అవినీతిని బయటపెట్టినందుకే గుర్నాధరెడ్డి హత్య

ABN , First Publish Date - 2020-11-16T05:28:03+05:30 IST

కొండాపురం మండలం పి.అనంతపురంలో రెండురోజుల క్రితం గుర్నాధరెడ్డి హత్య జరిగితే ప్రభుత్వం పట్టించుకోకుండా ఫ్యాక్షన హత్యగా, ఆధిపత్య, రాజకీయ హత్యగా చూపించాలనుకోవడం సిగ్గుచేటని టీడీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ధ్వజమెత్తారు.

అవినీతిని బయటపెట్టినందుకే గుర్నాధరెడ్డి హత్య

ఆధిపత్య హత్యగా, రాజకీయ హత్యగా చూపాలనుకోవడం సిగ్గుచేటు
సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించి నిందితులను శిక్షించాలి
అనర్హులకు లబ్ధి చేకూర్చేందుకు రూ.300 కోట్లు అవినీతి
టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ధ్వజం
కడప, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):
కడప జిల్లా కొండాపురం మండలం పి.అనంతపురంలో రెండురోజుల క్రితం గుర్నాధరెడ్డి హత్య జరిగితే ప్రభుత్వం పట్టించుకోకుండా ఫ్యాక్షన హత్యగా, ఆధిపత్య, రాజకీయ హత్యగా చూపించాలనుకోవడం సిగ్గుచేటని టీడీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. గండికోట నిర్వాసితులకు పరిహారం చెల్లించే నేపధ్యంలో భాగంగా కొండాపురం పి.అనంతపురం గ్రామానికి ప్రభుత్వం పరిహారం అందించాలనుకుందన్నారు. పి.అనంతపురం గ్రామంలో 350 జనాభా ఉండగా స్వీయ లబ్ధి కోసం లిస్టులో అనర్హులను చేర్చి 750 మందికి పరిహారం చెల్లించాలని స్థానిక ఎమ్మెల్యే, రెవెన్యూ అధికారులు ప్రయత్నించడం వల్ల గుర్నాధరెడ్డి రూ.25 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమవుతుందని కోర్టును ఆశ్రయించారన్నారు. దీంతో స్పందించిన కోర్టు లబ్ధిదారులను గుర్తించాలని ఆదేశించగా ఉన్నతాధికారులు గ్రామసభ ఏర్పాటు చేశారని, ఆ సభలో వాస్తవాలు బయటపెడుతున్న సమయంలో సభ సాక్షిగా గుర్నాధరెడ్డి హత్య కావడం వెనుక నిజం బయటికి రాకూడదని, భవిష్యత్తులో ఎవరు కూడా ఫిర్యాదు చేయాలంటేనే భయపడేట్లు ఉండాలనే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. గుర్నాధరెడ్డి హత్య రాజకీయ హత్య కాదని, ముమ్మాటికీ స్థానిక ఎమ్మెల్యే అవినీతి బహిర్గతం కాకూడదనే పథకం ప్రకారం చేసిన హత్య అని ఆరోపించారు. గండికోట నిర్వాసితులకు అందించే రూ.1200 కోట్ల పరిహారంలో 300 కోట్ల అవినీతి బయటికి పొక్కకూడదనే ఆధిపత్య హత్యగా రంగు పులిమారన్నారు. సిట్టింగ్‌ జడ్జితో హత్యోదంతాన్ని విచారణ జరిపించి దోషులను, ఆర్థిక  అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 306 సెక్షన ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిని దోషులుగా పరిగణించినట్లే.. గుర్నాధరెడ్డి హత్యలో దోషులుగా రుజువైన వారందరిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని పలికే ప్రభుత్వం గద్దెనెక్కి సుమారు 17 నెలలైనా ఇప్పటికీ ఉద్యానవన రైతులకు సబ్సిడీపై డ్రిప్‌ పరికరాలు ఎందుకు అందించలేకపోయారో చెప్పాలని ప్రశ్నించారు.

ఈ సంవత్సరం వర్షాలు బాగా పడి భూగర్భ జలాలు పెరిగాయని ఉద్యానపంటల వైపు రైతులు ఆసక్తితో ఉన్నారన్నారు. 90 శాతం సబ్సిడీపై అందే డ్రిప్‌ అందకపోవడంతో 100 శాతం భరించే ఆర్థిక స్థోమత లేక రైతాంగం అల్లాడుతున్నారన్నారు. దివంగత వైఎ్‌సఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు రైతులకు ఉపయోగపడే ఉచిత విద్యుత తదితర పథకాలు ఎన్నో చేశారని, కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ రైతు దినోత్సవం జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న బాధలను గుర్తించి వారికి మెరుగైన పథకాలు అందించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-11-16T05:28:03+05:30 IST