చస్తే ఆరడుగుల జాగా చూపించలేరా?

ABN , First Publish Date - 2020-10-14T19:27:50+05:30 IST

తమ కాలనీవాసులు చస్తే ఆరడుగుల జాగా కూడా లేదని, 30 ఏళ్లుగా అధికా రులు, రాజకీయ నాయకుల..

చస్తే ఆరడుగుల జాగా చూపించలేరా?

శవంతో తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా


ప్రొద్దుటూరు: తమ కాలనీవాసులు చస్తే ఆరడుగుల జాగా కూడా లేదని, 30 ఏళ్లుగా అధికా రులు, రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే లేరని మండలంలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీ కానపల్లె ఎస్సీ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కాలనీకి చెందిన ఆకుమల్ల జయరాజ్‌ అనే వ్యక్తి చనిపోగా అతడికి అంత్యక్రియలు జరిపేందుకు శ్మశాన వాటిక లేక తహసీల్దారు కార్యాలయం ఎదుట శవంతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ 1983లో ప్రభుత్వం తమకు ఉచితంగా ఇళ్లస్థలాలను ఇచ్చిందని, అయితే ఆ కాలనీకి శ్మశాన వాటికను మం జూరు చేయకుండానే వదిలేసిందన్నారు. గత ఏడా ది జూలై 20వ తేదీన గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డితో తమ ఆవేదనను, సమస్యను తెలుపుకున్నామని ఆయ న కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారే తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు. మనిషి చనిపోయినందుకు ఏడుపు రావడం లేదని, చనిపోయిన వ్యక్తిని పూడ్చాలంటే ఎక్కడ పూడ్చాలో తెలియక ఏడుపు వస్తోందని దళిత సంఘం నాయకులు నాగభూషణం, పురుషోత్తం, మనేషు, మత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు.


50 సంవత్సరాల క్రితం తమ పాత ఊరిలో శ్మశానం ఉండేదని, కానీ అందులో ఇప్పుడు పంటలు వేస్తున్నారని, తమకు శ్మశానమే లేకుండాపోయిందని వారు తహసీల్దారు దృష్టికి తెచ్చారు. అప్పటి నుంచి ప్రత్యామ్నాయంగా అగస్త్యేశ్వరస్వామి ఆలయ మాన్యంలో, కాలువ పొరంబోకులో పూడ్చుతుండేవారమన్నారు. ప్రస్తుతం అగస్త్యేశ్వర ఆలయం భూమి వేలం పాట వేసి పంటల సాగుకు సిద్ధం చేశారన్నారు. ఇందులో శవాలను పూడ్చితే అపరాధ రుసుంతో పాటు కేసులు పెడతామని దేవదాయ శాఖ అధికారులు దండోరా ద్వారా, కరపత్రాల ద్వారా తెలియజేశారన్నారు. కాలువ పొరంబోకు భూములు కూడా కబ్జాకు గురి కావడంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు.


తహసీల్దారు నజీర్‌ అహమ్మద్‌ స్పందిస్తూ ఎస్సీ కాలనీకి శ్మశానం కావాలనే అంశం ఇంతకుముందే తన దృష్టికి వచ్చిందని, ఈ విషయాన్ని కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. గ్రామ సమీపంలో ప్రభుత్వ భూమి ఉన్నా లేదంటే ఎవరైనా పట్టా భూమి శ్మశానానికి ఇస్తామని ముందుకొచ్చినా ఆ భూమికి నష్టపరిహారం చెల్లించి శ్మశాన స్థలంగా మంజూరు చేయిస్తానన్నారు. అందుకు ఎస్సీ కాలనీ ప్రజలు శాంతించి శవాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లారు. 


Updated Date - 2020-10-14T19:27:50+05:30 IST