ఆశ.. నిరాశ..!

ABN , First Publish Date - 2020-03-21T08:27:32+05:30 IST

తెలుగుగంగ ప్రాజెక్టులో భాగంగా బ్రహ్మం సాగర్‌ నిర్మించారు. జీవనాధారమైన పంటచేలు.. నీడనిచ్చే నివాసాలు ఆ జలాశయం ముంపునకు...

ఆశ.. నిరాశ..!

20కేడీపీ101: బ్రహ్మంసాగర్‌ జలాశయం


  • బ్రహ్మంసాగర్‌ ముంపు బాధితులకు.. చిత్తూరు ఇరిగేషన్‌ సర్కిల్‌లో ఉద్యోగాలు
  • 14 మందికి ఆర్డర్‌ ఇచ్చిన కడప ఎన్టీఆర్‌ టీజీపీ ఎస్‌ఈ
  • ఆశగా అక్కడికి వెళితే వెనక్కి పంపిన వైనం 
  • మరో 268 మంది ఉద్యోగాల కోసం నిరీక్షణ

కడప, మార్చి 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలుగుగంగ ప్రాజెక్టులో భాగంగా బ్రహ్మం సాగర్‌ నిర్మించారు. జీవనాధారమైన పంటచేలు.. నీడనిచ్చే నివాసాలు ఆ జలాశయం ముంపునకు గురయ్యాయి. కరువు రైతులు పచ్చగా ఉండాలని భావించిన పలువురు పొలాలు, ఇళ్లు త్యాగం చేసి సర్కారోళ్లు ఇచ్చిన అరకొర పరిహారంతో ఊళ్లు ఖాళీ చేశారు. జీవో ఎంఎస్‌ నం.98 ప్రకారం అర్హులైన వారికి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామంది. 268 మందితో అర్హుల సీనియారిటీ జాబితా తయారు చేశారు. ఏళ్లు గడిచినా ఉద్యోగాలు రాలేదు. చిత్తూరులో క్లర్క్స్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు వచ్చాయి.. వెళ్లి విధుల్లో చేరమని 14 మంది జాబితాతో కడప ఎన్టీఆర్‌-తెలుగుగంగ ప్రాజెక్టు సర్కిల్‌ అధికారులు ఉత్తర్వులు చేతిలో పెట్టారు. ఆనందంతో అక్కడికెళితే నిరాశే ఎదురైంది. తమ పరిస్థితి ఏమిటీ..? ఉద్యోగాలు ఇస్తారా.. ఇవ్వరా..? కడప సర్కిల్‌ పరిధిలోనే ఖాళీలు పెట్టుకొని చిత్తూరుకు పంపినట్లు..? అని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 5.75 లక్షల ఎకరాలకు సాగునీరు, చెన్నై నగరానికి 15 టీఎంసీల తాగునీరు అందించాలనే లక్ష్యంగా తెలుగుగంగ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 1985 మే 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ శంకుస్థాపన చేశారు. తెలుగుగంగ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. 17 టీఎంసీల సామర్థ్యంతో బ్రహ్మం సాగర్‌, 1.133 టీఎంసీల సామర్థ్యంతో ఎస్‌ఆర్‌-1, 2.444 టీఎంసీల సామర్థ్యంతో ఎస్‌ఆర్‌-2 జలాశయాలను నిర్మించారు. బ్రహ్మంసాగర్‌ను 1983-84లో నిర్మాణం చేపట్టి 2006లో పూర్తి చేశారు. బసవపురం, ఓబులరాజుపల్లె, జంగంరాజుపల్లె, జెడ్‌.కొత్తపల్లె, గొల్లపల్లె, చీకటివారిపల్లె గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. 1984 నుంచి 1989 వరకు ముంపు గ్రామాల్లో 1,985 కుటుంబాలకు పరిహారం ఇచ్చారు. నివాస గుడిసెకు రూ.2500 - 7 వేలు, పక్కా ఇళ్లకు రూ.70-80 వేలు, సాగునీటి వసతి ఉన్న భూములకు ఎకరాకు రూ.14 వేలు, వర్షాధార మెట్టకు రూ.8వేలు, డీకేటీ పట్టా భూమికి రూ.5వేల చొప్పున పరిహారం ఇచ్చారు. అరకొర పరిహారమే అయినప్పటికీ ఇతర రైతుల బాగుకోసం ముంపుబాధితులు ఊళ్లు ఖాళీ చేశారు. 


ఉద్యోగాల కోసం ఇంకా నిరీక్షణే

ప్రాజెక్టు నిర్మాణాల్లో భూములు కోల్పోయిన నిర్వాసితుల ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని 1986 ఏప్రిల్‌ 15న నాటి ఎన్టీఆర్‌ ప్రభుత్వం జీవో ఎంఎస్‌ నెం.98 జారీ చేసింది. ఈ జీవో మేరకు అర్హులైన 268 మందితో సీనియారిటీ లిస్ట్‌ తయారు చేశారు. ఆ జాబితాలో బీటెక్‌ చదివిన నిరుద్యోగులు ఉన్నారు. ఏదో ఒకరోజు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే ఆశతో ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. ఆ జాబితాలో కొందరికి వయస్సు మీదపడ్డంతో తమ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ విన్నవిస్తున్నారు.


చిత్తూరులో ఉద్యోగం అంటే...

సీనియర్‌ జాబితాలో ఉన్న 268 మందిలో 10 మందికి ఆఫీస్‌ అసిస్టెంట్‌ (అటెండర్‌), నలుగురికి క్లర్క్స్‌ పోస్టులు ఇస్తూ 14 మంది జాబితాతో ఈ ఏడాది జవనరి 22న కడప ఎన్టీఆర్‌-తెలుగుగంగ ప్రాజెక్టు ఎస్‌ఈ ప్రొసిడింగ్‌ ఆర్డర్‌ ఇచ్చారు. విద్యా ధ్రువీకరణ, కులం, ఆధార్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ వంటి ఒరిజినల్‌ సరిఫ్టికేట్లతో చిత్తూరు ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ ఆఫీసులో రిపోర్టు చేసుకోవాలని ఆ ఆర్డరులో తెలిపారు. చిత్తూరు ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఆఫీసుకు వెళ్లిన వారికి నిరుత్సాహమే ఎదురైంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చి ఉద్యోగాలు ఇస్తే మీ ఇంటికే ఉత్తర్వులు పంపుతాం. మా ఆఫీసుకు రావద్దంటూ అక్కడి అధికారులు తేల్చి చెప్పారు. అంతేకాదు.. ఆ ఉత్తర్వులు తమకు వర్తించవని (నాట్‌ అప్లికబుల్‌) రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్‌సీకి చిత్తూరు ఎస్‌ఈ లేఖ రాసినట్లు తెలిసింది. తమ దగ్గర ఉన్న ఖాళీల్లో సగం ప్రభుత్వ నిబంధనల ప్రకారం భర్తీ చేశామని ఆ లేఖలో పేర్కొన్నారు.


కడపలో ఖాళీలు ఉన్నా..

కడప జిల్లా జలవనరుల శాఖ (ప్రాజెక్ట్స్‌) సీఈ కార్యాలయం పరిధిలో 167 ఖాళీలు ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వానికి పంపిన ఖాళీల నివేదికలో జిల్లాలో ఇరిగేన్‌ సీఈ పరిధిలో ఆఫీస్‌ అసిస్టెంట్స్‌ 29, జూనియర్‌ అసిస్టెంట్‌ 13, టైపిస్టులు 11, టెక్నికల్‌ అసిస్టెంట్స్‌ 7 కలిపి 60 పోస్టులు ఖాళీగా చూపారు. జీవో ఎంఎస్‌ నెం.96 ప్రకారం ముంపు బాధితులకు ఖాళీల్లో 30-35 పోస్టులు ముంపుబాధితులకు ఇవ్వవచ్చు. ప్రభుత్వ అనుమతి తీసుకొని ఇక్కడే ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్నా.. చిత్తూరుకు పంపడం వెనుక ఆంతర్యమేమిటీ..? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్‌-టీజీపీ ప్రాజెక్టు ఇప్పటికైనా స్పందించి ఇక్కడే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2020-03-21T08:27:32+05:30 IST