌ తుఫాన్‌
రైల్వేకోడూరు మండలంలో కోతకు గురైన భూములు

 తెగిపోయిన పింఛా ప్రాజెక్టు కాలువ మట్టికట్ట 

రాజంపేట, నవంబరు27 : నివర్‌ తుఫాను రాజంపేట, కోడూరు వాసులను నిలువునా ముంచేసింది. సుండుపల్లె మండలంలోని పింఛా ప్రాజెక్టు కాలువ మట్టికట్ట  తెగిపోయి వరదనీరంతా ఏటిపాలైంది. భారీ  వర్షాలతో చెయ్యేరు నది ఉగ్రరూపం దాల్చింది. ఏకంగా రెండు లక్షల పైబడి క్యూసెక్కుల నీటిని అన్నమయ్య ప్రాజెక్టు నుంచి  దిగువ ప్రాంతాలకు వదలడంతో, పింఛా ఎగువ ప్రాజెక్టు నీరంతా రావడంతో ఒక్కసారిగా చెయ్యేరు నదీ పరీవాహక ప్రాంతాలు నీటమునిగాయి. నదీ పరీవాహకప్రాంతాల్లోని హేమాద్రివారిపల్లె, నందలూరు నాగిరెడ్డిపల్లె, నారాయణనెల్లూరు, మందపల్లె తదితర గ్రామాలకు వరదనీరు చుట్టుముట్టడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.  రాజంపేట మండలంలోని చెయ్యేరు నదీ పరీవాహక గ్రామాలకు కరెంటు సరఫరా కాకపోవడంతో అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మందపల్లె పంచాయతీలో ఆకేపాటి ఫౌండేషన్‌ ట్రస్ట్‌ ద్వారా హరిజనవాడ, అరుంధతివాడ, వడ్డిపల్లె ప్రజలకు ట్యాంకర్ల తో నీరు సరఫరాచేశారు.  కడప-చెన్నై హైవే రోడ్డులో గుండ్లూరు వద్ద భారీ వృక్షం నేలకొరగడంతో గంటపాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెయ్యేరు నది ఉప్పొంగడంతో వరదనీటితో   ఇబ్బందులు పడుతున్న హేమాద్రివారిపల్లె వాసులను సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ దగ్గరుండి రెస్క్యూ టీమ్‌ తో బయటకు తీసుకొచ్చారు.

 వేలాది ఎకరాల్లో నీటమునిగిన పంటలు... 

రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో  సుమారు 50వేల ఎకరాల పైబడి అరటి, బొప్పాయి, వరి పంటలు నీటమునిగాయి. పంట నష్ట నివేదికల్లో ఉద్యాన, వ్యవసాయాధికారులు నిమగ్నమయ్యారు. అదే విధంగా గొర్రెలు, మేకలు పిట్టల్లా రాలిపోతున్నాయి.  

  చిట్వేలి-రాపూరు రాకపోకలు బంద్‌...

చిట్వేలి-రాపూరు ఘాట్‌రోడ్డులో వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అడవుల నుంచి భారీ ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండటంతో రాజుకుంట క్రాస్‌ రోడ్డు ఆంజనేయపురం వద్ద వాహనాలు నిలిపివేశారు. దీంతో తీవ్ర ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. 

 గుర్రంకొండకు వెళ్లి ఇరువురు మృతి ...

రాజంపేట నుంచి చిత్తూరు జిల్లా గుర్రకొండకు రాయచోటి మార్గం గుండా కారులో వెళుతుండగా అందులోని ఇరువురు నీటిలో చిక్కుకొని మృతి చెం దారు. రాజంపేటమండలం మన్నూరు సాయినగర్‌కు చెందిన రవిప్రసాద్‌(48),వెంకటసుబ్బయ్య(52) గుర్రంకొండవద్ద దేవళంపేట వంకలో మృతి చెందారు. వారి మృతదేహాలను పోలీసులు వెలికి తీసి బంధువులకు అప్పగించారు.  

రాజంపేట మండలం ఆకేపాడు ప్రాంతాల్లో దెబ్బతిన్న అరటి, ఇతర పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాధరెడ్డి, వైసీపీ నాయకుడు ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి శుక్రవారం పంట పొలాలను పరిశీలించారు. 

ఫించా ప్రాజెక్టుకు గండి..

సుండుపల్లె, నవంబరు 27: మండలంలోని వై. ఆదినారాయణరెడ్డి ఫించా ప్రాజెక్టుకు శుక్రవారం తెల్లవారు జామున గండి పడింది. ఫించా ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులో ఎక్కువ నీరు రావడంతో.. గండి పడింది. అయితే ప్రాజెక్టుకు కుడి వైపు సుమారు 30 మీటర్లు గండి పడింది. అటువైపు కొండ ఉండడంతో ఎటువంటి ప్రాణాపాయం కలగలేదు. గండి పడడంతోఆ నీళ్లన్నీ. దిగువన ఏటిలోకి వెళ్ళిపోయాయి.  

రైల్వేకోడూరులో...

రైల్వేకోడూరు, నవంబరు, 27: నివర్‌ తుఫాన్‌ వల్ల జనజీవనం అతలాకుతలం అయింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు వర్షం కురిసింది. దీంతో రైతుల పంటలు దెబ్బతిన్నాయి.  రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, చిట్వేలి, పెనగలూరు, చిట్వేలి ప్రాంతాల్లో పంటలు బాగా తిన్నాయి. భారీగా భూములు కోతకు గురయ్యాయి. మామిడి తదితర పంటల్లోకి వరద నీరు చేరుకుంది. రైల్వేకోడూరు మండలంలోని రెడ్డివారిపల్లెకు వెళ్లే బ్రిడ్జి రెండు వైపులా పూర్తి స్థాయి దెబ్బతింది. గుంజన నదిలో ఉధృతి తగ్గింది. కరెంటు స్తంభాలు విరిగి పడ్డాయి. అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

సిద్దవటంలో...

సిద్దవటం, నవంబరు27 : సిద్దవటం మండలం భాకరాపేట సమీపంలోని వాగు పొంగి పొర్లుతూ ఉండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం వరకు నీరు ఉధృతంగా ఉండటంతో బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహనాలు భాకరాపేట నుంచి సిద్దవటంవైపు నుంచి బద్వేలుకు వెళ్లే రహదారి పూర్తిగా స్తంభించింది. దీంతో తహసీల్దారు రమాకుమారి, ఎస్‌ఐ సురే్‌షబాబు, జేసీబీల ద్వారా చెట్లను  తొలగించి నీటి ప్రవాహాన్ని తగ్గించారు. 

రామాపురంలో...

రామాపురం, నవంబరు27:  రెండు రోజులుగా కురుస్తున్న నివర్‌ తుఫాన్‌ కారణంగా మండల వ్యాప్తంగా  సుమారు 50లక్షల రూపాయలు వాటిల్లినట్లు ప్రత్యేక అధికారి నాగరాజు తహసీల్దార్‌ మహబూబ్‌ చాంద్‌ తెలిపారు.శుక్రవారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 250 హెక్టార్లల్లో వరి, కంది40హెక్టార్లు, బొప్పాయి20 హెక్టార్లులల్లో దెబ్బతిన్నాయని  తెలిపారు. మండలంలోని  కల్పనాయుని చెరువు తెగిపోయి ప్రజలు పలు ఇబ్బందులు పడ్డారు. అధికారులు  ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

 చిన్నమండెంలో...

చిన్నమండెం, నవంబరు 27: తుఫాన్‌ కారణంగా మండల వ్యాప్తంగా సుమారు 1000 ఎకరాల్లో టమోటా, దాదాపు మరో 1000 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. పూల తోటలు కూడా దెబ్బతిన్నాయి. మామిడి తోటలు సైతం నష్టపోయాయి.  చాకిబండ- మల్లూరు మార్గంలో ఉన్న బ్రిడ్జి పైన నీళ్లు ప్రవహించడంతో శుక్రవారం ఉదయం వరకు రాకపోకలకు అంతరాయం కలిగింది. చిన్నమండెం మండల కేంద్రానికి ఎగువన ఉన్న సూరప్ప చెరువు పూర్తి స్థాయిలో  అలుగు పారడంతోతహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో ఉన్న అంగన్‌వాడీ సెంటర్‌ను ముంచెత్తాయి.  

రాయచోటిలో...

రాయచోటి, నవంబరు 27: మాండవ్యా నది సుమారు పది సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో పొంగి ప్రవహించింది. దీంతో పెద్ద ఎత్తున ప్రజల తరలి వచ్చారు. గురువారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి కంచాలమ్మ గండిలో ఎక్కువగా నీరు వచ్చి చేరింది. గురువారం సాయంత్రం నుంచే మాండవ్యా నది పారడం మెదలైంది. గురువారం రాత్రికి ఉధృతంగా ఏరు సాగింది. దీంతో గాలివీడు, రాయచోటి మార్గంలో రాకపోకలు శుక్రవారం మధ్యాహ్నం వరకు నిలిచిపోయాయి.  దెబ్బతిన్న పంటలను ఏవో దివాకర్‌ పరిశీలించారు. 

సంబేపల్లెలో...

సంబేపల్లె, నవంబరు 27: మండలంలో నివర్‌ తుఫాన్‌ కారణంగా విద్యుత్‌ స్తంభాలు, పూరిపాకలు, ప్రహరీలు, వృక్షాలు నెలకొరిగాయి. పలు చోట్ల సుమారు 75 గొర్రెలు ఈ వర్షానికి చనిపోయాయి. సుమారు 500 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. ఆరు ఎకరాల్లో బొప్పాయి పంట దెబ్బతింది.  పలు చోట్ల రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి.  దెబ్బతిన్న పంటలను తహసీల్దార్‌ నరసింహులు, ఏవో వెంకటమోహన్‌, వ్యవసాయ సలహా మండలి కమిటీ ఛైర్మన్‌ చిదంబర్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. 

పెనగలూరులో...

పెనగలూరు, నవంబరు27 :మండలంలోని నర్సింగరాజపురం గ్రామానికి సమీపంలో జెర్రిపోతు గడ్డ వద్ద కాపలాగా వెళ్లిన ఐదు కుటుంబాలకు చెందిన 18మంది జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో మండల అధికారులు హైరానా పడ్డారు. చివరకు వారు మరొక ప్రాంతానికి సురక్షితంగా చేరుకున్నామని ఫోన్‌లో తెలపడంతో అధికారులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎస్పీ కె.కె.అన్బురాజన్‌ పరిస్థితిని సమీక్షించేందుకు పెనగలూరు చేరుకున్నారు. రూరల్‌ సీఐ నరేంద్రరెడ్డి, ఎస్‌ఐ చెన్నకేశవ పరిస్థితి తెలపడంతో ఆయన సూచనలిచ్చి వెనుదిరిగారు. 

Updated Date - 2020-11-28T05:18:14+05:30 IST