భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం

ABN , First Publish Date - 2020-11-26T05:06:41+05:30 IST

కడప ఎయిర్‌పోర్టు విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులందరికీ భూసేకరణ చట్టం ప్రకారం పరిహారాన్ని అందజేస్తామని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ పేర్కొన్నారు.

భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం
రైతులనుద్దేశించి మాట్లాడుతున్న కలెక్టర్‌ సి.హరికిరణ్‌

కలెక్టర్‌ సి.హరికిరణ్‌

కడప(కలెక్టరేట్‌), నవబంరు 25: కడప ఎయిర్‌పోర్టు విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులందరికీ భూసేకరణ చట్టం ప్రకారం పరిహారాన్ని అందజేస్తామని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబరులో ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాధ్‌రెడ్డి, జేసీ ఎం.గౌతమి, సబ్‌కలెక్టర్‌ పృథ్వీతేజ్‌లతో కలసి చిన్నమాచుపల్లి, పాలెంపల్లి రైతులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కడప విమానాశ్రయాన్ని మరింత విస్తరించాల్సి ఉందన్నారు. అందుకోసం పరిసర ప్రాంతాల్లో సుమారు 67 ఎకరాల భూములను రైతుల నుంచి సేకరించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో చెన్నూరు మండల పరిధిలోని చిన్న మాచుపల్లి రైతులకు చెందిన 20 ఎకరాలను, కడప మండలం పరిధిలోని పాలెంపల్లి రైతులకు చెందిన 47 ఎకరాల భూములను సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆ ప్రాంత రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించామని, ఆ మేరకు నివేదికలు పంపడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కడప తహసీల్దారు శివరామిరెడ్డి, చెన్నూరు తహసీల్దారు అనురాధ, రైతులు పాల్గొన్నారు.


సోలార్‌ పార్కు ప్రయోజనాలు వివరించాలి

సోలార్‌పార్కు ఏర్పాటుతో ఆ ప్రాంతవాసులకు కలిగే ప్రయోజనాలను గ్రామ సభల ద్వారా వివరించాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ ఏపీఎస్‌ పీసీఎల్‌ ప్రతినిధులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో గాలివీడు సోలార్‌ పార్కు ప్రాంత అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎక్కడైతే సోలర్‌ ప్రాజెక్టు ఏర్పాటవుతుందో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసే బాధ్యత కూడా పార్కు కమిటీదే అన్నారు. సోలార్‌ ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ, కడప సబ్‌కలెక్టర్‌ పృథ్వీతేజ్‌, సీపీఓ తిప్పే స్వామి, ఏపీఎస్‌ పీసీఎల్‌ సీఈఓ రమణారెడ్డి, ఇంజనీర్లు శివశంకర్‌, మల్లిఖార్జునప్ప, కొండలరావు, ఆంజనేయులు పాల్గొన్నారు.


నిత్య ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత : కలెక్టర్‌ 

కమలాపురం, నవంబరు 25: రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని కలెక్టర్‌ హరికిరణ్‌ అన్నారు. కమలాపురం పట్టణంలో రూ.17.5 లక్షలతో నిర్మించిన వైఎ్‌సఆర్‌ విలేజ్‌ క్లీనిక్‌ను ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డితో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే పూర్తయి ప్రారంభమైన మొదటి విలేజ్‌ క్లీనిక్‌ ఇదే అన్నారు. అలాగే సచివాలయం, ఆర్‌బీకే, వైఎ్‌సఆర్‌ విలేజ్‌ క్లీనిక్‌లు మూడు నిర్మాణాలను రూ.80 లక్షలతో పూర్తి చేసుకున్న ఘనత కూడా కమలాపురం నియోజకవర్గానికే దక్కిందన్నారు. ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాలు సుభిక్షంగా ఉన్నాయన్నారు. అనంతరం కలెక్టర్‌ నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని పరిశీలించారు. పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసి వసతులపై ఆరా తీశారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, డీఎంహెచ్‌వో అనిల్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-26T05:06:41+05:30 IST