కుందూ విస్తరణకు ఓకే

ABN , First Publish Date - 2020-09-16T18:14:20+05:30 IST

ఎక్కడికక్కడ ఆక్రమణకు గురైంది. పూడిక, ముళ్లపొదలతో నిండిపోయింది. నదిలో..

కుందూ విస్తరణకు ఓకే

జిల్లా జీవనాడి కుందూనది తీరప్రాంతం 


(కడప-ఆంధ్రజ్యోతి): ఎక్కడికక్కడ ఆక్రమణకు గురైంది. పూడిక, ముళ్లపొదలతో నిండిపోయింది. నదిలో 25 వేల క్యూసెక్కుల వరద దాటితే పొలాలు మునిగిపోతున్నాయి. రాయలసీమ దుర్భిక్ష నివాణ పథకం కింద కుందూ ద్వారా 35 వేల క్యూసెక్కులు నెల్లూరు జిల్లా సోమశిల, కండలేరు జలాశయాలకు మళ్లించాలన్నది లక్ష్యం. అందుకు అనుగుణంగా కుందూ విస్తరణకు సీఎం జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.1,501 కోట్లతో చేపట్టిన కుందూ, నిప్పులవాగు, గాలేరు నదుల విస్తరణకు కీలకమైన జుడిషియల్‌ కమిటీ ఆమోద ముద్ర వేసింది. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు చేపట్టే దిశగా జలవనరుల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో నదితీరంలో వందలాది ఎకరాలు ఆక్రమించిన వారిలో అలజడి మొదలైంది.


జిల్లాలో ప్రవహిస్తున్న ప్రధాన నదుల్లో కుందూ ఒకటి. జిల్లాలో కేసీ కాల్వ కింద 75 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. శ్రీశైలం జలాశయం ఎగువన పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా తీసుకునే కృష్ణా జలాలను బానకచర్ల్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ (సీబీఆర్‌) నుంచి ఎస్కేప్‌ చానల్‌ ద్వారా నిప్పులవాగు, గాలేరు రివర్‌కు, అక్కడి నుంచి కుందూ నదికి మళ్లిస్తారు. కుందూలో చేరిన కృష్ణా జలాలు ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట నుంచి కేసీ, కడప బ్రాంచి కాలువకు సాగునీటిని ఇస్తారు. పెన్నా నుంచి నెల్లూరు జిల్లాలోని సోమశిల, కండలేరు జలశయాలకు నీరు చేరుతుంది. ప్రస్తుతం కుందూలో 15-25 వేల క్యూసెక్కులకు మంచి వరద వస్తే పొలాలు మునిగిపోతున్నాయి. 35 వేల క్యూసెక్కులు విడుదల చేస్తే అన్నదాతలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.


దీంతో కర్నూలు జిల్లా బీసీఆర్‌ 0.00 కి.మీల నుంచి ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట దగ్గర 189.20 కి.మీల వరకు ఎస్కేప్‌ చానల్‌, నిప్పులవాగు, గాలేరు నది, కందూ నది విస్తరణ(అభివృద్ధి)కి శ్రీకారం చుట్టారు. రూ.1,501 కోట్లతో పరిపాలన ఆమోదం వచ్చింది. టెండర్లు పిలవడానికి వీలుగా జుడిషియల్‌ ప్రివ్యూ కమిటీకి ఫైలు పంపారు. అన్ని విధాలుగా పరిశీలించిన ప్రివ్యూ కమిటీ పనులకు అనుమతి ఇస్తూ ఆమోద ముద్ర వేసింది. రివర్స్‌ టెండరింగ్‌ విధానం ద్వారా టెండర్లు నిర్వహించేందుకు జలవనరుల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా.. తమకు అనుకూలమైన కాంట్రాక్ట్‌ సంస్థకు టెండరు దక్కించుకునే విదంగా అధికార పార్టీ జిల్లా పెద్దలు అప్పుడే తెర వెనుక యత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 


చేపట్టే పనులు ఇవీ

35 వేల ప్రవాహ సామర్థ్యానికి వీలుగా కుందూ నదిని విస్తరిస్తారు. అందులో భాగంగా సివిల్‌ వర్క్స్‌కు రూ.1,266 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ఎక్కువ భాగం మట్టిపనులు, ఆయా గ్రామాలకు హైలెవల్‌ బ్రిడ్జీలు నిర్మిస్తారు. రూ.59 కోట్లతో ఎలకో్ట్ర-మెకానికల్‌ పనులు చేపడుతున్నారు. 248 ఎకరాల భూ సేకరణ చేయాలి. ఎకరాకు రూ.15 లక్షలు చెల్లించేలా డీపీఆర్‌ తయారు చేశారు. 


కబ్జాదారుల్లో అలజడి 

జిల్లాలో పెద్దముడియం, రాజుపాలెం, చాపాడు, వల్లూరు మండల్లాల్లో కుందూ నది సుమారుగా 110 కి.మీలు ప్రవహిస్తోంది. ఇరువైపుల 200 మీటర్లకుపైగా కబ్జాకు గురైంది. పలువురు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు, నది ఒడ్డున ఉన్న రైతులు వందల ఎకరాల నది పరంబోకు భూములను అక్రమించుకున్నారు. కొందరైతే రెవిన్యూ అధికారులతో కుమ్మక్కై పట్టాలు చేసుకుంటే.. మరికొందరు ఆన్‌లైన్లో పేర్లు మార్పు చేసుకున్నారు. 


35 వేల క్యూసెక్కుల ప్రవాహానికి వీలుగా నది విస్తరిస్తే ఆక్రమణదారులు కబ్జా భూములను కోల్పోతారు. ప్రస్తుతం ఎకరా రూ.10-15 లక్షలకుపైగా పలుకుతుండడంతో ఎలా వదులు కోవాలి..? ఏన్నో ఏళ్లగా సాగు చేసుకుంటున్నాం..? పరిహారమైనా ఇవ్వాలని కబ్జాదారులు అప్పుడే రాజకీయ నాయకులను ఆశ్రయించినట్లు సమాచారం.


రాజోలి రిజర్వాయర్‌కు ఆమోదం

జిల్లాలో కేసీ కాలువ పరిధిలో 75 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. ఏటేటా పంట చివరి దశలో తడులు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేసీ ఆయకట్టును రక్షించేందుకు 2.95 టీఎంసీల సామర్థ్యంతో రూ.309.95 కోట్లతో రాజోలి జలాశయం నిర్మించనున్నారు. 2019 డిసెంబర్‌ 23న సీఎం జగన్‌ శంకుస్థాన చేశారు. ఇప్పటికే పరిపాలన అనుమతులు, నిధులు మంజూరు చేశారు. ఈ రిజర్వాయర్‌ నిర్మాణానికి జుడిషియన్‌ ప్రివ్యూ కమిటీ ఆమోదం తెలిపింది. 

Updated Date - 2020-09-16T18:14:20+05:30 IST