నీకు సగం.. నాకు సగం...!

ABN , First Publish Date - 2020-06-19T06:29:28+05:30 IST

‘నేతన్న నేస్తం’పై అక్రమార్కుల కన్ను పడింది. ఎలాగైనా సరే.. ప్రభుత్వ సొమ్మును కాజేయాలనుకున్న కొందరు అడ్డదారులు,

నీకు సగం.. నాకు సగం...!

నేతన్న నేస్తంపై అక్రమార్కుల కన్ను..?

అనర్హులకే అందలం

చక్రం తిప్పుతున్న ఆ ఇద్దరు అధికారులు


కడప, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ‘నేతన్న నేస్తం’పై అక్రమార్కుల కన్ను పడింది. ఎలాగైనా సరే.. ప్రభుత్వ సొమ్మును కాజేయాలనుకున్న కొందరు అడ్డదారులు, వక్రమార్గాల్లో అర్హుల పేరిట అనర్హులను చేర్పించి ప్రభుత్వ సొమ్మును కాజేయాలని శ్రీకారం చుట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ కొందరికి చేనేత జౌళి శాఖకు చెందిన ఇద్దరు అధికారులు సహకరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. వారి స్కెచ్‌ ప్రకారమే నేతన్న నేస్తంలో అర్హుల పేరిట అనర్హులను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు మీకింత..మాకింత అనే తరహాలో ప్రభుత్వం ఇచ్చే సొమ్మును వాటాలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల హామీలో భాగంగా నేతన్న నేస్తం పేరిట సీఎం జగన్‌ నేతన్నలకు రూ.24 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. రెండో విడత పథకాన్ని శనివారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు.


అక్రమార్కుల కన్ను

ప్రభుత్వం చేనేతలకిచ్చే ఆర్థిక సాయాన్ని కాజేసే ఘనులు జిల్లాలో ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు నేతన్న నేస్తంపై ఇచ్చే సహాయంపై కూడా కన్నేశారు. ప్రభుత్వం గుంత మగ్గం ఉన్న నేతన్నలకు ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే కొందరు పవర్‌లూమ్‌ మగ్గందారులు కూడా ఆర్థిక సాయాన్ని పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


అనర్హులకే అందలం

ఎనిమిదేళ్ల కిందట దాదాపు 19 వేల మందికి గుర్తింపు కార్డులు ఇచ్చారు. అయితే కొందరు బోగస్‌ సంఘాలను సృష్టించారు. దీంతో నిజమైన నేతన్నలకు ప్రభుత్వ ఆర్థికసాయం అందలేదు. కాలక్రమేణా కొందరు పవర్‌లూమ్‌ వైపు మొగ్గు చూపారు. చేనేత జౌళి శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది నేతన్న నేస్తానికి 9311 మంది అర్హులను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. అయితే 30 శాతం పైబడి అనర్హులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.


నీకు సగం.. నాకు సగం

ప్రభుత్వం సొమ్ముపై కన్నేసిన కొందరు అర్హుల జాబితాలో అనర్హులను చేర్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పవర్‌లూమ్‌కు ఆర్థికసాయం వర్తించదు. అయితే అలాంటి వారిని లబ్ధిదారుల జాబితాలో చేర్చి 10 వేల రూపాయలు బ్రోకర్లకు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం ఉంది. దీనికి గాను జౌళి శాఖలోని ఇద్దరు పూర్తిగా సహకరిస్తున్నట్లు ప్రచారం ఉంది. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, పుల్లంపేట, బద్వేలు, ఒంటిమిట్ట తదితర ప్రాంతాల్లో ఈ తతంగం నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జమ్మలమడుగు అర్బన్‌, వేపరాల, కన్నెలూరు, ముద్దనూరు, కొండాపురం ప్రాంతాల్లో అనర్హులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల అక్రమాలపై జేసీ సాయికాంత్‌వర్మ విచారణ చేపట్టారు.


ఆ ఇద్దరి సహకారం

నేతన్న నేస్తానికి అనర్హులను ఎంపిక చేశారని ఫిర్యాదులు వస్తే అక్కడ విచారణ చేసేందుకు వెళ్లే ముందే.. ఆ ఇద్దరి ద్వారా బ్రోకర్లకు సమాచారం అందుతుందని చెబుతున్నారు. దీంతో అధికారులు వచ్చే లోపు తాత్కాలికంగా మగ్గాలు ఏర్పాటు చేసి విచారణ అధికారులను బురిడీ కొట్టిస్తున్నట్లు తెలుస్తోంది. జియో ట్యాగ్‌ ప్రతి మగ్గానికి చేస్తున్నామని చెబుతున్నప్పటికీ విచారణకు వెళ్లేప్పుడు మాత్రమే జియోట్యాగ్‌ కనిపిస్తోంది. డబ్బులు నేరుగా ఖాతాదారుల అకౌంట్లో జమ అవుతాయి. ఉపాధి హామీ పనుల్లో అయితే గుంత తవ్వేటప్పుడు, బిల్లులు చెల్లించేటప్పుడు జియోట్యాగ్‌ చేస్తారు. తద్వారా అక్రమాలకు ఆస్కారం ఉండదని చెబుతారు. అదే తరహాలోనే మగ్గం ఉన్నప్పుడు, ఆర్థిక సాయం అందించేటప్పుడు జియో ట్యాగ్‌ చేస్తే అక్రమాలు జరగవని చెబుతున్నారు. 


లబ్ధిదారుల ఎంపికలో మా ప్రమేయం లేదు-ఎస్‌.అప్పాజీ, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు 

నేతన్న నేస్తం లబ్ధిదారుల ఎంపికలో గ్రామ, వార్డు స్థాయిలో వలంటీర్లు, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ద్వారా ఎంపిక చేసి ఎంపీడీవోలు, కమిషనర్ల ద్వారా లబ్ధిదారుల జాబితా మాకు అందుతుంది. అనర్హులుంటే చర్యలకు సిఫార్సు చేస్తాము.

Updated Date - 2020-06-19T06:29:28+05:30 IST