సాహసం చేయకు డింబకా...

ABN , First Publish Date - 2020-06-16T11:40:25+05:30 IST

ఆ ముగ్గురూ ముక్కుపచ్చలారని చిన్నారులు.. ఇద్దరు ఆరవ తరగతి.. ఒకరు మూడవ తరగతి చదువుతున్నారు. కరోనా కారణంగా.. స్కూళ్లు

సాహసం చేయకు డింబకా...

అడవికి వెళ్లి తప్పిపోయిన చిన్నారులు

పోలీసుల సాయంతో.. బయటపడ్డ వైనం


రాయచోటి, జూన్‌ 15: ఆ ముగ్గురూ ముక్కుపచ్చలారని చిన్నారులు.. ఇద్దరు ఆరవ తరగతి.. ఒకరు మూడవ తరగతి చదువుతున్నారు. కరోనా కారణంగా.. స్కూళ్లు కూడా లేవు.. దీంతో ఏం చేయాలో.. పాలుపోక.. సాహసయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా పల్లెకు సమీపంలో ఉన్న వండాడి కొండకు వేటకు వెళ్ళాలని అనుకున్నారు. సోమవారం ఉదయం ఇంటి వద్ద నుంచి నీళ్లు.. అన్నం వెంట తీసుకుని సాహసయాత్రకు వెళ్ళారు. అక్కడ ఏమైందో.. ఏమో.. అడవిలో చిక్కుకుని ఇంటికి రాలేకపోయారు.. ఈ విషయం తెలిసీ.. పోలీసులు అడవిని రాత్రి పూట జల్లెడ పట్టి..చెట్టూ.. పుట్టా.. గుట్టలన్నీ తిరిగీ ఎట్టకేలకు గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. కుటుంబ సభ్యులు, పల్లె ప్రజలకు ఆందోళన పెట్టించిన  ముగ్గురు చిన్నారుల సాహసయాత్ర రాయచోటి మండలం మాధవరం వడ్డెపల్లెలో జరిగింది. పోలీసుల కథనం మేరకు..  రాయచోటి మండలం మాధవం వడ్డెపల్లెకు చెందిన స్వయానా అన్నదమ్ములు. వీరిరువురూ 6వ తరగతి చదువుతున్నారు. వీరికి బావమరిది వరుస అయ్యే సురే్‌షబాబు 3వ తరగతి చదువుతున్నాడు. వీరు ముగ్గురూ కలిసి వండాడి కొండకు సాహసయాత్రకు(షికారుకు) వెళ్ళారు.


ఇంటి వద్ద నుంచి అన్నం, నీళ్లు కూడా తీసుకెళ్లారు. అయితే అక్కడ ఏం జరిగిందో.. ఏమో ప్రమాదవశాత్తూ.. 20 మీటర్ల లోతు ఉన్న ప్రాంతంలో చిక్కుకుపోయారు. సాయంత్రం అయినా వీళ్లు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వెతుకులాట ప్రారంభించారు. అయితే వీళ్ల ఆచూకీ తెలియపోవడంతో రాయచోటి అర్బన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అర్బన్‌ సీఐ రాజు ఆధ్వర్యంలో పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి వీళ్ళ ఆచూకీ కోసం అడవిని జల్లెడపట్టారు. ఈ విషయం చుట్టుపక్కల పల్లెలకు తెలియడంతో.. పిల్లల ఆచూకీ కోసం పెద్ద ఎత్తున జనం అడవి వైపు బయలుదేరారు. అయితే రాత్రి 8.30గంటల సమయంలో వండాడి కొండ జెండాకుప్ప(పేట్‌) వద్ద పిల్లల ఆచూకీని పోలీసులు గుర్తించారు. సుమారు 20 మీటర్ల లోతు ప్రాంతంలో పిల్లలు ఉన్నట్లు సమాచారం. పోలీసులతో పాటు వెతుకులాటలో ఉన్న రమణ అనే యువకుడు పిల్లల వద్దకు చేరుకున్నాడు. పిల్లలకు మంచినీళ్లు ఇచ్చినట్లు  తెలిసింది. తాళ్ల సాయంతో పిల్లలను బయటకు తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలిసీ... చుట్టుపక్కల పల్లెల నుంచి సైతం పెద్ద ఎత్తున యువకులు వెతకడానికి వెళ్ళారు. 

Updated Date - 2020-06-16T11:40:25+05:30 IST