-
-
Home » Andhra Pradesh » Kadapa » market committee meeting
-
మార్కెట్ తరలింపునకు కుట్ర
ABN , First Publish Date - 2020-11-26T04:13:37+05:30 IST
ఆధునికీకరణ పేరిట మార్కెట్‌ను శాశ్వతంగా తరలించే కుట్ర ఉందని, ప్రస్తుత మార్కెట్‌లో మరిన్ని వసతులు మెరుగుపరిస్తే చాలని మార్కెట్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఖలందర్ తెలిపారు.

కుటుంబాలతో అమరావతికి వెళ్ళి ఆందోళన చేస్తాం
మార్కెట్ పరిరక్షణ కమిటీ నేతల వెల్లడి
ప్రొద్దుటూరు అర్బన్, నవంబరు 25 : ఆధునికీకరణ పేరిట మార్కెట్‌ను శాశ్వతంగా తరలించే కుట్ర ఉందని, ప్రస్తుత మార్కెట్‌లో మరిన్ని వసతులు మెరుగుపరిస్తే చాలని మార్కెట్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఖలందర్ తెలిపారు. బుధవారం స్థానిక కూరగాయల మార్కెట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మార్కెట్ ఆధునికీకరణపై హైకోర్టులో స్టే ఉందన్నారు. స్టే తొలగిపోకుండా మార్కెట్‌ను ఆధునికీకరించడం చట్ట వ్యతిరేకమన్నారు. మార్కెట్‌ను నమ్ముకొని వందలాది కుటుంబాలు జీవనోపాధిని పొందుతున్నాయన్నారు.
గతంలో మార్కెట్‌ను కూల్చితే బుల్‌డోజర్‌కు మొదట నేనే అడ్డుపడతానని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి హామీ ఇచ్చారని, నేడు మాత్రం బయటికి వెళ్ళకుంటే మెడపట్టి లాగుతానంటానంటున్నారన్నారు. రెండోసారి ఆయన గెలుపులో మెజారిటీలో మార్కెట్ వ్వాపారులు ఉన్నారనేది మరిచిపోవద్దన్నారు. మార్కెట్ యార్డులోని స్థలాలు విక్రయాలు జరిగాయని అది వివాదాస్పద స్థలమని తెలిసి అక్కడికి తరలించాలనుకోవడం మార్కెట్ వ్వాపారులను రోడ్లపాలు చేయడమేనన్నారు. మొండిగా నిర్ణయాలు తీసుకుంటే అమరావతికి కుటుంబాలతో సహా వెళ్ళి ఆమరణ దీక్ష చేస్తామని హెచ్చరించారు.
రాజకీయాలకు ఇందులో తావు లేదన్నారు. మాకు అండగా వచ్చే ప్రతిఒక్కరి మద్దతు తీసుకుంటామన్నారు. సమావేశంలో మార్కెట్ పరిరక్షణ కమిటీ గౌరవ సలహాదారుడు షబ్బీర్, మహేంద్ర, ఖాసిం, వేణుగోపాల్‌రెడ్డి, మహమ్మద్ గౌస్, ఖాదర్‌లతో పాటు వ్యాపారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.