కోలుకుంటున్న మినుము పంట

ABN , First Publish Date - 2020-12-18T04:56:53+05:30 IST

భారీ వర్షాల ధాటికి మండలంలో రైతులు సాగు చేసిన మినుము పంట నీట మునిగిపోయి మొక్కలు దెబ్బతిని ఇక పంట పనికిరాదనే విధంగా మారింది.

కోలుకుంటున్న మినుము పంట
మినుము పంటపై పురుగు మందును పిచికారి చేస్తున్న దృశ్యం

భారీ వర్షాలతో నీరు నిలిచి మొక్కలు దెబ్బతిన్న వైనం  పంటను రక్షించేందుకు రైతన్నల పాట్లు

ప్రొద్దుటూరు రూరల్‌, డిసెంబరు 17: భారీ వర్షాల ధాటికి మండలంలో రైతులు సాగు చేసిన మినుము పంట నీట మునిగిపోయి మొక్కలు దెబ్బతిని ఇక పంట పనికిరాదనే విధంగా మారింది. ఈ సమయంలో ఎలాగైనా సరే పంటను రక్షించుకోవాలన్న ఆశతో రైతన్నలు భూమిలోని అధిక తేమను తట్టుకునేందుకు, కొమ్మలు విరివిగా వచ్చేందుకు రకరకాల మందులను పిచికారి చేస్తున్నారు. అయితే నువ్వు, శనగ లాంటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నప్పటికి మినుము పంట మాత్రం కొద్దికొద్దిగా కోలుకుంటోంది. వర్షంలో దెబ్బతిన్న పంటను దున్నేసి మరో పంటను సాగు చేయలేక రైతులు ఉన్న పంటనే దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పంటను చెడగొడితే మళ్లీ అదే పంటను సాగు చేసేందుకు సాగు కాలం సహకరించకపోవడం, సమయం లేకపోవడంతో రైతులు ఉన్న అరకొర పంటకే పురుగు మందులు పిచికారి చేసుకుని నిలుపుకుంటున్నారు. మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో ఈ ఏడాది సుమారు వెయ్యి ఎకరాల్లో మినుము పం ట సాగు చేయగా 710 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. దెబ్బతిన్న వాటిలో ఎక్కువ భాగం లోతట్టు ప్రాంతాల్లో సాగు చేసిన పంట దెబ్బతినిం ది. మెట్టప్రాంతాల్లో సాగు చేసిన మినుము పంట అరకొరగా దక్కింది. ఏది ఏమైనప్పటికి మినుము పంట కోలుకున్నప్పటికి మందుల ఖర్చులు, ఇతర ఖర్చులు అధికమై పెట్టుబడి కూడా రాని పరిస్థితులు ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. 

 నాలుగు ఎకరాల్లో మినుము  సాగు చేశా 

సర్విరెడ్డిపల్లె రెవెన్యూ విలేజ్‌పరిధిలో నాలుగు ఎకరాలు మినుము పంట సాగు చేశా. అధిక వర్షాల ధాటికి  పంట పూర్తిగా దెబ్బతినింది. అయితే మళ్లీ పంటను సాగు చేసేందుకు సమయం లేకపోవడంతో ఉన్న అరకొర పంటకే ఎరువులు, మందులు పిచికారి చేశారు. నాలుగు ఎకరాలకు ఇప్పటికి రూ.60 వేలు సాగు ఖర్చు అయింది. ఇందులో బాగా పంట చేతికొచ్చే సమయంలో రూ.60 వేలు అయినా వస్తాయో రావో అనుమానంగా ఉంది. 

- రమణ, మినుమురైతు, కానపల్లె



Updated Date - 2020-12-18T04:56:53+05:30 IST