పులివెందులలో 3 సూక్ష్మ సాగు పథకాలు

ABN , First Publish Date - 2020-11-27T06:57:47+05:30 IST

పులివెందులలో రూ.1,256 కోట్లతో మూడు సూక్ష్మ సాగునీటి పథకాలను అమలు చేసి 1,22,489 ఎకరాలకు సాగు నీరందించేందుకు జల వనరులశాఖ పరిపాలనా ఆమోదం తెలిపింది.

పులివెందులలో 3 సూక్ష్మ సాగు పథకాలు

1.22 లక్షల ఎకరాలు లక్ష్యం.. 1,256 కోట్లు మంజూరు

కడప, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): కడప జిల్లా పులివెందులలో రూ.1,256 కోట్లతో మూడు సూక్ష్మ సాగునీటి పథకాలను అమలు చేసి 1,22,489 ఎకరాలకు సాగు నీరందించేందుకు జల వనరులశాఖ పరిపాలనా ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ ఉత్తర్వు జారీ చేశారు. ఇందులో ఒకటి.. పులివెందుల బ్రాంచి కెనాల్‌ (పీబీసీ) మైక్రో ఇరిగేషన్‌ కింద 45,589 ఎకరాలకు సాగు నీరందించేందుకు రూ.470 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. రెండోది.. కడప బ్రాంచి కెనాల్‌ (లింగాల కెనాల్‌) రెండో దశ డిసి్ట్రబ్యూషన్‌ నెట్‌వర్క్‌ పనుల్లో భాగంగా.. సంపులు, పంపింగ్‌ సిస్టమ్‌, పైప్‌లైన్లు, సీబీఆర్‌ కుడి కాలువ కమాండ్‌ ఏరియాలో 39,400 ఎకరాలకు సాగునీరందించే పథకం కోసం రూ.419 కోట్లు. ఇక.. గండికోట ఎత్తిపోతల పథకం (జీకేఎల్‌ఐఎస్‌) అభివృద్ధిలో భాగంగా 37,500 ఎకరాల సాగుకు రూ.367 కోట్లు అంచనా. మొత్తం రూ.1,256 కోట్లు వ్యయం చేసి 1,22,489 ఎకరాలకు సాగు నీరందించాలని జలవనరుల శాఖ తీర్మానించింది. వీటితో పాటు మరో రూ.39 లక్షలతో 4 పథకాలను పులివెందుల్లో అమలు చేసేందుకు నిర్ణయించింది.

Read more