గ్రామాన్ని వణికిస్తున్న దద్దుర్లు

ABN , First Publish Date - 2020-12-27T05:42:21+05:30 IST

మోట్నూతలపల్లెలో దాదాపు 150 మంది గ్రామస్థులకు దద్దుర్లు వచ్చాయి. రెండు రోజులుగా ఈ దద్దుర్ల ప్రభావం పెరుగుతూ వస్తోంది. యూసీఐఎల్‌ వల్లే ఇలా జరుగుతోందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

గ్రామాన్ని వణికిస్తున్న దద్దుర్లు
ఒంటిపై దద్దుర్లు చూపుతున్న గ్రామస్థులు

యురేనియం ప్రభావం అంటున్న ప్రజలు

భయాందోళనలో మోట్నూతలపల్లె వాసులు 

పులివెందుల, డిసెంబరు 26: మోట్నూతలపల్లెలో దాదాపు 150 మంది గ్రామస్థులకు దద్దుర్లు వచ్చాయి. రెండు రోజులుగా ఈ దద్దుర్ల ప్రభావం పెరుగుతూ వస్తోంది. యూసీఐఎల్‌ వల్లే ఇలా జరుగుతోందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకెళితే.... పులివెందుల మండలంలోని మోట్నూతలపల్లెలో 750 మంది జనాభా ఉన్నారు. ఈ గ్రామంలో కొందరు బావి నీరు, మరికొందరు బోరునీరు తాగుతున్నారు. గ్రామంలోని కొందరికి రెండు రోజులుగా ఒంటిపై దద్దుర్లు వస్తున్నాయి. దీంతో పక్కనే ఉన్న నల్లపురెడ్డిపల్లె గ్రామ పీహెచసీ డాక్టర్‌ శరణ్య గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ప్రజలు యూసీఐఎల్‌ ప్రభావంతోనే ఇలా వస్తున్నాయని వైద్యసిబ్బంది వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. నెలరోజుల క్రితం కూడా కొందరికి ఇలాగే వచ్చిందని అప్పుడు కూడా ఇక్కడ వైద్యశిబిరం ఏర్పాటు చేసి చికిత్స చేయడంతో తగ్గిపోయాయని వారు పేర్కొన్నారు.

బోరువాటర్‌ తాగుతున్న వారికి మాత్రమే ఈ దద్దుర్లు వచ్చినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు. యూసీఐఎల్‌ టెయిలింగ్‌పాండ్‌ ఈ గ్రామానికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రభావమా లేక మరేదైనా కారణమా అనే విషయం అంతుపట్టడం లేదని వైద్యులు పేర్కొన్నారు. దాదాపు 150 మందికి శనివారం వైద్యం అందించారు. అక్కడ బోరు నీటిని పరీక్షల నిమిత్తం కడపకు పంపించినట్లు డాక్టర్‌ ఆంధ్రజ్యోతికి వివరించింది. వీరిలో బ్యాక్టీరియా కాని మరేదైనా ఉందా అని పరీక్షించిన అనంతరం విషయం తెలుస్తుందన్నారు. ఈ రెండు పరీక్షల ద్వారా ఏది నిర్ధారణ కాకపోతే వాటర్‌ బోర్డుకు ఇక్కడి పరిస్థితి వివరిస్తే వారు కూడా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. 


బోరు నీరు తాగుతుంటే దద్దుర్లు వస్తున్నాయి

-వెంగముని, మోట్నూతలపల్లె

మా గ్రామంలో తాగునీటి కోసం ఉపయోగించే బోరునీరు తాగుతుంటే దద్దుర్లు వస్తున్నాయి. ఎందుకిలా వస్తున్నాయో అంతుబట్టడం లేదు. మా ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో యురేనియం వ్యర్థాలను నిల్వ చేసే టెయిలింగ్‌పాండ్‌ ఉంది. గతంలో ఒక సారి ఇదే సమస్య వచ్చింది. రెండోసారి 150 మందికి వచ్చింది. ఇలా ఎందుకు వచ్చిందో అధికారులు తెలియజేయాలి. 


బోరునీరు కలుషితం అవుతోంది

- రామయ్య, మోట్నూతలపల్లె

మా గ్రామంలో తాగునీటి కోసం ఉపయోగించే బోరునీరు కలుషితం అవుతోంది. బోరునీరు బిందెలో గాని, బక్కెట్‌లో గాని నిల్వ చేస్తే పైన తేటలాగా ఏర్పడుతోంది. ఇది యురేనియం ప్రభావమేనని గ్రామస్థులంతా అభిప్రాయపడుతున్నారు. యురేనియం వల్లే మా ఆరోగ్యాలు పాడవుతున్నాయని, మాకు అనిపిస్తోంది. దీనిపైన పూర్తి పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలు రాకుండా చూడాలి.

Updated Date - 2020-12-27T05:42:21+05:30 IST