సాహితీ సిరి.. భూతపురి

ABN , First Publish Date - 2020-02-16T09:39:43+05:30 IST

కడప గడ్డ కవులకు అడ్డా అని నానుడి. ఇలాంటి గడ్డపై పురుడు పోసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, పండితుడు, అవధాని, మహాకవి డాక్టర్‌ భూతపురి సుబ్రహ్మణ్య శర ్మ

సాహితీ సిరి.. భూతపురి

మహాకవిగా గుర్తింపు 

ఎస్వీ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌

కడపలో గజారోహణం, గండపెండేర సత్కారం 

నేడు భూతపురి వర్ధంతి

సీపీ బ్రౌన్‌ లైబ్రరీలో భూతపురి సాహిత్య పురస్కార ప్రదానోత్సవం


కడప(కల్చరల్‌), ఫిబ్రవరి 15 : కడప గడ్డ కవులకు అడ్డా అని నానుడి. ఇలాంటి గడ్డపై పురుడు పోసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, పండితుడు, అవధాని, మహాకవి డాక్టర్‌ భూతపురి సుబ్రహ్మణ్య శర ్మ. ఆయన 14 ఫివ్రబరి 1938న వల్లూరు మండలం తప్పెట్ల కొత్తపల్లెలో భూతపురి పార్వతమ్మ, సుబ్బయ్యశర్మ పుణ్య దంపతులకు జన్మించారు. తండ్రి యజుర్వేదంలో దిట్ట. ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు రాసారు. తల్లి  సంగీత, సాహిత్య విదుషీమణి. సుబ్రహ్మణ్యశర్మ ప్రాథమిక విద్య నిడుజువ్విలో, ఉన్నత విద్య ప్రొద్దుటూరులో జరిగింది. అక్కడే ఉపాధ్యాయ శిక్షణ తీసుకొని ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డారు. తర్వాత టేకూరుపేట, ముద్దనూరు, కొండాపురం, చింతకొమ్మదిన్నెలలో పనిచేసి పదవీవిరమణ పొందారు.


కవితా వ్యాసంగం..

డాక్టర్‌ గడియారం వేంకటశేష శాస్త్రి వద్ద చదువుకున్నారు. దుర్భాక రాజశేఖరశర్మ వారిచే ప్రేరణ పొంది చారిత్రక రచనలకు శ్రీకారం చుట్టారు. డాక్టర్‌ పుట్టపర్తి నారాయణాచార్యుల చేత ప్రభావితులై కావ్య రచనలు చేశారు.


రచనలు

అహల్యా నాటకం, పరమార్ధశ్రీ లఘకృతి, శ్రీమదాంధ్రాభ్యుదయం, శ్రీకృష్ణభారతం, కాదంబరి అనువాదం, శ్రీశైల మహత్యం, భూతపురి రామాయణం వంటి రచనలు చేశారు. సంస్కృతంలో శ్రీభద్రాచల సుప్రభాతం, శ్రీకృష్ణ రక్షణ నాటకం, శ్రీషిర్డీ సాయిబాబా సుప్రభాతం, కనకధారాస్తవం, ఆదిత్య హృదయానికి, యజుర్వేద రుద్రానికి వ్యాఖ్యానాలు రాసారు. రుగ్వేదంలోని నాసదీయ సూక్తాన్ని, గాయత్రీ మంత్రాన్నీ భాస మహాకవి ప్రతిమా నాటకాన్ని అనువదించారు.


అవధానిగా

రాష్ట్రంలోనే గాక తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలో 160 అష్టావధానాలు, 2 శతావధానాలు నిర్వహించారు. తెలుగు విశ్వ విద్యాలయానికి జ్యోతిశ్శాస్త్ర పాఠ్యాంశాలను రాసారు.


పురస్కారాలు..

తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ కావ్యకర్తగా గౌరవించగా, ఎస్వీ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. తిరుపతి సంస్కృత విద్యా పీఠం ఉభయ కవిసార్వభౌమునిగా బిరుదిచ్చింది. అభినవ పెద్దన, అభినవ పోతన, కవిభూషణ, కవితా సుధాకర వంటి బిరుదులెన్నో పొందారు. తెలుగు సాహితీ జగత్తులో చారిత్రక ప్రబంధాలను రచించి గజారోహణ, స్వర్ణ హస్త కంకణ, సువర్ణ గండపెండేర సత్కారాలను అందుకొన్నారు. 16 ఫివ్రబరి 2002న ఆయన స్వర్గస్తులయ్యారు.


స్మారక సంస్థ...

భూతపురి సుబ్రహ్మణ్యశర్మ స్మారకంగా వారి తనయులు భూతపురి శివరామ సురేంద్రశర్మ, గోపాలకృష్ణశాస్త్రిలు 2003 లో ఒక ట్రస్టును ఏర్పాటు చేసి ఏటా సాహిత్యసేవలో ఘనులైన వారిని గుర్తించి పురస్కారాలను అందిస్తున్నారు. ఆచార్య శలాక రఘనాధ శర్మ, తుమ్మపూడి కోటేశ్వరరావు, ఉత్పల సత్యనారాయణ, ముదిపర్తి కొండమాచార్య, డాక్టర్‌ రవ్వా శ్రీహరి, వీవీఎల్‌. నరసింహారావు, సముద్రాల అక్ష్మణయ్య, బేతవోలు రామబ్రహ్మం, ఆశావాది ప్రకాశరావు, అప్పజోడు వేంకట సుబ్బయ్య, నరాల రామారెడ్డి, రాణి సదాశివమూర్తి వంటి వారు ఈ పురస్కారాలు అందుకొన్నారు. ఆదివారం 18వ సాహిత్య పురస్కారం గండ్లూరి దత్తాత్రేయ శర్మకు అందివ్వనున్నారు. సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధనాకేంద్రంలో ఉదయం 10 గంటలకు ఆ పురస్కార సభ జరగనుంది.

Updated Date - 2020-02-16T09:39:43+05:30 IST