భయం పెరుగుతూ.. ప్రభుత్వం జోగుతూ

ABN , First Publish Date - 2020-03-21T08:24:36+05:30 IST

కరోనా.. కరోనా.. ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఎవరినోట విన్నా.. వినిపిస్తున్న మాట.. సాక్షాత్తూ ప్రపంప ఆరోగ్య సంస్థ మహమ్మరిగా ఈ వ్యాధిని..

భయం పెరుగుతూ.. ప్రభుత్వం జోగుతూ

రాయచోటి, మార్చి 20: కరోనా.. కరోనా.. ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఎవరినోట విన్నా.. వినిపిస్తున్న మాట.. సాక్షాత్తూ ప్రపంప ఆరోగ్య సంస్థ మహమ్మరిగా ఈ వ్యాధిని ప్రకటించింది. మనదేశం జాతీయ విపత్తుగా ప్రకటించింది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తిస్థాయిలో మేలుకొన్నట్లు లేదు. విదేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చిన వాళ్లను కరోనా అనుమానంతో.. 28 రోజుల పాటు స్వీయ గృహనిర్బంధం పాటించమంటోంది. అయితే ఆ నిర్బంధంలో ఉన్న వాళ్లకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలపైన ఏమాత్రం దృష్టి పెట్టలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో విదేశాల నుంచి సొంత ఊరికి వచ్చి.. ఇక్కడ ఇబ్బందులు పడుతున్న బాఽధతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


నాలుగువారాలు ఇంట్లోనే..

రాయచోటికి చెందిన ఓ యువకుడు బతుకు తెరువుకోసం సౌదీఅరేబియాకు వెళ్లాడు. అయితే అతని సోదరుడు ప్రతాప్‌.. అనారోగ్యంతో గత శుక్రవారం చనిపోయాడు. దీంతో ఇతను శనివారం(14వ తేదీ) ఇండియాకు వచ్చాడు. ఇంతలోనే స్థానిక ఆరోగ్య సిబ్బంది అతని వద్దకు వచ్చారు. అంత్యకియ్రల్లో పాల్గొనవద్దని, 28 రోజులు గృహనిర్బంధంలో ఉండాలని చెప్పారు.  తనకు ఎటువంటి అనారోగ్యం లేదని, రియాద్‌ ఎయిర్‌పోర్టులో అన్ని రకాల స్ర్కీనింగ్‌ చేశాకే పంపించారని, చెన్నై ఎయిర్‌పోర్టుకు వస్తే అక్కడ కూడా పరీక్షించిన తర్వాతే ఇంటికి పంపించారని తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆ యువకుడు ఆరోగ్య సిబ్బందికి వివరించాడు. అయినప్పటికీ 28 రోజుల పాటు.. ఎక్కడికీ పోవద్దని, ఇంట్లోనే ఉండాలని ఆరోగ్య సిబ్బంది సూచించారు.


కనీస వసతులేవీ..?

అతడిని ఎక్కడికీ వెళ్లవద్దని చెప్పారే కానీ, కరోనా వ్యాప్తి అరికట్టడానికి కనీస వసతులు కల్పించలేదు. తనతో పాటు సౌదీ నుంచి రెండు మాస్క్‌లు తెచ్చుకున్నాడు. అవి రెండు రోజులకు అయిపోయాయి. ఆ తర్వాత మాస్క్‌లు లేవు. ఆరోగ్య సిబ్బంది కూడా ఇవ్వలేదు. దీంతో చాలా ఇబ్బందిగా ఉందని అతను వాపోయాడు. రియాద్‌ ఎయిర్‌పోర్టులోకి రాగానే.. అక్కడి సిబ్బంది తక్షణం తమకు మాస్క్‌లు ఇచ్చి.. వాటిని ఎలా ఉపయోగించాలో తెలిపారన్నాడు. అదే విధంగా చేతులు శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్స్‌ కూడా ఇచ్చారని తెలిపాడు. అయితే చెన్నై ఎయిర్‌పోర్టులో ఇటువంటివి ఏవీ ఇవ్వలేదని, అదేవిధంగా ఇక్కడ ఆరోగ్యసిబ్బంది ఎవరూ పట్టించుకోలేదని అన్నాడు. ఇలా అయితే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారిని ఏవిధంగా అరికట్టగలమని ప్రశ్నించాడు. ఇది ఒక్క వ్యక్తి అభిప్రాయమే కాదు. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన అందరి అభిప్రాయమూ. ఆవేదనా..


విదేశాల నుంచి 92 మంది రాక..

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న 92 మంది రాయచోటి నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు సొంత ఊళ్లకు వచ్చారు. అందులో ప్రస్తుతం 82 మంది స్వీయ గృహనిర్బంధంలో ఉన్నారు. మిగిలిన వాళ్లకు 28 రోజుల గృహనిర్బంధం పూర్తి అయిపోయింది. ఇలా వచ్చిన వాళ్లను బయటతిరగవద్దని అధికారులు చెప్తున్నారే కానీ.. వాళ్లకు కల్పించాల్సిన సౌకర్యాలపైన ఏమాత్రం దృష్టి పెట్టలేదనే విమర్శలు ఉన్నాయి.


మాస్క్‌ల పంపిణీ ఊసే లేదు

సాధారణంగా కరోనా వైరస్‌ బారిన పడిన వ్యక్తి దగ్గినా తుమ్మినా.. తుంపర్లు ఇతరుల మీద పడినపుడే ఇతరులకు వ్యాపిస్తోంది. దీంతో మూతికి మాస్క్‌ వాడితే కరోనా వ్యాప్తి అరికట్టవచ్చని నిపుణులు చెపుతున్నారు. అదే సమయంలో కరోనా అనుమానితులకు వైద్య సేవలు అందించే వైద్యులు, నర్సులు వంటి వాళ్లు సైతం దీనిబారిన పడే ప్రమాదముంది. అయితే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్యకేంద్రాలకు మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేయలేదని తెలిసింది. జిల్లాలో 11 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, 70కి పైగానే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, వీటికింద సుమారు 500 వరకు ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో వేలమంది సిబ్బంది పనిచేసున్నారు వీరందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీళ్లే కాకుండా.. ఆశా కార్యకర్తలు, వార్డు వలంటీర్లు ఉన్నారు. వీళ్లు నిత్యం ప్రజలతో తిరుగుతుంటారు. వీళ్లకు ఎవ్వరికీ ఇప్పటివరకు మాస్క్‌లు ఇవ్వలేదు. మాస్క్‌లు లేకుండానే విధులు నిర్వహిస్తున్నారు. దీనిపైన వీళ్లు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అవసరమైన మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేయాలని కోరుతున్నారు.


ఇలా చేస్తే..

విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు మాస్క్‌లు, శానిటైజర్లు, డెటాల్‌ సోప్‌ వంటి వాటితో ఒక కిట్‌ ఇస్తే బాగుంటుందని పలువురు అంటున్నారు. లేకపోతే.. వేల కుటుంబాలు  కరోనా బారిన  పడే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. స్వీయ గృహనిర్బంధంలో ఉన్నవారికి ప్రభుత్వమే ప్రోత్సాహకాలు ప్రకటిస్తే మంచిదని, కరోనా త్వరగా అదుపులోకి వస్తుందని అంటున్నారు.

Updated Date - 2020-03-21T08:24:36+05:30 IST