-
-
Home » Andhra Pradesh » Kadapa » Mruthyu Gosha
-
మృత్యు పెన్నా..!
ABN , First Publish Date - 2020-12-19T05:35:26+05:30 IST
సిద్దవటం చెంత పెన్నా నది అందాలు కనువిందు చేస్తున్నాయి. నది ఒడ్డు బీచను తలపిస్తుంటుంది.

సిద్ధవటం చెంత ప్రాణాంతకు సుడిగుండాలు
ఏటా 6-10 మంది మృత్యువాత
ఐదేళ్లలో 35-40 మందికిపైగా నీటిలో గల్లంతై మృతి
మృతులలో ఎక్కువ మంది విహారయాత్రకు వచ్చినవారే
(కడప-ఆంధ్రజ్యోతి): సిద్దవటం చెంత పెన్నా నది అందాలు కనువిందు చేస్తున్నాయి. నది ఒడ్డు బీచను తలపిస్తుంటుంది. అక్కడికి వెళ్లిన ఎవరికైనా నదిలో స్నానం చేయాలనిపిస్తుంది. నది చెంతనే చారిత్రాత్మక కోట సందర్శుకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడి నది అందాలు తిలకించడానికి సెలవు రోజుల్లో పెద్ద ఎత్తున వస్తుంటారు. అంతేకాదు.. బంధువుల, మిత్రుల ఇళ్లకు వచ్చిన బంధువులు, అతిథులు పెన్నాలో స్నానాలకు వెళ్తుంటారు. వారికి నదిలో సుడి గుండాలు ఉన్నాయనే విషయం తెలియక, నీటిలోపలికి వెళ్తూ ప్రదానాకి గురౌతున్నారు. నీటి ప్రవాహ వేగానికి కాళ్లకింద ఇసుక జారిపోతూ నీటిలో ముంచేస్తుంది. ఏటా 6-10 మందికి పైగా పెన్నా నదిలో జలసమాధి అవుతున్నారు. ఈ ఐదేళ్లలో 35-40 మందికిపైగా మృత్యువాత పడ్డారని అధికారులు తెలిపారు.
సుడి గుండాలు ఇక్కడే
పెన్నా నదిలో పాత బ్రిడ్జి దగ్గర, శివాలయం, పోస్టాఫీసు సందు, కోట నుంచి సొరంగ మార్గం, కోట ఎదురుగా ఉన్న తిప్పచెంత, మూలపల్లి అమరరెడ్డిస్వామి ఆయలం దగ్గర, ఆకులవీధిరేవు, దర్జిపాలెంరేవు, గాండ్లపాలెం రేవుల దగ్గర సుడిగుండాలు ఉన్నాయని గుర్రంపాటి వెంకట సుధాకర్‌రెడ్డి వివరించారు. తిరుపతికి చెందిన ఏడుగురు యువకుల మృతికి కూడా సుడిగుండాలే కారణమని ఆయన తెలిపారు.
ఇలా చేస్తే..:
బ్రిడ్జి నుంచి కోట మీదుగా గాండ్లపాలెంరేవు వరకు రక్షణ గోడ నిర్మించాలి. సోమశిల బ్యాక్ వాటర్ ప్రదేశాన్ని బీచ తరహాలో అభివృద్ధి చేసి స్నానాలకు అనుకూలంగా చేయాలి. నదిలోపలకు వెళ్లకుండా ఇనుప కంచె ఏర్పాటు చేయాలి. ప్రాణాంతక సుడి గుండాలు ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా పకడ్బందీ రక్షణ చర్యలు చేపట్టాలి. విహారయాత్రిలకు అవగాహన కల్పించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
సిద్దవటం చెంత మరణాలు..
గురువారం తిరుపతి నుంచి మిత్రుడి ఇంట్లో ఫంక్షనకు వచ్చిన ఏడుగురు యువకులు సిద్దవటం కోట సమీపంలో సరదాగా ఈతాడుతూ నది లోపలివెళ్లికి సుడి గుండంలో చిక్కుకుని మునిగిపోయారు.
నవంబరు నెలలో కార్తికమాసం రెండో సోమవారం సిద్దవటానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు ఇద్దరు (7, 11 ఏళ్లు) నోముల చాటలు కడగడానికి నదిలోకి వెళ్లి నీటిలో గల్లంతై కన్నుమూశారు.
2019లో బళ్లారికి చెందిన నలుగురు కడపలో బంధువుల ఇళ్లకు వచ్చారు. సిద్దవటం కోటను చూడ్డానికి వచ్చి నదిలో స్నానానికి దిగి సుడిగుండంలో చిక్కి జలసమాధి అయ్యారు.
బద్వేలుకు చెందిన వికలాంగురాలు పాత బ్రిడ్జి సమీపంలో నదిలో కొట్టుకుపోయి ంది. వారం తరువాత మృతదేహాన్ని గుర్తించారు.
2018లో రాజంపేటకు చెందిన ఓ కుటుంబం పెన్నాలో స్నానాలకు వచ్చి ఇంటర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఇద్దరు యువకులు నీటిలో గల్లంతయ్యారు.
2018లో కడప నగరం మృత్యుంజయకుంటకు చెందిన నలుగురు విహార యాత్రకు ఇక్కడికే వచ్చి ఇసుకలో వాలిబాల్ ఆడి.. ఆ తరువాత నదిలో స్నానానికి వెళ్లి సుడి గుండంలో చిక్కి కన్నుమూశారు.
2012లో కడప నగరానికి చెందిన ఓ కుటుంబం రంజాన పర్వదినం మరుసటి రోజు విహాయ యాత్రకు సిద్దవటం పెన్నా నది చెంతకు వచ్చారు. నదిలో స్నానాలు చేస్తూ ఐదుగురు మృత్యుఒడి చేరారు.
సిద్దవటం ఆకులవీధికి చెందిన ముగ్గురు మహిళలు నది ఆవలిఒడ్డున ఉన్న పొలం పనులకు వెళ్లేందుకు నదిదాటుతూ నీటి సుడిగుండంలో చిక్కుకొని మృత్యువాత పడ్డారు.
మాధవరం-1కి చెందిన ఇద్దరు (వరుసకు తండ్రికొడుకులు) వినాయక నిమజ్జనం అనంతరం స్నానానికి వెళ్లి నీటిలో గల్లంతై మృతి చెందారు.
ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషనకు చెందిన ఓ కానిస్టేబుల్ దసరా సెలవుల్లో మనవళ్లకు ఈత నేర్పడానికి నదిలోకి వెళ్లి.. సుడిగుండంలో చిక్కి మరణించారు.