కొసరే..!

ABN , First Publish Date - 2020-06-19T06:25:43+05:30 IST

పెన్నా నదిపై 10 టీఎంసీల సామర్థ్యంతో మైలవరం జలాశయం నిర్మించారు. ప్రస్తుత సామర్థ్యం 6.70 టీఎంసీలు. మైలవరం, జమ్మలమడుగు, పెద్దముడియం, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఎర్రగుంట్ల, కమలాపురం

కొసరే..!

మైలవరం డ్యాం నిర్వహణ, బ్యాలెన్స్‌ పనులకు రూ.37 కోట్లు అవసరం

బడ్జెట్లో కేటాయింపు రూ.5.93 కోట్లే

కుంగిపోతున్న రాతిపరుపు

నీళ్లు రావని కాలువలు చదును చేసిన రైతులు

నిధులు లేకపోతే నిర్వహణ ఎలా..?


సాగునీటి ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామంటున్న ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపుల్లో నిరాశే మిగిలింది. నిధుల్లో కొసరుతో సరిపుచ్చారు. మైలవరం జలాశయం, కాలువ నిర్వహణ, బ్యాలెన్స్‌ పనులకు రూ.37 కోట్లు కావాలని అంచనా. ఆర్థిక మంత్రి బుగ్గన ఇచ్చింది కేవలం రూ.5.93 కోట్లే. డ్యాం రక్షణ గోడలు, రాతిపరుపు కుంగిపోతోంది.


పదేళ్లుగా సాగునీరు రాలేదని అక్కడక్కడా రైతులు పంట కాలువలు చదును చేశారు. ప్యాకేజీ-91 పనులను కాంట్రాక్ట్‌ సంస్థ మధ్యలో వదిలేసింది. ఇలాంటి పరిస్థితుల్లో నిధులు లేకపోతే డ్యాం నిర్వహణ ఎలా..? పంట పొలాలకు సాగునీరు మళ్లించేదెలా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 6.7 టీఎంసీల సామర్థ్యం, 75 వేల ఎకరాలకు సాగునీరు అందించే మైలవరం ప్రాజెక్టు తాజా పరిస్థితిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. 


కడప, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పెన్నా నదిపై 10 టీఎంసీల సామర్థ్యంతో మైలవరం జలాశయం నిర్మించారు. ప్రస్తుత సామర్థ్యం 6.70 టీఎంసీలు. మైలవరం, జమ్మలమడుగు, పెద్దముడియం, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఎర్రగుంట్ల, కమలాపురం మండలాలు, కర్నూలు జిల్లా సంజామల, చాగలమర్రి మండలాల్లో 75 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా.. తుంగభద్ర ప్రాజెక్టు ఎగువ కాలువ (టీజీపీ హెల్‌ఎల్‌సీ) స్టేజ్‌-2లో భాగంగా 1968-69లో చేపట్టి 1981-82లో జలాశయం నిర్మాణం పూర్తి చేశారు. 1985-86లో ఉత్తర, దక్షిణ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు నిర్మాణాలు పూర్తయ్యాయి. 2005లో ప్రాజెక్టును గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో విలీనం చేశారు. ఏళ్ల చరిత్ర కలిగిన మైలవరం డ్వాం నిర్వహణ నానాటికీ తీసికట్టుగా మారింది. సందర్శకుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది.


చేతులెత్తేసిన కాంట్రాక్ట్‌ సంస్థలు

జలాశయం ఇంప్రూవ్‌మెంట్‌, ఉత్తర, దక్షిణ కాలువల ఆధునికీకరణకు 2005 మే 25న నాటి వైఎస్‌ ప్రభుత్వం రూ.145.45 కోట్లు మంజూరు చేసింది. రూ.77.44 కోట్లతో ప్యాకేజీ-90 కింద ఉత్తర కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టారు. 94 శాతం పనులు పూర్తి చేసిన కాంట్రాక్ట్‌ సంస్థ మిగిలిన 4 శాతం సుమారు రూ.1.50 కోట్లు పనులు చేయకుండానే వదిలేయడంతో ఆ కాంట్రాక్టును రద్దు చేశారు. క్లోజర్‌ వర్క్స్‌, నిర్వహణ భారం ప్రభుత్వంపై పడింది. రూ.75.57 కోట్లతో ప్యాకేజీ 91 కింద దక్షిణ కాలువ ఆధునికీకరణ, రిజర్వాయరు ఇంప్రూవ్‌మెంటు చేపట్టారు. ఈ పనులను హిందుస్థాన్‌, రత్నం సంస్థలు జాయింట్‌ వెంచర్‌గా చేపట్టాయి. 66 శాతం పనులు పూర్తి చేసి.. ఇక ఈ పనులు చేయం.. మా ఒప్పందంను రద్దు (క్లోజర్‌) చేయమని ప్రభుత్వానికి లేఖ రాశాయి. అంటే.. మరో దాదాపు రూ.24-25 కోట్లు పనులు చేయాల్సి ఉంది. పెరిగిన ఎస్‌ఎ్‌సఆర్‌ రేట్ల ప్రకారం ఆ మొత్తం మరింత పెరగవచ్చని అంచనా. అంటే.. ప్యాకేజీ-90, 91 పెండింగ్‌ పనులే దాదాపుగా రూ.26 కోట్లపై చేయాల్సి ఉంది. నిధులు లేనిదే పనులు చేసేదెలా..?


డ్యాం, కాలువ నిర్వహణకు రూ.9 కోట్లు అవసరం

ప్యాకేజీ-90 కాంట్రాక్ట్‌ రద్దు చేయడంతో ఉత్తర కాలువ నిర్వహణ ఇంజనీర్లే చూడాల్సి వస్తుంది. ఇందుకోసం రూ.1.50 కోట్లు కావాలని అంచనా. కొన్నేళ్లుగా జలాశయం మరమ్మతులు చేయకపోవడం, ప్యాకేజీ-91 కాంట్రాక్ట్‌ సంస్థలు ఇంప్రూవ్‌మెంట్‌ పనులు చేపట్టకపోవడంతో ఆనకట్ట రక్షణ గోడలు కూలిపోతున్నాయి. లోపల, బయట భాగంలో రాతి పరుపు కుంగిపోతూ ప్రమాద సంకేతాలు సూచిస్తున్నాయి. జలాశయం గెస్ట్‌హౌస్‌ నిర్వహణ, తదితర పనులకు రూ.8 కోట్లు కావాలని పంపిన నివేదికకు కదలిక లేదు. అది రూ.9 కోట్లకు చేరింది.


15 ఏళ్లుగా సాగునీరు రాకపోవడంతో అక్కడక్కడా రైతులు పంట కాలువలను చదును చేసి వర్షాధార పంటలు సాగు చేస్తున్నారు. ఆ కాలువలు మళ్లీ నిర్మించాలంటే మరో రూ.1.50 కోట్లు అవసరమని అంచనా. ప్యాకేజీ-90, 91 బ్యాలెన్స్‌ పనులు, డ్యాం నిర్వహణ, కాలువ మరమ్మతులకు రూ.37 కోట్లకుపైగా నిధులు అవసరమైతే.. ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్లో రూ.5.93 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో నిర్వహణ ఎలా సాధ్యం..? ఆయకట్టుకు సాగునీరు ఇవ్వగలరా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


డ్యాం నిర్వహణకు రూ.9 కోట్లు కావాలి - సుధాకర్‌, మైలవరం ప్రాజెక్టు ఈఈ

మైలవరం డ్యాం, గెస్ట్‌హౌస్‌, ప్యాకేజీ-90 ప్రీక్లోజర్‌ నిర్వహణ పనులకు సుమారుగా రూ.9 కోట్లు అవసరం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. రూ.77.57 కోట్లతో చేపట్టిన ప్యాకేజీ-91 కాంట్రాక్ట్‌ సంస్థలు 66 శాతం పనులు చేసి క్లోజర్‌ కోసం ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ప్యాకేజీ పరిధిలో రూ.25 కోట్లు వరకు పెండింగ్‌ పనులు చేయాల్సి ఉంది. మైలవరం ప్రాజెక్టుకు బడ్జెట్‌లో ఎంత నిధులు కేటాయించారో మా వరకు రాలేదు. అయితే.. సాగునీటికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుండడంతో నిధుల సమస్య రాకపోవచ్చు. 


Updated Date - 2020-06-19T06:25:43+05:30 IST