-
-
Home » Andhra Pradesh » Kadapa » Migrant workers are coming
-
కరోనాపై గెలిచారు
ABN , First Publish Date - 2020-05-13T08:05:22+05:30 IST
జిల్లాలో కరోనా బాధితులు కోలుకుంటున్నారు. కరోనా వైర్‌సతో పోరాడి విజయం సాధించి సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు

తిరుపతి, కడప ఆసుపత్రుల నుంచి పది మంది డిశ్చార్జ్
కోలుకున్న వారి సంఖ్య 56
వలస కూలీలు వస్తున్నారు
అప్రమత్తమవుతున్న జిల్లా అధికారులు
ఇప్పటికే జిల్లాకు చేరిన 300 మంది కూలీలు
మరో రెండు రోజుల్లో కువైత్ నుంచి రానున్న ప్రవాసాంధ్రులు
కడప, మే 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కరోనా బాధితులు కోలుకుంటున్నారు. కరోనా వైర్‌సతో పోరాడి విజయం సాధించి సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు 46 మంది డిశ్చార్జ్ కాగా మంగళవారం తిరుపతి రాష్ట్ర కోవిడ్-19 ఆసుపత్రి, కడప ఫాతిమా మెడికల్ కాలేజీ జిల్లా కోవిడ్-19 ఆసుపత్రి నుంచి పది మందిని డిశ్చార్జ్ చేశారు. తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు చెందిన ఒక్కొక్కరిని, కడప ఫాతిమా మెడికల్ కాలేజీ ఆసుపత్రి నుంచి ఎర్రగుంట్లకు చెందిన ఇద్దరు, ప్రొద్దుటూరుకు చెందిన నలుగురు, మైదుకూరు, చెన్నూరు నుంచి ఒక్కొక్కరు చొప్పున సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు చేరారు. వారిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైద్యులు, రెవెన్యూ అధికారులు ఇంటి దగ్గర వదిలి వచ్చారు. వీరితో కలిపితే కోలుకున్న వారి సంఖ్య 56కు చేరింది.
వలస కూలీలు వస్తున్నారు
ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో ఉపాధి కోసం వెళ్లిన వలస కూలీలు జిల్లాకు వస్తున్నారు. ఇప్పటికే 300 మంది జిల్లాకు చేరుకున్నారు. మరికొందరు కూడా వచ్చేందుకు సన్నాహాలు చేసుకున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీల నుంచి కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన వలస కూలీల్లో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. అలాగే మరో రెండు, మూడు రోజుల్లో కువైత్ నుంచి కూడా ఎన్‌ఆర్‌ఐలు భారీగా వచ్చే అవకాశం ఉంది. వారందరినీ దృష్టిలో ఉంచుకుని మండల కేంద్రాల్లో, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల్లో ప్రత్యేక క్వారంటైన్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే జిల్లాలో ఉన్న ఇతర రాష్ట్రాల వలస కూలీలను స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం 280 మంది రాజస్తాన్ వలస కూలీలను ప్రత్యేక బస్సుల్లో కర్నూలుకు పంపించారు. అక్కడి నుంచి శ్రామిక రైళ్ల ద్వారా రాజస్తాన్‌కు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.
కరోనా అప్‌డేట్స్
పట్టణం మొత్తం డిశ్చార్జి
కడప 25 9
ప్రొద్దుటూరు 41 22
పులివెందుల 4 4
వేంపల్లె 2 2
బద్వేలు 4 4
మైదుకూరు 4 4
ఎర్రగుంట్ల 12 7
కమలాపురం 1 1
సీకేదిన్నె 1 1
చెన్నూరు 2 2
పుల్లంపేట 1 --
మొత్తం 97 56
జిల్లాలో కరోనా వైరస్ శాంపిల్స్ రిజల్ట్స్
మొత్తం శాంపిల్స్ 17405
రిజల్ట్స్ వచ్చినవి 16017
నెగటివ్ 15920
పాజిటివ్ 97
రిజల్ట్స్ రావలసినవి 1388
మే 12వ తేదీ తీసిన శాంపిల్స్ 956