భక్తుల కొంగుబంగారం పొలతల మల్లికార్జునుడు
ABN , First Publish Date - 2020-02-18T06:32:41+05:30 IST
జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో పొలతల క్షేత్రం ముఖ్యమైనది. నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది.
20వ తేదీ నుంచి ఉత్సవాలు
పెండ్లిమర్రి, ఫిబ్రవరి 17: జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో పొలతల క్షేత్రం ముఖ్యమైనది. నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 20వ తేదీ నుంచి మూడురోజుల పాటు పార్వతి సమేత మల్లికార్జునస్వామిని భక్తులు విశేషంగా దర్శించుకుంటారు. భక్తుల శివ నామస్మరణతో పొలతల క్షేత్రం మార్మోగనుంది. మండల పరిధిలోని గంగనపల్లె పంచాయతీ శేషాచల పర్వత శ్రేణుల్లోని పాలకొండల్లో మల్లికార్జునస్వామి కొలువై ఉన్నాడు. స్వామివారు భక్తుల కోరికలు తీరుస్తూ కొంగుబంగారంలా విరాజిల్లుతున్నాడు. ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి, అమ్మవార్లతో పాటు అక్కదేవతలు, బండెన్న స్వామిని దర్శించుకుంటారు. పొలతల క్షేత్రం ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడా లేని విధంగా పార్వతీ సమేత మల్లికార్జునుడితో పాటు అక్కదేవతలు, బండెన్న, వినాయక, సుబ్రమణ్యస్వాములు ఇక్కడ పూజలందుకుంటారు.
పొలతలకు చేరే మార్గం
పొలతల ఆలయానికి వెళ్లేందుకు ప్రతి సోమవారం కడప ఆర్టీసీ బస్టాండు నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతారు.
కడప నుంచి రాయచోటి రోడ్డులోని మూలవంక మీదుగా రోడ్డు మార్గన 22 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పొలతల చేరుకోవచ్చు.
పులివెందుల వైపు నుంచి వచ్చేవారు కడప-పులివెందుల రోడ్డులోని వెల్లటూరు గ్రామం వద్ద ఆర్చీ వద్ద నుంచి తిప్పిరెడ్డిపల్లె మీదుగా ఈ క్షేత్రం చేరుకోవచ్చు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కడప, పులివెందుల, రాయచోటి, ప్రొద్దుటూరు, కదిరి ప్రాంతాల నుంచి దాదాపు 300 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ వారు నడుపుతారు.
పొలతల స్థల పురాణం
లోక కల్యాణార్థం శివపార్వతులు ఆకాశ మార్గాన సంచరిస్తూ పొలతల క్షేత్రంలో కాలు మోపగా అక్కడ కొంత భూమి కుంచించుకుపోయింది. ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో కాలు మోపగా అక్కడ ఓంకార శబ్ధంతో గంధ శిలలు ప్రత్యక్షమయ్యాయని చెబుతారు. ఈ శిలలు చాలా కఠినంగా పులితల మాదిరిగా ఉండడంతో మొదట పులితలగా ప్రసిద్ధి చెంది, కాలక్రమేణా పొలతలగా మారింది.
ఇక్కడి విశేషం
సీతమ్మ రాకను అన్వేషిస్తూ రామలక్ష్మణులు పొలతల క్షేత్రానికి చేరుకున్నారు. కోనేటిలో స్నానమాచరించి శివుడిని దర్శించి పునీతులయ్యారని పురాణాలు చెబుతున్నాయి. ఆ తరువాత కాలంలో పాండవులు తమ వనవాస కాలంలో అర్జునుడు కంద మూలాలు, మల్లెలతో పూజించినందున మల్లికార్జునుడుగా మారారని పురాణ ఇతిహాసం.
అక్కదేవతల చరిత్ర
ఈ క్షేత్రంలో ఏడుగురు అక్కదేవతలు పెద్దవార మలమ్మ, చిన్నవార మల్లమ్మ, నాగమునెమ్మ, దేవకన్యక, మల్లమ్మ, సూర్యగన్యక, చంద్ర కన్యక, వారి అన్న పులి బండెన్న నిత్యం స్వామివారికి పూజలు చేస్తుండేవారు. ఇక్కడి కోనేటిలో మహిళలు మునిగి తడి వస్త్రంతో ప్రార్థిస్తే భూత ప్రేత పిశాచాలు దగ్గరకు రావని, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అలాగే అక్కదేవతల గుడి వెనుక ఉన్న ఉల్లంజి వృక్షానికి ఊయల కట్టి సంతాన ప్రాప్తి కోసం ప్రార్థిస్తారు. గుడి వెనుక భాగంలో ఉన్న బావిలో నీరు తాగితే రోగగ్రస్తులకు ఆరోగ్యం సిద్ధిస్తుందనే నానుడి ఉంది.
పులి బండెన్న
రాక్షస జన్ముడు పులి బండెన్న స్వామి అక్కదేవతల గుడి వెనుక వైపు కొలువై ఉన్నాడు. విశేషమేమంటే ఇక్కడ జంతుబలులు ఇస్తుంటారు. కేవలం స్వామి సమీపంలోనే వండుకుని తినాలి. ఇక్కడ నుంచి బయటికి ఏమీ తీసుకుపోకూడదు. కొబ్బరి చిప్పలు, మాంసం అన్నీ అక్కడే తినాలి. బండెన్న ఆలయానికి మహిళలు రావడం నిషేధం. మాంసాన్ని మహిళలు ముట్టుకోకోకూడదు.
నిత్యాన్నదాన క్షేత్రం ఓ ప్రత్యేకత
ఆలయానికి దిగువ భాగాన కాశిరెడ్డి నాయన విగ్రహం ప్రతిష్ఠించి నిత్యాన్నదాన సత్రాన్ని నిర్మించి పది సంవత్సరాలుగా భక్తులకు అన్నదానం చేస్తున్నారు. 1960లో కాశిరెడ్డి నాయన ఈ పొలతల క్షేత్రాన్ని దర్శించారని, ఇక్కడ శివునికి ప్రత్యేక పూజలు చేశారని చరిత్రకారులు చెబుతున్నారు. ఒక్క మహాశివరాత్రి రోజునే దాదాపు రెండు లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించడం విశేషం.